WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిటిడి ఛైర్మన్‌గా లక్ష్మీనారాయణ...!

టిటిడి పాలకవర్గం గడువు ముగియడంతో నూతన పాలకవర్గం నియామకానికి రంగం సిద్ధమైంది. అనేక మంది రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు ఇంకా బయటపడని వ్యక్తులు కొందరు ఛైర్మన్‌ పదవి కోసం చినబాబు, పెదబాబు చుట్టూ ప్రదిక్షణలు చేస్తూ, తీవ్ర ఒత్తిడిలు తెస్తున్నారు. కానీ చంద్రబాబు అంతరంగం ఇంత వరకు బయటపడకపోవడంతో టిటిడి ఛైర్మన్‌ పదవి ఎవరికి లభించనుందోనని రాజకీయ, పారిశ్రామికవర్గాలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయి. నిన్నటి వరకు టిటిడి ఛైర్మన్‌గా నర్సరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావును నియమిస్తారని ప్రచారం జరగగా తరువాత తనకు ఆ పదవి ఇవ్వాలని రాజమండ్రి ఎంపి, సినీనటుడు మురళీమోహన్‌ చంద్రబాబును కోరినట్లు బయటకు పొక్కింది. ప్రజాప్రతినిధుల్లో ఏ ఒక్కరికీ టిటిడి ఛైర్మన్‌ పదవి ఇచ్చే ప్రసక్తేలేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. అయినప్పటికీ వారు పట్టువిడవకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 

   అటు రాజకీయవర్గాలను, ఇటు అధికార వర్గాలను సంతృప్తి పరిచేందుకు రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి 'లక్ష్మీనారాయణ'కు ఆ పదవి ఇస్తే ఎలా ఉంటుందో అని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు వీరవిధేయుడే కాకుండా అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న 'లక్ష్మీనారాయణ' ఇంత వరకు 'చంద్రబాబు'పై ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. 'లక్ష్మీనారాయణ'కు టిటిడి ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని కొంత మంది సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు 'చంద్రబాబు'కు సూచించారు. అధికార పార్టీ వర్గాల్లో 'లక్ష్మీనారాయణ' పేరు తెలియని వారు లేరు. ఈ నేపథ్యంలో ఆయనకు టిటిడి పదవి ఇస్తే ఏ వర్గంలోనూ అసంతృప్తి వ్యక్తం కాదని అధికారపార్టీ వర్గాలు అంటున్నాయి. లక్ష్మీనారాయణ పేరుకే ఐఎఎస్‌ అధికారి అని ఆయన టిడిపి నాయకునిగా, కార్యకర్తగా ఆ పార్టీ ముఖ్యులందరూ భావిస్తుంటారు. ఇటీవల 'చంద్రబాబు'ను ఒక ప్రముఖ అధికారి కలిసినప్పుడు టిటిడి ఛైర్మన్‌ పదవికి 'లక్ష్మీనారాయణ' పేరు సూచించారని తెలుస్తోంది. కానీ అధికారపార్టీ ప్రముఖుల్లో ఎవరో ఒకరికి ఆ పదవి ఇవ్వాలని 'చంద్రబాబు' ఆలోచిస్తున్నారట. ఈ పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై 'చంద్రబాబు' మనోగతం ఇంత వరకు బయటకు రాలేదు. 'లక్ష్మీనారాయణ'కు పదవి ఇస్తే తమకు అభ్యంతరాలు లేవని అధికారపార్టీ నాయకులు ఏకగ్రీవంగా చెబుతున్నారు. అటు అధికారులు, ఇటు అధికారపార్టీ ముఖ్యులందరిలోనూ 'లక్ష్మీనారాయణ' వైపే మొగ్గు కనిపిస్తోంది. ఆయన నియామకం 'చినబాబు'కు కూడా అభ్యంతరం ఉండకపోవచ్చు.ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే...!

(336)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ