WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కోవింద్‌ ఎంపికపై లాలూ.. నితీశ్‌ మళ్లీ చెరోదారి?

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎంపికపై ప్రతిపక్షాల నుంచిభిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా కాంగ్రెస్‌, తృణమూల్‌ పార్టీలు వ్యతిరేకత చూపిస్తుండగా.. బీఎస్పీ మాయావతి, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌లు మాత్రం తటస్థంగా మాట్లాడుతున్నారు. ఇదిలా ఉండగా.. కోవింద్‌ పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన కొద్ది సమయానికే సీఎం నితీశ్‌ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భంలో నితీశ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రపతి మద్దతు గురించి తానిప్పుడే ఏమీ చెప్పలేనన్నారు. అయితే ఎన్డీయే అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ను ప్రకటించడంపై నితీశ్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని.. ఆయన ఎన్డీయేకు మద్దతిచ్చే అవకాశాలున్నాయని సన్నిహితవర్గాల సమాచారం.కాగా.. లాలూ మాత్రం నితీశ్‌ తీరుపై సుముఖంగా లేరని తెలుస్తోంది. బిహార్‌ సీఎం నితీశ్‌, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌.. అధికారం కోసం ఏళ్లనాటి వైరాన్ని మరచి చేతులు కలిపారు ఈ ఇద్దరు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి రెండు పార్టీలు కూటమిగా ఏర్పడి బిహార్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. 

   అయితే గతకొంతకాలంగా లాలూ.. నితీశ్‌ మధ్య మళ్లీ భేదాభిప్రాయాలు వస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు నితీశ్‌ మద్దతు తెలిపారు. అయితే లాలూ మాత్రం మోదీపై విమర్శలు చేశారు. తాజాగా.. రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ వీరిద్దరి మధ్యా మళ్లీ ఇదే తీరు కన్పించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల లాలూ కుమారులు అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంపై అసహనంగా ఉన్న లాలూ.. ఎన్డీయే అభ్యర్థికి ఎంతమాత్రం మద్దతు తెలపబోరనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో నితీశ్‌, లాలూలు చెరో దారిలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వీరి మద్దతుపై ఎలాంటి ప్రకటనలు రాలేదు. జూన్‌ 22న రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఆ సమావేశంలో ఎవరు ఎవరికి మద్దతిస్తారో తెలుస్తోంది. ఒకవేళ నితీశ్‌ ఎన్డీయే అభ్యర్థి వైపు మొగ్గు చూపితే గనుక కూటమిలో విభేదాలు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

(180)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ