లేటెస్ట్

ఆ మూడు నియోజకవర్గాల టిడిపి ఇన్‌ఛార్జ్‌లపై వేటు....!

చిత్తూరు జిల్లాలో మూడు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను పదవి నుంచి తప్పించి కొత్తవారిని నియమించేందుకు పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారని చిత్తూరు పార్టీ నేతలతో ఈ విషయంపై ‘చంద్రబాబు’ చర్చించారని త్వరలో ఈ మూడు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను తొలగించడం ఖాయమని,ఎవరిని ఆ పదవుల్లో నియమిస్తారనే విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని పార్టీ నేతలు అంటున్నారు. తమను నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవుల నుండి చంద్రబాబు తప్పించబోతున్నారని తెలుసుకున్న వారు తమ పదవులను నిలుపుకునేందుకు తంటాలు పడుతున్నారని తెలుస్తోంది. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించకుండా, ప్రజల్లోకి దూసుకెళ్లలేకపోతున్న నియోజకవర్గ నేతలపై ‘చంద్రబాబు’ అసంతృప్తిగా ఉన్నారని ఆ ముగ్గురు పలుసార్లు చంద్రబాబును కలిసినప్పుడు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.


అసలు విషయానికి వస్తే చిత్తూరు జిల్లా నగరి, శ్రీకాళహస్తి, తిరుపతి పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిల పనితీరు తనకు సంతృప్తి కల్గించడం లేదని, ఆయా నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను పదవుల నుంచి తప్పించిన తరువాత ఎవరెవరిని ఆ పదవుల్లో నియమిస్తే పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందో, అలాంటి వారి వివరాలను తనకు ఇవ్వాలని పార్టీ ముఖ్యనేతలను  ఇటీవల చంద్రబాబు కోరినట్లు తిరుపతిలో ప్రచారం జరుగుతోంది. నగరి నియోజకవర్గ అధికార ఎమ్మెల్యే ‘రోజా’పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా ‘రోజా’పై అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలే తిరగబడుతున్నారని, ఆ పరిస్థితిని అనుకూలంగా మలచుకోవడంలో నగరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ‘భానుప్రకాశ్‌’ ఘోరంగా విఫలమయ్యారని స్థానిక నేతలు ‘చంద్రబాబు’కు అనేకసార్లు ఫిర్యాదు చేశారు.


శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి మాజీ మంత్రి గోపాలరెడ్డి తనయుడు ‘సుధీర్‌రెడ్డి’ (2019లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు) ఎక్కువగా హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారని, ఇక్కడ అంతంత మాత్రమే బలం ఉన్న టిడిపికి ఆయన తీరువల్ల తీవ్ర నష్టం జరుగుతోందని, ఈ కారణాలతో ఆయనను పదవి నుంచి తప్పించాలని ఇక్కడ నాయకులు కోరుతున్నారు. ఇక్కడ ‘బలిజ’ సామాజికవర్గానికి చెందిన వారిని ఇన్‌ఛార్జిగా నియమించబోతున్నారని ప్రచారం సాగుతోంది. అదే విధంగా ‘తిరుపతి’ ఇన్‌ఛార్జి మాజీ ఎమ్మెల్యే సుగుణ అనేక సందర్బాల్లో పార్టీ అధినేత చంద్రబాబును కలిసినప్పుడు తనను నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి నుంచి తప్పిస్తే తన మనవరాలికి ఆ పదవి ఇచ్చి రాబోయే ఎన్నికల్లో ఆమెకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని స్థానిక నేతలు చెబుతున్నారు. ఇప్పటికీ తిరుపతి నియోజకవర్గంలో టిడిపి అధికారపార్టీకన్నా చాలా బలంగా ఉందని, స్థానిక పరిస్థితులను అనుకూలంగా మలచుకోవడంలో మాజీ ఎమ్మెల్యే సుగుణ విఫలమయ్యారని, ఆమెను పదవి నుంచి తప్పించి ‘బలిజ’ వర్గానికి చెందిన బలమైన నేతకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పజెప్పాలని స్థానిక నేతలు కోరుకుంటున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ