రాష్ట్రంలో కార్పోరేట్‌ తరహా రాజకీయాలు 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాష్ట్రంలో కార్పోరేట్‌ తరహా రాజకీయాలు

రేపల్లె,జూలై13(జనం ప్రతినిథి):దేశ రాజకీయాల్లో ఆయా రాజీకీయ పార్టీలు కార్పోరేట్‌ సంప్రదాయాలను ఆహ్వానించటం నిస్సందేహంగా శుభపరిణామమే అవుతుంది.ఆయా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చూస్తే ఈతరహా మార్పు నిస్సందేహంగా రాజకీయ పార్టీలకు ప్లస్‌ పాయింటే అవుతుంది.ఇందుకు ఉదాహరణగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ నాతోనే పుట్టింది,నాతోనే పోతుందనుకున్న మాటలు రాజకీయాల్లో విజయాన్ని సాధించలేవని,ప్రాంతీయ పార్టీలు ఉనికిని చాటుకోవాలంటే కార్పోరేట్‌ సంప్రదాయాలు పాటించటం తప్పనిసరి అని చంద్రబాబు నిర్ణయం హర్షించదగినదే.తెలుగుదేశం పార్టీ పదేళ్ళ పాటు అధికారంలో లేకపోయినా,ఉనికిని చాటుకుందంటే పార్టీని చంద్రబాబు తీర్చిదిద్దిన విధానమే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం దేశంలో రాజకీయ వ్యూహకర్త,విధానాల రూపకర్తగా ప్రసిద్థిగాంచిన ప్రశాంత్‌కిషోర్‌ కోసం రాజకీయ పార్టీల నేతలు అర్రులు  సాస్తున్నారనటంలో ఏమాత్రం సందేహం లేదు. 

  ఈ40ఏళ్ళ యువకుడు ప్రజారోగ్య ఉధ్యమకారుడుగా తన జీవితాన్ని ప్రారంభించి,ఐక్యరాజ్యసమితిని ఆకర్షించి అందులో పనిచేసి అనంతరం భారత రాజకీయాలపై దృష్టిపెట్టి మొట్టమొదటిగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కలసి పనిచేయటానికి చేసిన ప్రయత్నాలు అంతగా ఫలితం ఇవ్వలేదు.తిరిగి ఐక్యరాజ్యసమితికి వెళ్ళిన అతని విజ్ఞత,చతురత అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ దృష్టికి రావటంతో సామాజిక రంగంలో విధానాల సలహా దారునిగా ప్రశాంత్‌ కిషోర్‌ను మోడీ నియమించుకున్నారు. అక్కడి నుండి క్రమంగా మోడీకి రాజకీయ వ్యూహనిపుణుడిగా అతని సేవలు వినియోగించుకుని ఎన్నికల్లో విజయం సాధించారు.ఈవిజయానికి కీలక పాత్రదారి ప్రశాంత్‌ కిషోర్‌ ప్రతిభ ఎంతైన ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ప్రశాంత్‌ కిషోర్‌ను రాష్ట్రంలోని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి తన పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ఎంపిక చేసుకోవటంతో ఒక్కసారిగా ఆంధ్రరాష్ట్రంలో ప్రశాంత్‌కిషోర్‌ ప్రత్యేకతలపై వివరాలు సేకరిస్తున్నారు.2014సార్వత్రిక ఎన్నికల్లో 44శాతం ఓట్లు సాధించినప్పటికి అధికారం దక్కించలేకపోయిన వైకాపా కింగ్‌మేకర్‌గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రశాంత్‌కిషోర్‌ సేవలను వినియోగించుకోవటానికి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు.ఇప్పటికే వైకాపాను రాష్ట్రంలో అధికారంలోకి తేవటానికి ప్రశాంత్‌కిషోర్‌ జట్టు రంగంలోకి దిగిందని చెబుతున్నారు.అదే సమయంలో ప్రతి నియోజకవర్గంలోని ప్రశాంత్‌కిషోర్‌ ప్రతినిథి ఒక్కరు ఉండి ఎప్పటికప్పడు నియోజకవర్గంలో మారుతున్న పరిస్థితులపై నివేదికలు ఇస్తుంటారని చెబుతున్నారు.వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ఆలోచన కూడా ప్రశాంత్‌కిషోర్‌దనే వాదన వినబడుతోంది.కాగా రాజకీయాల్లో వాస్తవ ప్రతిభను గుర్తించగల నైపుణ్యం లేనివారు మాత్రమే విజయం సాధించినవారి వెంట పడుతుంటారని రాజకీయ పండితులు అంటున్నారు.

   ఓటమి చెందినవారితో కలసి ప్రయాణించాలంటే ముందుగా అవతలి వారికి నైపుణ్యాలను గుర్తించే తెలివితేటలు ఉండాలని అలాగే తన మీద తనకు ఆత్మవిశ్వాసం కూడా ఉండాలన్నది సిద్థాంతం.అయితే సంప్రదాయ ఎన్నికల తీరును పరిశీలిస్తే వైకాపా అధికారాన్ని దక్కించుకోవటానికి కొద్దిశాతం ఓట్లను పెంచుకోవటం,అందుకు తగిన రీతిలో తటస్థ ఓటర్లను పార్టీవైపు మరల్చుకోవటం కోసం నవీన విధానాన్ని అనుసరించటం ప్రశాంత్‌కిషోర్‌ లాంటి వారి వలనే సాధ్యమవుతుందని అందుకోసమే ప్రశాంత్‌కుమార్‌ను వైకాపా రాజకీయ వ్యూహకర్తగా ఎంపిక చేసుకుందని వాదన వినిపిస్తోంది.సాధారణంగా రాజకీయ నాయకుల్లో వారివారి అనుభవం,రాజకీయ పరిణితిని బట్టి ఎన్నికలకు సిద్థం కావటం,రకరకాల వ్యూహాలకు శ్రీకారం చుట్టటం జరుగుతూ ఉంటాయి.ప్రత్యర్థులను చిత్తుచేయగల సొంత తెలివితేటలు ఉన్నవారు కొందరు నాయకులైతే,మరికొందరు నాయకులైతే క్రిందిస్థాయి నుండి అభిప్రాయాలు,సలహాలు శ్రద్థగా ఆలకించి అందులోని మంచి,చెడులను బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.అయితే జగన్మోహన్‌రెడ్డి పోకడలు ఇందుకు భిన్నంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.జగన్మోహన్‌రెడ్డి ఎవరు ఏది చెప్పినా వినరని,వారి మాటకు విలువ ఇవ్వరని కూడా ప్రచారం ఉంది.అయితే ఎంతటి నాయకుడైన విలువైన సూచనలు వచ్చినపుడు పట్టించుకోకుండా ఉండటం జరగదని విశ్లేషకులు అంటున్నారు. ఆధునికత మేళవించిన రాజకీయాలను నడపాలనుకుంటున్న జగన్మోహన్‌రెడ్డికి అదే తరహాలో పయనిస్తున్న ప్రశాంత్‌కిషోర్‌ వ్యూహకర్త స్నేహం లాభిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అంతర్జాతీయ సంస్థలో పనిచేసి గొప్ప అనుభవం సంపాదించి,క్షేత్రస్థాయిలో జనం నాడి తెలుసుకోగల నైపుణ్యం,అపారమైన రాజకీయ వ్యూహచతురత,ప్రముఖులను గద్దెనెక్కించే చాతుర్యం కలగలిపిన ప్రశాంత్‌కిషోర్‌ సలహాదారుడుగా జగన్మోహన్‌రెడ్డి స్నేహం ఎలాంటి ఫలితాలను అందిస్తుందో వేచిచూడాల్సిందే.

(జనం ప్రతినిథి:వైవిఎన్‌ ప్రసాద్‌,రేపల్లె)


(314)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ