WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

డీలిమిటేషన్‌తో 'పులివెందుల'లో 'జగన్‌'కు చెక్‌...!

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్‌ చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీ సీట్లు పెంపకంపై ఒకవైపు చర్చ సాగుతుండగా...మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై అధికారపార్టీలో తీవ్ర మంతనాలు సాగుతున్నాయి. తమ పార్టీ బలహీనంగా ఉన్న చోట ఎలా బలపడాలనే ఆలోచనతో డీలిమిటేషన్‌ను అస్త్రంగా మార్చుకోవాలని అధికారపార్టీ భావిస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన డీలిమిటేషన్‌ను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి బాగానే వాడుకున్నారు. తమ ప్రత్యర్థులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కొన్ని మండలాలను చీల్చి, వేరే నియోజకవర్గంలో కలపడం, లేదా వాటిని రిజర్వేషన్‌ కేటగిరిలో మార్చడం వంటి చర్యల వల్ల ఆయన బాగానే లాభపడ్డారు. అటువంటి చర్యలనే ఇప్పుడు అధికార టిడిపి చేపట్టబోతోంది. ఒక వైపు నియోజకవర్గాల సంఖ్య పెంపుపై కసరత్తు జరుగుతూనే ఉండగా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనపై పార్టీ దృష్టిసారించింది. దీనిలో భాగంగా తమకు కొరకరాని కొయ్యగా మారిన నియోజకవర్గాలపై ప్రత్యేక కసరత్తు జరుపుతుంది. 

  ముఖ్యంగా రాయలసీమలో తాము బలహీనంగా ఉన్న కడప, కర్నూలుపై ఆ పార్టీ నాయకులు దృష్టిసారించారు. దీనిలో వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న 'పులివెందుల'పై అధికారపార్టీ కన్ను వేసిందని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో టిడిపి గెలవలేదు. వై.ఎస్‌.కుటుంబానికి కంచుకోట అయిన ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం జెండా ఎగరాలంటే డీలిమిటేషన్‌లో వైకాపా బలంగా ఉన్న కొన్ని మండలాలను పక్కనే ఉన్న అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో కలపాలని ఆ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.'పులివెందుల'లో వైకాపా బలంగా ఉన్న సింహాద్రిపురం,లింగాల,వేంపల్లి, పులివెందుల మండలాలలోని 'సింహాద్రిపురం'ను 'తాడిపత్రి'లో కలపాలని వారు భావిస్తున్నారట. అదే విధంగా 'లింగాల'ను చెరిసగం చేసి వేస్తే వైకాపా బలం చాలా వరకు చీలిపోతుందని వారు అంచనా వేస్తున్నారు. లింగాల, సింహాద్రిపురం మండలాలు కకావికలమైతే టిడిపికి బలమైన మద్దతు ఉన్న 'చక్రాయపేట,తొండూరు, వేముల బలంతో 'పులివెందుల'ను కొట్టివేయవచ్చనేది టిడిపి వ్యూహకర్తల అభిప్రాయమట. మొత్తం మీద డీలిమిటేషన్‌ జరిగితే అధికారపార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నది పచ్చినిజం. మరి 'పులివెందుల'లో అధికారపార్టీ వ్యూహం ఫలిస్తుందా...? లేదో వేచి చూడాల్సి ఉంది.


(1122)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ