WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వృద్ధుల పింఛన్లకు 'వడ్డీ' గ్రహణం...!

'దేవుడు వరమిచ్చినా...పూజారి కరుణించలేదనట్లు' తయారైంది రాష్ట్రంలో వృద్దుల పెన్షన్ల పంపిణీ వ్యవహారం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమపథకాలు దారి తప్పుతున్నాయని, అర్హులకు సకాలంలో అందటం లేదని పలు ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులైన ఫించన్‌దారులకు అందించిన సొమ్ము కంటే ఐదు రెట్లు ఎక్కువగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఫించన్లను అందిస్తోంది. గతంలో కంటే సొమ్ము అధికంగా వస్తుండడంతో ఈ పథకం పరిధిలో ఉన్న లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'చంద్రబాబు' తమకు పెద్దకొడుకు వలే ఫించన్లను అందిస్తున్నారని వారు కొనియాడుతున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఈ ఫించన్లు మంచిపేరు తెస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ ఫించన్ల పంపిణీలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెడుతోంది.

  రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రి అయిన 'యనమల రామకృష్ణుడు' నియోజకవర్గంలోని తుని అసెంబ్లీ నియోజకవర్గం తొండంగి మండలం పైడికొండ గ్రామంలో వృద్దాప్య ఫించన్ల పంపిణీపై లబ్దిదారుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అర్హులైన వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన ఈ ఫించన్లు అరకొరగా అందిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రతి నెలా ఫించన్లు ఇవ్వాల్సిన అధికారగణం తమకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే ఇస్తూ వృద్ధులను ఇబ్బందులు పెడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి మాసం మొదటి వారంలో ఇవ్వాల్సిన ఫించన్లు మూడు నెలలకోసారి ఇస్తున్నారు. అదేమిటంటే రకరాలైన కారణాలు చెబుతున్నారు. తమకు నిధులు రాలేదని ఒకసారి, మిషన్లు పాడయిపోయాని మరోసారి చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారని గ్రామంలోని మెజార్టీ వృద్దులు ఆరోపిస్తున్నారు. అదేమీ కాదంటే వేలిముద్రలు సరిపోవడం లేదని మిషన్లు వేలిముద్రలను తిరస్కరిస్తున్నాయని కుంటి సాకులు చెప్పుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరు సకాలంలో ప్రభుత్వ ఖాజానా నుంచి నిధులు తీసుకుని వడ్డీలకు తిప్పుకుంటున్నారనే ఆరోపణలు గ్రామంలో వ్యక్తం అవుతున్నాయి. మెజార్టీ వృద్ధులు ఈ ఆరోపణలు చేస్తున్నారు. మూడు నెలల పాటు ఇవ్వకుండా వాటిని వారి వద్ద ఉంచుకుని వడ్డీ వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా వృద్ధులను ఫించన్లు పంపిణీ చేసేటప్పుడు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మరి కొందరు ఆరోపిస్తున్నారు. మంచానికే పరిమితమైన వృద్ధులకు ఇంటికి వెళ్లి ఫించన్లు ఇవ్వాల్సి ఉండగా వారిని కూడా తమ కార్యాలయానికి పిలిపిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. కార్యాలయానికి వచ్చిన వారిని గంటల కొద్ది ఎండలో నిలబెడుతున్నారని, అదేమిటంటే ఇచ్చేవరకు ఆగలేరా...? అంటూ దుర్బాషలాడుతున్నారని మరీ ప్రశ్నిస్తే మీకు దిక్కున్నచోట చెప్పుకోండని గద్దిస్తున్నారని వారు వాపోతున్నారు.

  ఒకవైపు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను వివిధ సంక్షేమపథకాలకు ఖర్చు చేస్తూ ఉంటే వాటిని సక్రమంగా లబ్దిదారులకు చేర్చాల్సిన అధికారులు...పక్కదారి పడుతుంటే ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిపోతుందని టిడిపికి చెందిన సానుభూతిపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి అయిన రామకృష్ణ తమ్ముడు దృష్టికి ఈ వ్యవహారాన్ని సదరు గ్రామస్తులు తీసుకుపోయినా ఆయన స్పందించలేదని తెలుస్తోంది. సంక్షేమపథకాలు దారి తప్పుతున్న వైనంపై ఇప్పటికే పలు పత్రికలు కథనాలను ప్రచురించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురృదష్టకరం. ఇప్పటికైనా అధికారులు, రాజకీయనాయకులు మేల్కొని ఇక్కడ జరుగుతున్న అక్రమాలను, అవినీతిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


(208)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ