చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు
టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు రిమాండ్‌లో ఉన్నారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు ఆయనకు మధ్యంతర బెయిల్ చేసింది. గత 52 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి జరిగిందని ఆయనను సీఐడి అరెస్టు చేసింది. స్కిల్ కేసులో తనపై అక్రమంగా కేసును నమోదు చేశారని, తాను ఎటువంటి తప్పు చేయలేదని, తనపై కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే చంద్రబాబు పిటీషన్‌పై సుధీర్ఘంగా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై ఇంకా తీర్పురాకపోవడంతో చంద్రబాబు లాయర్లు ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం క్షీణించిందని, ఆయనకు తక్షణ వైద్య సహాయం అందచేయాలంటూ ఆయన కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నిన్న విచారణ జరిగగా, చంద్రబాబుకు ఎటువంటి అనారోగ్యం లేదని, ఆయన బాగానే ఉన్నారని, ఆయనకుప్రభుత్వ వైద్యులు చికిత్స అందిస్తున్నారని, ఆయనకు బెయిల్ ఇవ్వవద్దంటూ ప్రభుత్వం వాదించింది. అయితే వారి వాదనలు తోసిపుచ్చుతూ హైకోర్టు ధర్మాసనం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. అయితే మధ్యంతర బెయిల్లో ఉన్న కండిషన్లును కోర్టు ఇంకా వెలువరించలేదు.