లేటెస్ట్

టీటీడీ ‘ధర్మారెడ్డి’ దూకుడుకు ‘శ్రీనివాసరాజు’తో చెక్‌...!?

టీటీడీ ఇఒ పోస్టు ఆశిస్తున్న అదనపు ఇఓ ధర్మారెడ్డి దూకుడుకు గతంలో తిరుమల జెఇఓగా అనేక సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాసరాజు తనదైన శైలిలో చేస్తోన్న ప్రయత్నాలు త్వరలో కొలిక్కి రాబోతున్నాయని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వంలో డిప్యూటేషన్‌పై బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్రానికి చెందిన శ్రీనివాసరాజును త్వరలో టీటీడీ ఇఓగా నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్‌ను ఐఏఎస్‌ అధికారి శ్రీనివాసరాజు కలిశారని, మార్చి మాసాంతానికి డిప్యూటేషన్‌ రద్దు చేసుకుని రాష్ట్రానికి రండి..వెంటనే టీటీడీ ఇఓగా నియమిస్తానని శ్రీనివాసరాజుకు హామీ ఇచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. టీటీడీ ఇన్‌ఛార్జి ఇఒగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న సిఎంఓ అధికారి జవహర్‌రెడ్డిని అందుకే ఆ పోస్టులో కొనసాగిస్తున్నారని అధికారులు అంటున్నారు.


టీటీడీ ఇఓ పదవిని ఎప్పటి నుంచే ఆశిస్తోన్న అదనపు ఇఒ ధర్మారెడ్డి ముఖ్యమంత్రిని పలుసార్లు కలిసి విన్నవించుకున్నప్పటికీ సిఎం ఆయనకు ఎటువంటి హామీ ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో టీటీడీ ఇఓగా శ్రీనివాసరాజు పేరు బయటకు రావడంతో ధర్మారెడ్డి ఉత్కంఠతకు గురవుతున్నారని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఒక వేళ శ్రీనివాసరాజు టీటీడీ ఇఒ అయితే ఆయన కంటే సీనియర్‌ అయిన ధర్మారెడ్డి టీటీడీ అదనపు ఇఓగా కొనసాగలేరు. ధర్మారెడ్డిని సిఎంఓలో నియమించుకుంటారని ప్రచారం జరిగినా అది ఉత్త ప్రచారమేనని ముఖ్యమంత్రి కార్యాలయ ఇన్‌చార్జిగా జవహర్‌రెడ్డిని నియమించడంతో తేలిపోయిందంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో శ్రీనివాసరాజును టీటీడీ ఇఓగా నియమించకుండా అనేక మంది అధికారులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తుండగా ఏదో విధంగా టీటీడీ ఇఒ పదవి పొంది తన చిరకాల కోరికను నెరవేర్చుకోవాలని అదనపు ఇఒ ధర్మారెడ్డి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. తనను టిటిడీ ఇఒగా నియమించకపోయినా, ఇఒగానైనా అదనపు బాధ్యతలు కొంతకాలం అప్పచెప్పాలని ధర్మారెడ్డి కోరుకుంటున్నట్లు తెలిసింది. టీటీడీ ఇఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జవహర్‌ను ఎప్పుడు తప్పిస్తారో అంతుబట్టడం లేదని, ఆయననే ఇన్‌ఛార్జి ఇఒగా కొనసాగిస్తారని మరికొందరు అధికారులు అంటున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ