గుర్తింపును కోరుకుంటున్న దేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు....! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గుర్తింపును కోరుకుంటున్న దేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు....!

రేపల్లె,జూలై 14,(జనం ప్రతినిథి):విశ్వవిఖ్యాత డాక్టర్‌ నందమూరి తారకరామారావు ఆనాడు తెలుగుప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించి,సంక్షేమ పథకాలు అందించటం ద్వారా తెలుగువారికి ప్రపంచంలో పేరు తీసుకురావాలన్న ఆకాంక్షతో తెలుగుదేశం పార్టీని స్థాపించటం జరిగింది.డిల్లీ పాలకులు మూడునెలలకొకసారి ముఖ్యమంత్రిని మారుస్తూ ప్రజల మానప్రాణాలతో చెలగాటమాడుతూ,రాష్ట్రాభివృద్థి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెత చందాన ఉండగా, తెలుగు ప్రజల దశమార్చటం కోసం,వారి ఆత్మాభిమానాన్ని నిలపటం కోసం తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారకరామారావు స్థాపించి కేవలం 9నెలలకే అధికారాన్ని చేపట్టటం జరిగింది.ఈనేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించిన ఎంతోమంది కార్యకర్తలు,నాయకులకు ఎన్టీఆర్‌ గుర్తింపునివ్వటం జరిగింది.దీంతో తెలుగుదేశం పార్టీ అంటే తమ పార్టీయే అన్న భావనలో నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.కాగా  తెలుగుదేశం పార్టీలో అధికార మార్పిడి అనంతరం చంద్రబాబునాయుడు పార్టీ పగ్గాలు,ప్రభుత్వ అధికారం చేపట్టిన నాటి నుండి పార్టీలో అనేక సంస్కరణలకు తెరతీశారు. 

  ఇందులో భాగంగా తటస్తులు,మేథావులంటూ వారికి పార్టీలో అగ్రపీఠం కట్టబెట్టారని,అనంతరం మారుతున్న రాజకీయాల్లో భాగంగాపలు ఇతర పార్టీ నేతలు,కార్యకర్తలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని వారిని కూడా అందలం ఎక్కించటం జరిగిందని,మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబునాయుడు హయాంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తలు,నాయకులకు తీవ్ర అన్యాయం జరిగిందనేది కార్యకర్తలు వాదనగా ఉంది.మొదట్నించి ఉంటున్న కార్యకర్తలను,నాయకులను చంద్రబాబునాయుడు కేవలం ఓటర్లుగానే చూశారనే ఆరోపణ సాక్షాత్తు పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.కార్యకర్తలు,నాయకులకు పదవులు ఇవ్వకపోయిన పనిచేస్తారుకానీ,వారు కనీస గుర్తింపును కోరుకుంటారని,ఆకార్యకర్తలకు గుర్తింపు అనేది లేకపోతే ఏవిధంగా పార్టీ కోసం పనిచేయ్యాలి అనే ప్రశ్న కార్యకర్తల నుండి వ్యక్తమవుతోంది.దశాబ్థాలుగా పార్టీకి విధేయులుగా పనిచేసేవారు ఇతర పార్టీల వైపు పొరపాటున కూడా కన్నెత్తి చూడరన్నది సత్యం అంటున్నారు.అలాంటి నిబద్థత తెలుగుదేశం అని చెప్పుకునే నాయకుల్లో కరువైందని వారు విమర్శిస్తూ..ఏపార్టీని ఎవరు స్థాపించిన అందులోకి దూకి ఆపార్టీ అధికారంలోకి రాకపోవటం తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరుతూ వస్తున్నారని ఆరోపిస్తున్నారు.

  తెలుగుదేశం పార్టీ పదేళ్ళ పాటు అధికారానికి దూరమై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ఎపుడు కనబడని వారు నేడు పదవుల్లో కొనసాగుతున్నారన్నది వారి ప్రధాన ఆరోపణ.పార్టీకి అండగా నిలిచినవారు ఏఆదరణ లేక రోడ్లపై తిరుగుతున్నారని కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని,ఇప్పటికైన చంద్రబాబునాయుడు,నియోజకవర్గాలు నాయకత్వం వహించే వారు పద్దతిని మార్చుకుంటే రానున్న పెనుప్రమాదం నుండి నష్టాన్ని నివారించుకోవచ్చని కష్టపడేవారికి,కార్యకర్తలను గౌరవించేవారికి,పార్టీ కోసం అన్ని వదులుకుని పనిచేసేవారికి పదవులిస్తే,పార్టీని కాపాడతారని అంటున్నారు.అలా కాకుండా కార్యకర్తలకు విలువేంటి,అధికారంలో ఉండి ఎవరు వచ్చిన జైకొడతారని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుందని,రాజకీయ,స్వార్థ పరులకు తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారరాదని నాయకులు,కార్యకర్తలు కోరుకుంటున్నారు.ఎవరు ఏమనుకున్నప్పటికి చంద్రబాబు నాయకత్వం,తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తమకు ముఖ్యమని,ప్రాణం ఉన్నంత వరకు పసుపు జెండా వదలమని,తమకంటూ ఏపదవులు కోరుకోమని,చంద్రబాబు మాత్రం నిఖార్సైన నాయకులను నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీనాయకులు,కార్యకర్తలు కోరుకుంటున్నారు. అయితే ఇది రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు,ఇన్‌చార్జ్‌లు,మంత్రులు,ఎమ్మెల్సీలు అందరికి వర్తిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు.

(జనం ప్రతినిథి:వైవీఎన్‌ ప్రసాద్‌,రేపల్లె)


(298)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ