లేటెస్ట్

పీపీఏలపై 'మోడీ' ఏం చేస్తారు...!?

పవన,సౌర విద్యుత్‌ ఒప్పందాల సమీక్ష అంశం రాష్ట్రంలో రాజకీయ వేడిని రగిలిస్తోంది. వైకాపా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే పీపీఏ ఒప్పందాలపై సమీక్షిస్తామని, దీనిలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్లు నష్టం చేకూర్చేలా 'చంద్రబాబు' ప్రభుత్వం వ్యవహరించిందని, దీనిలోని అక్రమాలు వెలికితీసి..దోషులను శిక్షిస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆయన అన్నట్లుగానే పీపీఏలపై సమీక్షను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఒప్పందాలన్నీ పారదర్శకంగానే జరిగాయని, వీటిపై సమీక్షలు నిర్వహిస్తే పెట్టుబడిదారుల్లో భయం నెలకొంటుందని, తద్వారా దేశానికి పెట్టుబడులు రావని కేంద్ర విద్యుత్‌శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వీటిపై అవగాహన లేకపోతే మీరైనా అవగాహన కల్పించాలని ఆ లేఖలో సూచించారు. అయితే కేంద్ర విద్యుత్‌శాఖ కార్యదర్శి లేఖ రాసిన తరువాత కూడా 'జగన్‌' గతంలో తాను చేసిన ప్రకటనకే కట్టుబడి సమీక్షల కోసం కమిటీనీ ఏర్పాటు చేశారు. దీంతో..ఈసారి కేంద్ర విద్యుత్‌శాఖ సహాయమంత్రి నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే లేఖ రాశారు. పారదర్శకంగా జరిగిన పీపీఏలపై విచారణ అవసరం లేదని మరోసారి సూచించారు. అయితే ఈ సూచనను రాష్ట్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసినట్లు కనిపిస్తోంది. లేఖ వచ్చిన మరుసటి రోజే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యసలహాదారు 'అజయ్‌కల్లం' విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాము పీపీఏలను సమీక్షిస్తామని, దీనిలో మరో ఆలోచన లేదని తేల్చి చెప్పారు. పీపీఏల ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని, సంవత్సరానికి దాదాపు రూ.2500కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూరుతుందని, గత ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో రూ.12500కోట్లు అక్రమార్కుల పాలయ్యాయని, ఇటువంటి దోపిడీని సహించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో కేంద్రం ఏం చెప్పినా 'జగన్‌' ప్రభుత్వం తాను చేయాలనుకున్న సమీక్షలను చేసి తీరుతుందని, దీనిలో రెండో మాటకు తావు లేదని తేలిపోయింది. 

కాగా..ఈవిషయంలో కేంద్రం ఏమి చేస్తుందనే దానిపైసర్వత్రా ఆసక్తి నెలకొంది. తాము రెండుసార్లు చెప్పినా పట్టించుకోని 'జగన్‌' ప్రభుత్వం 'మోడీ' ప్రభుత్వం చర్యలు తీసుకోగలదా..? రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం చేయగలదా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు ప్రైవేట్‌ విద్యుత్‌ కంపెనీలు పీపీఏలపై సమీక్షలు చేస్తే పెట్టుబడులు ఉపసంహరించుకుంటామని చెబుతున్నాయి. మరోవైపు..ఆంధ్రాలో పెట్టుబడులుపెట్టిన సంస్థలు దేశీయ సంస్థలు కావు. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు ఉన్న ఈసంస్థలు తమపై విచారణ జరిపితే చూస్తూ ఊరుకుంటాయా..? తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని అంతర్జాతీయంగా ప్రచారం చేస్తాయి. దాంతో దేశంలో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితులు నెలకొంటాయి. ఆంధ్రాలో 'పవన్‌,సౌర' విద్యుత్‌ ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టిన సాప్టుబ్యాంక్‌ఛైర్మన్‌కు 'మోడీ'తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 'మోడీ' ప్రభుత్వం ప్రారంభించిన 'మేకిన్‌ ఇండియా' ప్రోగ్రాంతో ఆసంస్థ ఇండియాకు వచ్చింది. 'చంద్రబాబు' అప్పట్లో ఆ సంస్థ ఛైర్మన్‌ను కలసి 'ఆంధ్రా'లో పెట్టుబడులు పెట్టాలని కోరడం, దానికి వారు అంగీకరించి.. పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడా సంస్థను కదిలిస్తే...'మోడీ' చూస్తూ ఊరుకుంటారా..? తనకు సన్నిహితమైన సంస్థలను ఇబ్బందిపెట్టినా..'మోడీ' ఏమీ అనరా..? అవినీతి, అక్రమాలు జరిగితే...దానికి ఆధారాలుంటే చర్యలు తీసుకోవచ్చుని..కానీ..ఏమీ లేకుండా వారిని ఇబ్బంది పెట్టాలని లేకుంటే తనకు చెందిన సంస్థలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతలో 'జగన్‌' చర్యలు ఉన్నాయని 'మోడీ' భావిస్తే...ఆయన చూస్తూ ఊరుకోరని...కోరి కోరి 'మోడీ'తో 'జగన్‌' కయ్యం పెట్టుకుంటున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. 'మోడీ' ప్రభుత్వ సూచనలను భేఖాతరు చేసిన 'జగన్‌' రాబోయే కాలంలో దీనికి మూల్యం చెల్లిస్తారా..? ఏమో చూడాలి మరి...!

(316)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ