'ఎవరీ 'మణి'...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఎవరీ 'మణి'...!

'ఆవు చేలో మేస్తుంటే...దూడ గట్టున మేస్తుందా...? అన్నది పాత కాలపు సామెత. అదే విధంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొందరు ఉద్యోగుల వ్యవహారశైలి. ఇప్పటికే అనేక అక్రమాలు, అవినీతి ఆరోపణలతో పవిత్రమైన దేవస్థానం పరువు తీస్తోన్న ఉద్యోగుల జాబితాలో మరో ఉద్యోగి చేరారు. తిరుమల జెఇఒగా కొండపై గత ఏడేళ్ల నుంచి తిష్టవేసిన శ్రీనివాసరాజు కార్యాలయంలో అక్రమాలకు అడ్డేలేకుండా పోతోంది.ఒక వైపు జెఇఒ శ్రీనివాసరాజు స్వామి దర్శనాల టిక్కెట్ల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అప్రదిష్ట కొనితెచ్చుకుంటుంటే ఆయన కార్యాలయంలో సిసిగా పనిచేసే 'మణి' అదే దారిలో నడుస్తున్నారు. వీఐపీలు, వీవీఐపిలకు ఇచ్చే ఎల్‌-1 దర్శనాల విషయంలోనూ ఇతర విషయాల్లోనూ ఈయన అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సిఎం కార్యాలయ సిఫార్సులు లేక ఇతర వీవీఐపిల సిఫార్సుల లేఖలను తీసుకొస్తే తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తనకు ఇష్టమైతే ఎల్‌-1 దర్శనాలు ఇస్తూ ఇష్టం లేకపోతే దర్శనాలకు అనుమతి లేదంటూ తిరస్కరిస్తున్నారు. అదే సమయంలో కొంత మంది వీవీఐపిలు సిఫార్సు లేఖలు తెస్తే మధ్యవర్తులను ఆయనే రంగంలోకి దింపుతున్నారు. మధ్యవర్తుల ద్వారా వారు అడిగిన దర్శనాలను కేటాయిస్తూ వారి వద్ద నుంచి గట్టిగానే పిండుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కొంత మంది అడిగిందేమీ ఇవ్వకపోతే వారికి దర్శనాలు లేవని, అధికారులు ఇవ్వడం లేదని మొఖంమీద చెప్పేస్తున్నారు. 

  ఒక వైపు శ్రీనివాసరాజు కావాల్సిన వారికి ఆయన ఇష్టారీతిలో దర్శనాలు ఇస్తుండగా మరో వైపు ఆయన కింద పనిచేసే ఉద్యోగులు వాళ్ల ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. గతంలో టిటిడి ఇఒగా సాంబశివరావు పనిచేసిన కాలంలో ఈ వ్యవహారంపై ఆయన ప్రశ్నిస్తే ఆయనపై ఎవరి నుంచి వత్తిడి తెచ్చారో కానీ...తరువాత 'సాంబశివరావు' శ్రీనివాసరాజు వ్యవహారాల్లో తల దూర్చలేదు. తాను కావాలనుకుంటే ఒకే రోజు ఐదువందల మందికి ఎల్‌-1 దర్శనాలు ఇచ్చి స్వామి దర్శనం చేయించగల శ్రీనివాసరాజు బాటలోనే ఇప్పుడు 'మణి' నడుస్తున్నారు. తనకు సిఎం కార్యాలయం అండదండలు ఉన్నాయని, సిఎంఒ తన కనుసన్నల్లో ఉందని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన విర్రవీగుతున్నారు. పైగా తాను ఇక్కడ లోకల్‌ అని డాంబికాలు పలుకుతున్నారు. తనకు ఇష్టం అయిన వారి వద్దకు దళారులను, మధ్యవర్తులను పంపి శ్రీఘ్రమే దర్శనాలు చేయిస్తున్న ఆయన తనకు ఇష్టం లేనివారిపై కక్ష సాధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో జెఇఒ కార్యాలయంలో పనిచేసిన 'ధర్మయ్య' చేసినట్లే ఇప్పుడు 'మణి' అక్రమాలకు పాల్పడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. నాడు 'ధర్మయ్య' చేసిన అక్రమాలపై అప్పట్లో సిఐడి విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం...'మణి' వ్యవహారంపై నిఘా వర్గాలు పూర్తి సమాచారం సిఎంఒకు,టిటిడి ఇఒకు అందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే 'మణి' అక్రమాలకు చెక్‌ పడనుందని విశ్వసనీయ సమాచారం.


(526)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ