WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

హామీలతో అధికారం సాధ్యమా...!?

ఎన్నిలకు మరో రెండేళ్లు సమయం ఉన్నా...ఆంధ్రా రాజకీయాలు ఎన్నికల కోలాహలాన్ని తలపిస్తున్నాయి. యువజన,శ్రామిక,రైతు పార్టీ(వైకాపా) ప్లీనరీ తరువాత రాష్ట్ర రాజకీయాలు వేగం పుంజుకున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీ ప్రకటించిన ఎన్నికల వాగ్దానాలే. ఎన్నికలకు రెండేళ్ల సమయం ముందే ఇటువంటి వాగ్దానాలు చేస్తే...ఫలితాలు వస్తాయా....? లేదా...? అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నా...వైకాపా అధినేత మాత్రం తాను నమ్ముకున్న వ్యూహంలో భాగంగా ఎన్నికల హామీలను గుప్పించారు. సమాజంలోని అన్ని వర్గాలకు అన్నీ చేస్తామంటూ....! మనిషికి ఇంత అన్నట్లు ఆయన హామీలు సాగిపోయాయి. యువత,రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, ఎస్సీ,ఎస్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఆయన హామీలను గుప్పించారు. ఆయన ఇచ్చిన హామీలపై ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లోనూ, వివిధ రాజకీయపార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. 'జగన్‌' ఇచ్చిన హామీల్లో కొత్తేమీ లేదని, అవన్నీ తాము అమలు చేస్తున్న పథకాలేనని టిడిపి నాయకులు వ్యాఖ్యానించారు. కాగా వైకాపా ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే 10లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ కావాలని, ఇంత ఎక్కడ నుంచి తెస్తారని వారు ధ్వజమెత్తుతున్నారు. కాగా తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని..తాము అధికారంలోకి వస్తే వాటిని అమలు చేసి తీరతామని వైకాపా నాయకులు చెబుతున్నారు.

హామీలు ఇస్తేనే ఎన్నికల్లో గెలుస్తారా...? అంటే చెప్పడం కష్టమే...! కొన్నిసార్లు హామీల వల్ల కొందరికి లాభం కల్గి ఉండవచ్చును కానీ...కేవలం...హామీలతోనే అధికారం సాధిస్తామంటే అది అయ్యే పనికాదు...! గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రాజకీయ పార్టీలు ఇంత కన్నా ఎక్కువ హామీలను ఇచ్చినా గెలుపు సాధించలేకపోయాయి. ఎప్పటి దాకానో ఎందుకో 2009 ఎన్నికల సమయంలో ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 'మనీ ట్రాన్సఫర్‌' పథకాన్ని హామీగా ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే...మనిషికి ఇంత చొప్పున వారి ఎకౌంట్‌లో వేస్తామని హామీ ఇచ్చింది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున్న చర్చ జరిగింది. నాడు టిడిపి ఇచ్చిన హామీలపై అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అవి అమలు చేసే హామీలు కాదని వాదించారు. అయితే ఇటువంటి పథకాలు విదేశాల్లో అమలుల్లో ఉన్నాయని టిడిపి వాదించింది. అంతే కాకుండా ప్రజలకు కలర్‌ టివీలు ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. వరుసగా అన్ని వర్గాలకు హామీలు కురిపించుకుంటూ పోయారు. అయితే నాడు టిడిపి ఇచ్చిన హామీలను ప్రజలు పట్టించుకోలేదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. 

   కేవలం ఇదొక్కటే కాదు...1994 ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి తాము అధికారంలోకి వస్తే కి.లో రూ.2/- బియ్యం పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఆ పథకానికి మిన్నగా కిలో బియ్యం రూ.1.90పైసలకే ఇస్తామని ప్రకటించి అమలులోకి తెచ్చారు. అయితే ఆయన సంక్షేమ పథకాలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు...! గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరపరాభవానికి గురైంది. కేవలం 24 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెల్చుకోగలిగింది. అంటే నాయకులు ఇచ్చిన హామీలకు విశ్వసనీయత ఉంటేనే ఓట్లు వస్తాయి తప్ప...! హామీలకు ఓట్లు రాలవు.  మరో ఉదాహరణ చూద్దాం... ! 1999 ఎన్నికల సందర్భంగా చంద్రబాబును ఎన్నికల్లో ఓడించాలని పట్టుదలతో నాడు కాంగ్రెస్‌ 'ఉచిత విద్యుత్‌' హామీని ప్రకటించింది. అయితే ఆ ఎన్నికల్లో ప్రజలు ఆ హామీని నమ్మలేదు...! మళ్లీ 'చంద్రబాబు' చేతిలో కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు..! అదే హామీ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ మళ్లీ ప్రకటిస్తే ప్రజలు ఆదరించి ఓట్లు వేసి గెలిపించారు. అయితే ఇదే వాగ్దానాన్ని తాను చేసినట్లేయితే బాగుండేదని 'చంద్రబాబు' తరుచూ వాపోయేవారు. 2004 ఎన్నికల సందర్భంగా 'ఉచిత విద్యుత్‌' సాధ్యం కాదని...తాను ఆ హామీని ఇవ్వలేదని...తాను కనుక అదే హామీని ప్రకటిస్తే తాను ఓడిపోయేవాడిని కాదని 'చంద్రబాబు' ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇప్పుడు 'జగన్‌' కూడా అదే విధంగా వాపోతున్నారు. తాను 2014 ఎన్నికల సమయంలో 'రైతులకు రుణమాఫీ' హామీని ఇస్తే తాను ముఖ్యమంత్రిని అయ్యేవాడనని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకుంటున్నారు. అయితే కేవలం హామీలతోనే ఓట్లు పడతాయనేది నిజం...కాదని...వారి గత ఐదేళ్ల చరిత్రను కూడా ఓటర్లు నిశితంగా గమనిస్తారని  రాజకీయపరిశీలకులు పేర్కొంటున్నారు. మొత్తం మీద...కేవలం హామీలు ఇస్తేనే అధికారంలోకి రారని...హామీలను ప్రజలు విశ్వసించినప్పుడే వస్తారని గత చరిత్ర చెబుతోంది.


(191)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ