WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మీరాకుమార్‌'కు అవమానం జరిగిందా...!

వాళ్లిద్దరూ దళిత వర్గానికి చెందిన సీనియర్‌ నేతలు....! ఎన్‌డిఎ తరుపున ఒకరు...యుపిఎ తరుపున ఒకరు రాష్ట్రపతి అభ్యర్థులుగా బరిలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణలో వారిలో ఒకరి చేదు అనుభవం ఎదురు కాగా...మరొకరి తీయని జ్ఞాపకంలా పర్యటన సాగిపోయింది. చేదు అనుభవం ఎదుర్కొన్నది మాజీ లోక్‌సభ స్పీకర్‌ 'మీరాకుమార్‌' కాగా....! మరుపురాని అనుభవం ఎదుర్కొంది ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌.ఎన్‌డిఎ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న 'రామ్‌నాథ్‌కోవింద్‌'కు తెలంగాణ రాష్ట్ర సమితి, వైకాపా పార్టీలు బ్రహ్మరథం పట్టాయి. ఈ పార్టీలు ఎన్‌డిఎలో లేకపోయినా...తమ స్వంత అభ్యర్థి అయినట్లు పోటీ పడీ మరీ ఆయన ప్రచారాన్ని విజయవంతం చేశారు. హైదరాబాద్‌లో 'కోవింద్‌' దిగిన దగ్గర నుంచి ఆయన వెన్నంటి ఉండి ప్రచారం నిర్వహించి ఆయన దృష్టిలో పడ్డారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు పట్టణంలో పలుచోట్ల భారీ ఫ్లెక్సింగ్‌లు కట్టి ఘనస్వాగతం పలికారు. ఆయన ఇంకా రాష్ట్రపతి కాకపోయినా...రాష్ట్రపతికి ఇచ్చేగౌరవ,మర్యాదలన్నీ ఆయనకు ఇచ్చారు. మరో వైపు వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి 'కోవింద్‌'కు పాదాభివందనం చేసి తన భక్తిప్రభక్తులను ఘనంగా చాటుకున్నారు. ఆయనతో పాటు వారి పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా అదే బాటలో నడిచారు. 

  దళిత వర్గానికి చెందిన వారు కాబట్టే తాము 'కోవింద్‌'కు మద్దతు ఇస్తున్నామని బహిరంగంగా ప్రకటించిన టిఆర్‌ఎస్‌ మరో దళిత వర్గానికి చెందిన 'మీరాకుమార్‌'ను మాత్రం తీవ్రంగా అవమానపర్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించి భంగపడ్డారు. తాను  ఫోన్‌లో మాట్లాడతాను అని చెప్పినా...కెసిఆర్‌ ఆమెతో మాట్లాడేందుకు నిరాకరించారని వార్తలు వస్తున్నాయి. పార్టీలు ఏవైనా, సిద్దాంతాలు ఏమైనా... ఒక దళిత మహిళ, అదీ సీనియర్‌ పార్లమెంటేరియన్‌, మాజీ స్పీకర్‌ అయిన 'మీరాకుమార్‌'కు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ బిల్లు ఆమోదం సమయంలో ఆంధ్రాకు చెందిన ఎంపిలు లోక్‌సభలో గందరగోళం సృష్టించి బిల్లును అడ్డుకుంటే...వాళ్లందరినీ బయటకు వెళ్లగొట్టి...పార్లమెంట్‌ తలుపులు మూయించి అప్పుడు బిల్లు పాస్‌ చేయించింది...ఈ 'మీరాకుమారే'...! పాపం...కెసిఆర్‌  ఈ సంగతిని అప్పుడే మరిచిపోయినట్లున్నారు...! అయినా పట్టుబట్టి.... తెలంగాణను ఇచ్చిన 'సోనియాగాంధీ'నే కెసిఆర్‌ అవతలకు పెడితే...అప్ట్రాల్‌ ...'మీరా కుమార్‌'...ఎంత? అనే చర్చ తెలంగాణ రాజకీయ సమాజంలో జరుగుతోంది. కాగా ఆమెతో మాట్లాడితే 'మోడీ' కోపగించుకుంటారనే భయంతోనే కెసిఆర్‌ ఆమెకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదా...? నేరుగా కలవకపోయినా...ఫోన్‌ ద్వారా అయినా ఆమెతో మాట్లాడితే కెసిఆర్‌కు పోయేదేముందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దళితులకు పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెప్పుకునే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన దళిత మహిళను కలిసేందుకు నిరాకరించడం 'ఆమె'ను అవమానపర్చడమే.


(454)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ