WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'టిడిపి'కి 'శిల్పా చక్రపాణిరెడ్డి' గుడ్‌బై...!

అంతా ఊహించినట్లే జరుగుతోంది. ముందు తమ్ముడు...తరువాత అన్న...పార్టీకి జెల్ల కొడుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టిడిపిలో చేరిన 'శిల్పా' సోదరులు ఇప్పుడు ఆ పార్టీ నుంచి వరుసగా బయటకు వెళ్లిపోతున్నారు. నంద్యాల అసెంబ్లీ సీటు విషయంలో పార్టీ అధిష్టానంతో ఘర్షణకు దిగిన ఈ అన్నాదమ్ముళ్లు తమ కోర్కెను కాదన్నారన్న కోపంతో పార్టీని వదిలి వేసి వైకాపాలో చేరిపోతున్నారు. ముందు తమ్ముడు శిల్పామోహన్‌రెడ్డి పార్టీ నుంచి జంప్‌ కాగా ఇప్పుడు అన్న 'శిల్పా చక్రపాణిరెడ్డి' వంతు వచ్చింది. ఎమ్మెల్సీగా ఉన్న 'చక్రపాణిరెడ్డి' త్వరలో వైకాపాలో చేరనున్నారని అధికారపార్టీ వర్గాలే చెబుతున్నాయి. 'నంద్యాల' అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తన తమ్ముడు 'శిల్పామోహన్‌రెడ్డి' వైకాపా నుంచి పోటీ చేస్తుండగా, టిడిపి తరుపున  భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు పోటీలో ఉన్నారు. అయితే తన తమ్ముడు వైకాపా తరుపున పోటీ చేస్తున్నా తాను టిడిపికే మద్దతు ఇస్తానని మొన్న...మొన్నటి దాకా 'శిల్పాచక్రపాణిరెడ్డి' చెప్పారు. 

  అయితే మారిన పరిస్థితుల్లో టిడిపి అగ్రనాయకత్వం ఆయనను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచుతోంది. తమ్ముడు గెలుపు కోసం 'చక్రపాణిరెడ్డి' తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానంతోనే టిడిపి నేతలు ఆయనను దూరంగా ఉంచుతున్నారు. ఆయనకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, దూరంగా ఉంచడంతో ఇక పార్టీకి తనపై నమ్మకలేదనే భావనతో ఆయన తమ్ముడు చేరిన పార్టీలో చేరడానికి ముహూర్తాలు చూసుకుంటున్నారట. అదీకాక ఇటీవల కాలం దాకా తనను మండలి ఛైర్మన్‌ చేస్తారనే అభిప్రాయంతో ఉన్న 'చక్రపాణిరెడ్డి' మారిన పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పదవి గురించి అడగలేకపోతున్నారు...అదే సమయంలో టిడిపి అగ్రనాయకత్వం కూడా ఆయనపై నమ్మకాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఇక టిడిపిలో ఉండడం కన్నా తమ్ముడు వెళ్లిన బాటలోనే వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారట. మొత్తం మీద ఉప ఎన్నికకు ముందే ఆయన వైకాపాలో చేరతారని 'నంద్యాల'లో ప్రచారం జరుగుతోంది. 'చక్రపాణి' పార్టీ మారడంపై టిడిపి శ్రేణులు పెద్దగా పట్టించుకోవడం లేదు...ఆయన పార్టీలో ఉన్నా ఒకటే...పోయినా ఒక్కటే...అన్న చందంగా వారు వ్యవహరిస్తున్నారు.


(225)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ