WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆంద్రాకు అన్న‌విధాలుగా స‌హ‌క‌రిస్తాం...!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నూతన రాజధాని అమరావతిలో ప్రప్రధమంగా విశ్వవిద్యాలయం ఏర్పడటం సంతోషదాయకమని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్.ఆర్.ఎం. విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తో కలిసి ప్రారంభించారు. పరిపాలనా భవనాన్ని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ప్రారంభించగా అకాడమిక్ బ్లాక్ ను కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు ప్రారంభించారు. విశ్వవిద్యాలయ నమూనాన్ని పరిశీలించారు. విభజన జరిగిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని అవసరమైనదని, ఈ నేపధ్యంలో నూతన రాజధాని ఏర్పాటుకు తమ భూములను ఇచ్చి సహకరించిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా తమ వంతు పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. 

ఎస్.ఆర్.ఎం. విశ్వవిద్యాలయానికి ప్రపంచం మొత్తం మీద మంచి పేరు వుందని, అటువంటి విశ్వవిద్యాలయం విద్యార్దినీ విద్యార్దులకు అందుబాటులోకి రావడం హర్షణీయమని అన్నారు. ఉన్నత చదువుల కోసం విద్యార్ధులు విదేశాలకు వెళ్ళనవసరం లేదని, ఎస్.ఆర్.ఎం. లోనే అన్ని రకాల కోర్సులు ఉంటాయని చెప్పారు. సమాజంలో ఆర్ధిక అసమానతలు, పేదరికం తొలగి పోవాలంటే అందరూ చదువుకోవాలని అన్నారు. నూతన రాజధాని అమరావతి సపూర్ణ అభివృద్దికి తోలి విడతగా వేయి కోట్ల రూపాయలు 2015 మార్చ్ మాసంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. వారసత్వ నగరాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘అమృత్’ పధకం కింద దేశంలో 500 నగరాలను గుర్తించగా అందులో అమరావతి ఒకటని అన్నారు. దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఇళ్ళు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి లక్షా 93 వేల ఇళ్ళు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీర్తి చిహ్నం ‘అమరావతి’ అని, అటువంటి అమరావతిలో విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల అభివృద్దికి కృషి చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే ఎస్.ఆర్.ఎం. విశ్వవిద్యాలయం ఏర్పాటు అయిందని అన్నారు. మరో 10 విశ్వ విద్యాలయాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడనున్నాయని తెలిపారు. 

  నూతన రాజధాని అమరావతిలో 250 ఎకరాలలో అతి పెద్ద పార్క్ ను ఏర్పాటుచేయనున్నామని, దానికి ‘ఎం.ఎస్.ఎస్.కోటేశ్వరరావు’ పేరును పెట్టనున్నట్లు తెలిపారు. విద్యార్ధి దశ ఎంతో విలువైనదని, ఈ దశలోనే శాస్త్ర, సాంకేతిక అంశాలతో పాటు వైజ్ఞానిక రంగంలో కూడా మంచి నైపుణ్యాన్ని కలిగి వుండాలని విద్యార్దులకు సూచించారు. విశ్వవిద్యాలయంలో విద్యార్దులకు అవసరమైన నాణ్యమైన, ఉన్నతమైన కోర్సులను అందించాలని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు విశ్వ విద్యాలయ అధికారులకు కోరారు. ఆంధ్ర ప్రదేశ్ యువత ఎంతో తెలివైనదని, ప్రస్తుత పరిస్తితులలో అన్ని రంగాలలో ఉన్నత స్దానాలను అధిరోహిస్తున్నారని తెలిపారు. ప్రపంచం గుర్తించే విధంగా అమరావతి నిర్మాణం జరుగాబోతోందని, ఈ సంవత్సరం విజయ దశమి రోజున అమరావతి నగర నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశ్వ విద్యాలయ అధినేత శ్రీ పంచ ముత్తు మాట్లాడుతూ, వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు కోరుకుంటున్న 13 మంది విద్యార్దులకు తమ విద్యాలయంలో ఉపకార వేతనాలను అందించటంతోపాటు ఉచితంగా విద్యను అందిస్తామని ప్రకటించారు. అలాగే క్రీడా రంగంలో ఆసక్తి వున్న ప్రతి విద్యార్దికి సంవత్సరానికి రూ.5 వేలు వంతున సహాయాన్ని అందించనున్నామని, ఈ అవకాశం 9 వ తరగతి ఆపై చదువుతున్న విద్యార్దులకు వర్తిస్తుందని తెలిపారు. అదే విధంగా అమరావతి పరిసరాలలోని 30 గ్రామాలను దత్తత తీసుకుని, వైద్య పరంగా అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలను విశ్వవిద్యాలయం అందిస్తుందని, అవసరమైతే ఆసుపత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ, సభాపతి డా.కోడెల శివ ప్రసాద రావు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి షేక్ జానీ మూన్, మంత్రులు శ్రీ గంట శ్రీనివాసరావు, శ్రీ కామినేని శ్రీనివాస్, శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, శ్రీ నక్కా ఆనంద బాబు, శ్రీ పితాని సత్యనారాయణ, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ రాయపాటి సాంబశివరావు, శాసన సభ్యులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్, శ్రీ జి.వి.ఎస్.ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ శ్రీ కోన శశిధర్, సంయుక్త కలెక్టర్ శ్రీమతి క్రితికా శుక్లా, విశ్వవిద్యాలయ అధికారులు, ప్రోఫెసర్లు, విద్యార్దినీ విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.

(207)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ