గుంటూరు జిల్లాలో పెరగనున్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవే...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గుంటూరు జిల్లాలో పెరగనున్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవే...!

రాజకీయ చైతన్యానికి మారుపేరైన గుంటూరు జిల్లాలో ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండగానే రాజకీయ నాయకులు వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచడానికి కేంద్రప్రభుత్వం దాదాపు అంగీకరించడంతో జిల్లాలో నూతనంగా ఏర్పాటు కానున్న నియోజకవర్గాలపై అందరి దృష్టి పడింది. ముఖ్యంగా అధికారపార్టీ నాయకుల్లో ఈ హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. నియోజకవర్గాల పెంపుతో పాటు నియోజకవర్గాల డీలిమిటేషన్‌ కూడా ఉండడంతో తమకు బలమైన ప్రాంతాలను తమ నియోజకవర్గంలో కలుపుకుని తద్వారా రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని సదరు నాయకులు భావిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా దీనికి మరో 50 నియోజకవర్గాలను జోడించబోతున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో నియోజకవర్గాలను పెంచుతామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి దీనిపై దాగుడు మూతలు ఆడుతుంది. నియోజకవర్గాల సంఖ్య పెంచితే తమకు రాజకీయంగా పెద్దగా ఉపయోగం ఉండదనే భావంతో స్థానిక బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పునర్విభజన హామీని అమలు కాకుండా ఇప్పటి వరకూ అడ్డుకుంటూ వస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయంపై కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో సదరు ఫైలు హోంశాఖకు చేరింది. దీంతో రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన చట్టానికి సవరణలు చేయడానికి రంగం సిద్దమైంది. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో సవరణ చట్టం పాస్‌ అయితే ఆంధ్రాలో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాలో కనిష్టంగా రెండు గరిష్టంగా ఐదు వరకు పెరిగే అవకాశం ఉంది.

    గుంటూరు జిల్లాలో ఇప్పటికే 17 నియోజకవర్గాలు ఉండగా దీనికి మరో ఐదు కలుస్తాయని అధికారులు, రాజకీయనాయకులు చెబుతున్నారు. గతంలో డీ లిమిటేషన్‌ జరగక ముందు గుంటూరు జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉండేవి. అయితే అప్పట్లో కూచనపూడి, దుగ్గిరాల నియోజకవర్గాలు రద్దు అవడంతో రెండు నియోజకవర్గాలు తగ్గిపోయాయి. అయితే మరో ఐదు నియోజకవర్గాలు జిల్లాకు పెరుగుతాయని భావిస్తుండగా అధికారపార్టీ నాయకులు తమకు బలం ఉన్న చోట ఆ నియోజకవర్గాలను ఏర్పాటు చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. 2009 ఎన్నికలకు ముందు డీలిమిటేషన్‌ వల్ల గరిష్టంగా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం లాభపడింది. ఇప్పుడు అదే విధంగా తమ ప్రయత్నాలను తాము చేస్తామని అధికారపార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే జిల్లాకు సంబందించి మూడు రెవిన్యూ డివిజన్‌లు ఉండగా పల్నాడు ప్రాంతంలో రెండు, తెనాలి ప్రాంతంలో రెండు, గుంటూరులో ఒక నియోజకవర్గం పెరగబోతోందని సమాచారం. పల్నాడు ప్రాంతంలో 'నకిరకల్లు', పిడుగురాళ్ల'ను నియోజకవర్గంగా ప్రకటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా గుంటూరులో గుంటూరు గ్రామీణ ప్రాంతం, ప్రతిపాడు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలను కలిపి నూతనంగా నియోజకవర్గం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఇక ఆంధ్రుల రాజధాని అయిన 'అమరావతి'ని మరో నియోజకవర్గంగా ప్రకటించబోతున్నారు. ఇది కాక తెనాలి ప్రాంతంలో 'చెరుకుపల్లి' మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించబోతున్నారని విశ్వసనీయ సమాచారం. 

  నియోజకవర్గాల పెంపు, పునర్‌విభజనపై ఇప్పటికే అధికారపార్టీలో కొంత కసరత్తు జరుగుతోంది. పల్నాడు ప్రాంతంలో తమపై ఆధిపత్యం సాధిస్తున్న వైకాపాను దెబ్బకొట్టడానికి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ప్రత్యేక వ్యూహాన్ని రచించారని తెలుస్తోంది. వైకాపాను సమర్థించే బలమైన సామాజికవర్గ ఓటర్ల ప్రభావం తన నియోజకవర్గంపై పడకుండా ఉండేందుకు ఆయన కొత్తగా 'నకిరకల్లు'ను నియోజకవర్గంగా చేసేందుకు పావులు కదుపుతున్నారట. ఇక్కడ స్వంత సామాజికవర్గం బలంతో పాటు, ఇతర బిసీ వర్గాలు బలంగా ఉండడంతో రాజకీయంగా తనకు కలసి వస్తుందని భావిస్తున్నారట. అదే విధంగా ఎప్పటి నుంచో పల్నాడు ప్రాంతంలో ప్రముఖ నగరంగా ఉన్న 'పిడుగురాళ్ల'ను నియోజకవర్గంగా ప్రకటిస్తే ఇక్కడ కూడా అధికారపార్టీ బలం అనూహ్యంగా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక గుంటూరు గ్రామీణ, పత్తిపాడు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను కలిపితే ఇక్కడా టిడిపి బలంగా తయారైతుందన్న వాదనలు ఉన్నాయి. వాస్తవానికి 'పత్తిపాడు' నియోజకవర్గంలో అధికారపార్టీకి చెందిన సామాజికవర్గం బలంగా ఉన్నా...గుంటూరు గ్రామీణ పట్టణ ప్రాంతం కొంత దానిలో ఉండడంతో ఇక్కడ గతంలో మూడు సార్లు టిడిపి ఓడిపోయింది. ఈసారి దాన్ని ఎదుర్కొనేందుకు అధికారపార్టీ డీలిమిటేషన్‌ అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. రేపల్లె ప్రాంతంలో 'చెరుకుపల్లి'ని నియోజకవర్గంగా చేసి వైకాపాను దెబ్బకొట్టాలని అధికార నేతలు భావిస్తున్నారు. ఇక రాజధాని 'అమరావతి'పై సిఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపించబోతున్నారు. మొత్తం మీద డీలిమిటేషన్‌తో తమ స్థానాలను పదిలం చేసుకోవడానికి...మరింత బలం పుంజుకోవడానికి అధికారపార్టీ సన్నాహాలు చేస్తోంది. చూద్దాం ఏమి జరుగుతుందో...!


(దావులూరి హనుమంతరావు)


(13044)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ