WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'భష్మా' 'అసురుల'ను నెత్తిపై పెట్టుకుంటున్న 'చినబాబు'...!

నిజాయితీతోపాటు, పాలకులపై అనకూలత ఉన్న అధికారులను శాఖాధిపతులుగా నియమించుకోవాల్సిన 'చంద్రబాబు' వాటిని పాటించకుండా, చివరకు కుమారుని ఒత్తిడితో ఆయన నిర్వహిస్తున్న శాఖల అధిపతిగా ఆ లక్షణాలు లేని అధికారులను నియమించుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. 'నరేగా' పథకం ద్వారా అనేక గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణానికి బాధ్యతలైన అధికారులను పక్కన పెట్టి, సిఫార్సులను మన్నించి అధికారులను, నెత్తిపై పెట్టుకుంటున్న 'చినబాబు' మరో భష్మాసురుడిగా పేరు తెచ్చుకుంటున్నారని అధికార, రాజకీయవర్గాలు ఆఫ్‌ ది రికార్డుగా విమర్శిస్తున్నాయి. అపార, రాజకీయ, అధికార అనుభవం ఉన్న 'చంద్రబాబు' కళ్లు ఉన్న ధృతరాష్ట్రుని వలే 'చినబాబు' మాటలకు విలువ ఇచ్చి రాజకీయ, అధికార వర్గాల్లో పలుచన అవుతున్నారు. నేను హైదరాబాద్‌ వదలి వెలగపూడి వచ్చే ప్రసక్తేలేదు, నేను అక్కడ పనిచేసే ప్రసక్తేలేదని భీష్మించుకుని కూర్చుని కార్యాలయాలు హైదరాబాద్‌ నుండి వెలగపూడికి తరలిస్తున్న సమయంలో మొహం చాటేసిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిపై గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన 'చంద్రబాబే' ఆయనను ఇప్పుడు నెత్తినపైన పెట్టుకుంటున్నారు. 

  పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణ నీటిపారుదలశాఖాధిపతిగా నియమింపబడి ఇప్పటి వరకు అదే పోస్టులో కొనసాగుతున్న, తాజాగా గ్రామీణాభివృద్ధిశాఖను కూడా కట్టబెట్టడం జరిగింది. ఒక వైపు మూడేళ్లు పనిచేసిన అధికారులనందరినీ బదిలీ చేస్తున్న 'చంద్రబాబు' 'జవహర్‌రెడ్డి' విషయంలో తప్పటడుగు వేశారని అధికారపార్టీ ప్రముఖులతోపాటు, సిఎంఒ అధికారులు కూడా ఆవేదనతో చెబుతున్నారు. ఇప్పటికి పలుసార్లు సెలవుపై వెళ్లివచ్చిన 'జవహర్‌రెడ్డి'కి గ్రామీణాభివృద్ధిశాఖను కూడా కట్టబెట్టడం విమర్శలకు దారితీసింది. ఇప్పటి వరకు ఈ శాఖను నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'దినేష్‌కుమార్‌' 'నరేగా' పనులను సకాలంలో పూర్తి చేయటం కానీ, కేంద్ర ప్రభుత్వ నిధులను మిగతా రాష్ట్రాలకన్నా ముందే విడుదల చేయించుకోవడంలో కానీ చాకచక్యంగా వ్యవహరించి సఫలీకృతులయ్యారు. గ్రామీణాభివృద్ధిశాఖ కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 'రామాంజనేయులు' కూడా 'నరేగా' పనులు సక్రమంగా పూర్తి కావడంలో రాత్రింభవళ్లు కృషి చేశారు. ఈ శాఖకు మరో ప్రముఖుడైన అధికారిని నియమించాలని పలువురు 'చంద్రబాబు'కు సూచించినప్పటికీ 'చినబాబు' ఒత్తిడితో 'జవహర్‌రెడ్డి'కే ఆ శాఖను కట్టబెట్టారు.పంచాయితీరాజ్‌శాఖలోనే సమర్థవంతంగా పనిచేయకుండా కొన్ని వందల ఫైళ్లను పరిష్కరించని 'జవహర్‌రెడ్డి'పై 'చినబాబు'కు ఆపేక్ష కలగడానికి ఎమ్మెల్సీ టిడి జనార్థన్‌ సిఫార్సులకే కారణమని బయటకు పొక్కింది. 'జనార్థన్‌' పనులన్నీ 'జవహర్‌రెడ్డి' చక్కపెట్టడంతో ప్రత్యేక చూపిన 'జవహర్‌రెడ్డి' గ్రామీణాభివృద్ధిశాఖను ఆయన ద్వారా సిఫార్సు చేయించి 'చినబాబు' ద్వారా పొందగలిగారట. 

   టిడిపికి తీవ్ర వ్యతిరేకి, దివంగత సిఎం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి అత్యంత ఆప్తుడు ప్రతిపక్షనేత 'జగన్‌'కు వీరాభిమాని అయిన 'జవహర్‌రెడ్డి'ని 'చినబాబు' ఎలా ఇష్టపడ్డారో...?ఎమ్మెల్సీ 'జనార్థన్‌' ఏ అర్హతలను చూసి 'జవహర్‌రెడ్డి'ని 'చినబాబు'కు సిఫార్సు చేశారో...? కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ముగ్గురు సిఎం కార్యాలయాల్లో పనిచేసిన 'జవహర్‌రెడ్డి' ప్రతిపక్షనేతగా ఉన్న 'చంద్రబాబు'ను రాజకీయంగా ఏ విధంగా దెబ్బకొట్టాలి...ఆయనపై ఎటువంటి విమర్శలు, ఆరోపణలు చేయించాలన్న విషయంపై అప్పట్లో ముగ్గురు సభ్యులు కమిటీలో 'జవహర్‌రెడ్డి' సభ్యుడట. మూడేళ్లకు పైగా పిఆర్‌లో బాధ్యతలు నిర్వహించిన 'జవహర్‌రెడ్డి'ని మరోశాఖకు బదిలీ చేయాల్సి ఉండగా అటువంటి నిబంధనలను పట్టించుకోకుండా, వాస్తవాలు తెలియని 'చినబాబు'కు ఎవరో సిఫార్సు చేయటమేమిటి...? చంద్రబాబు ఆచరణలో పెట్టడం ఏమిటి...? అంతే కాకుండా గ్రామీణాభివృద్ధిశాఖలో గత రెండేళ్ల నుంచి సత్తా చూపుతున్న 'రామాంజనేయులు'ను బదిలీ చేయాలని 'జవహర్‌రెడ్డి' పట్టుపడుతున్నారు. ఇటీవల జరిగిన బదిలీలలో 'రామాంజనేయులు' పేరు కూడా పరిశీలించడం...అది మీడియాలో రావడం జరిగింది. ఆఖరు నిమిషంలో ఆయన బదిలీ నిలిచిపోయింది. ఇప్పటికే 'దినేష్‌కుమార్‌' ఆ శాఖ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తాజాగా 'రామాంజనేయుల'ను ఆ శాఖ నుంచి తప్పిస్తే 'నరేగా' పథకం పూర్తిగా కుంటుపడడం ఖాయం. 'రామాంజనేయులు'ను బదిలీ చేయవద్దని అధికారపార్టీ ప్రముఖులు, అమాత్యులు, ఇతర ముఖ్యులు ముఖ్యమంత్రిని స్వయంగా కలసి విన్నవించబోతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తమకు విధేయులైన అధికారులను కీలక ప్రాధాన్యత కల శాఖల్లో అప్పటి పాలకులు నియమించుకోవడం జరిగింది. వారి విధేయులకే 'చంద్రబాబు' పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 'జవహర్‌రెడ్డి'కి గ్రామీణాభివృద్ధిశాఖనే అప్పచెప్పడం పెద్ద తప్పు. 'రామాంజనేయులు'ను కూడా తొలగిస్తే భష్మాసుర హస్తాన్ని తండ్రీ,కొడులు స్వయంగా నెత్తినపెట్టుకునే ప్రమాదం లేకపోలేదని రాజకీయ,అధికారవర్గాల నుంచి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

(419)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ