WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఊసరివెల్లి...'ఉండవల్లి'...!

రంగులు మార్చడంలో మనం 'ఊసరివెల్లి'ని ఉదాహరణగా చెప్పుకుంటాం...! కానీ దానికంటే వేగంగా 'రంగులు' మార్చగల నేతలు రాజకీయాల్లో చాలా మంది ఉన్నారు. అటువంటి వారిలో రాజమండ్రి మాజీ పార్లమెంట్‌ సభ్యులు 'ఉండవల్లి అరుణ్‌కుమార్‌'  ముందు వరసలో ఉంటారు. నిన్నటి దాకా కాంగ్రెస్‌ను, వైకాపాను ఆడిపోసుకున్న ఈ నేత ఇప్పుడు అధికార టిడిపి అనవసర విమర్శలు గుప్పిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఆది నుంచి కాంగ్రెస్‌ పార్టీతో పెనవేసుకున్న బంధం 'ఉండవల్లి'ది. కాంగ్రెస్‌ పార్టీలో కార్యకర్తగా ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం...అనంతరం కాలంలో రెండుసార్లు ఎంపీగా గెలుపొంది పార్టీ ముఖ్యుల్లో ఒకరు అన్న స్థాయికి వెళ్లారు. సామాన్య ప్రజల్లో ఎటువంటి బలం లేని ఈ నేత...తన నోటితోనే ముప్పయి సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు.'ఉండవల్లి'కి ఉన్న వాగ్దాటిని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి బాగా ఉపయోగించుకున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులను, తన శత్రువులను వేధించడానికి అప్పట్లో తరుచూ 'ఉండవల్లి'ని ప్రయోగించేవారు వై.ఎస్‌. అదే 'ఉండవల్లి'కి ఎనలేని పేరు తెచ్చిపెట్టింది.

   నాడు తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నారన్న కారణంతో 'ఈనాడు' రామోజీరావుపై 'ఉండవల్లి'ని ఉస్కొల్లిపింది వై.ఎసే. నాడు మార్గదర్శి చిట్‌ఫండ్‌లో కుంభకోణం జరిగిందని, సామాన్యులను 'రామోజీరావు' మోసం చేశారని 'ఉండవల్లి' చేసిన హంగామా...మీడియా మెఘల్‌ రామోజీరావును కోర్టు మెట్లు ఎక్కించింది. తాను చట్టబద్ధంగానే డిపాజిట్లు స్వీకరిస్తున్నాన్న 'మార్గదర్శి' వాదనను కొట్టివేస్తూ చివరకు దానిపై తనిఖీలు చేసింది అప్పటి ప్రభుత్వం. మార్గదర్శి విషయమే కాదు..చివరకు 'రామోజీరావు' ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'రామోజీఫిల్మ్‌సిటీ'లో ప్రభుత్వ భూములు ఉన్నాయని వాటిని కూల్చివేశారు. అప్పట్లో 'ఉండవల్లి' ప్రెస్‌మీట్‌ పెడుతున్నారంటే 'మార్గదర్శి' లేకపోతే 'రామోజీఫిల్మ్‌సిటీ' విషయంపైనే ఉంటుందనేది అప్పట్లో అందరికీ తెలిసిన విషయమే. నిత్యం 'సాక్షి' పత్రికల్లో 'మార్గదర్శి' గురించి, రామోజీరావు 'నగ్న' చిత్రాలను ప్రచురించి శునకానందం పొందేవారు. ఇప్పుడంటే వారి మధ్య రాజీ కుదరింది కాబట్టి ఒకరికొకరు చుట్టాలు అయిపోయారు కానీ...వై.ఎస్‌.బతికి ఉన్న రోజుల్లో 'రామోజీరావు'పై ప్రతిరోజూ దాడే...! దానికి నాయకత్వం వహించేది 'ఉండవల్లే'. తెరవెనుక 'వై.ఎస్‌.' ఉంటే తెరముందు 'ఉండవల్లి' ఉండేవారు...! వై.ఎస్‌ మరి కొద్ది రోజులు బతికి ఉంటే 'రామోజీ' పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ...'ఉండవల్లి'కి మాత్రం కాంగ్రెస్‌ శ్రేణుల్లో హీరో అనే పేరు వచ్చింది. ఇదంతా గతం...! మరి 'మార్గదర్శి' విషయంలో 'ఉండవల్లి' ఎటువంటి ప్రలోభాలకు లొంగిపోయారే తెలియదు కానీ...తరువాత దాని జోలికిపోలేదు...ఏదో ప్రయోజనం పొందారని అందుకే దానికి గురించి ఇక ఆయన మాట్లాడడంలేదని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

   ఇవన్నీ అటు ఉంచితే ప్రస్తుతం 'ఉండవల్లి' ప్రభుత్వం చేపట్టిన 'పట్టిసీమ' ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ప్రచారం చేస్తున్నారు. 'పోలవరం' ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కొన్నాళ్లు, ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచారని మరి కొన్నాళ్లు...అసలు రాజశేఖర్‌రెడ్డి ఉండి ఉంటే రెండేళ్లలోనే దాన్ని పూర్తిచేశావారని మరి కొన్నాళ్లు అంటూ కాలక్షేపం చేస్తూ ఈ విషయంపై బహిరంగ చర్చకు సవాళ్లు విసురుతున్నారు. 'పట్టిసీమ' ప్రాజెక్టు అనవసరమని దానిపై పెట్టిన రూ.1400కోట్లతో 'పోలవరం' ప్రాజెక్టును 70శాతం పూర్తి చేయవచ్చని ఆయన వాదిస్తున్నారు. దాదాపు 36వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పూర్తిగా పోలవరం ప్రాజెక్టు 1400కోట్ల రూపాయలతో ఎలా పూర్తి అవుతుందో మరి ఆయనకే తెలియాలి. పోలవరం పూర్తి అయిన తరువాత 'పట్టిసీమ'తో అవసరం లేదని...ఇప్పుడు దానికి పెట్టిన వ్యయం వృధా అవుతుందని ఆయన బాధపడిపోతున్నారు. పట్టిసీమ వల్ల కృష్ణాడెల్టాలో సకాలంలో నాట్లుపడి రైతులు ప్రయోజనం పొందుతున్నారు కదా...అంటే రూ.1400కోట్లు వృధా అయ్యాయని ఆయన వాదిస్తున్నారు. కృష్ణాడెల్టాలో ఒక్క పంట పండినా దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. దానితో పోల్చుకుంటే ప్రాజెక్టు నిర్మాణానికి అయిన వ్యయం రూ.1400కోట్లు అంటే ఒక్క పంటకే దాదాపు నాలుగువేల కోట్ల రూపాయల ఆదాయం ప్రజలకు వస్తుంది. ఒక్క పంటకే ఇలా వస్తే తరువాత పంటలు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఎంత ఆదాయం వస్తుందో 'ఉండవల్లి'కి తెలియదా...? ఆదాయం సంగతి ఎలా ఉన్నా...! సాగునీరు వస్తే రైతులతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు కూడా లాభపడతారు కదా..! మరి ఆ విషయం మేధావి అయిన 'ఉండవల్లి'కి తెలియదా...? తెలిసి మరి ఎందుకు సవాళ్లు విసురుతున్నారంటే...నిత్యం వార్తల్లో ఆయన ఉండాలి...! వార్తల్లో ఉంటేనే 'జగన్‌' రేపు మళ్లీ తండ్రి ఇచ్చినట్లే ఎక్కడో చోట పోటీకి అవకాశమిస్తారనే ఆశ. అంతే తప్ప...పట్టిసీమ వల్ల ప్రజలకు మేలు జరగలేదని ఆయన చెప్పలేరు...! మొండివాదనతో...అర్థం లేని విమర్శలతో వార్తల్లో ఉండాలనేదే ఆయన తపన. ఏది ఏమైనా ఆయన టిడిపి నేతలతో చేసిన సవాల్‌కు కట్టుబడి కృష్ణాడెల్టాకు వచ్చి చర్చకు సిద్ధపడితే వాస్తవాలు ఏమిటో రైతులే చెబుతారు...!


(588)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ