WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రారంభమైన 'నంద్యాల' వార్‌...!

నంద్యాల శాసనసభ్యుడు భూమానాగిరెడ్డి హఠాన్మరణంతో ఏర్పడ్డ ఖాళీని పూరించడానికి ఎన్నికల కమీషన్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. నంద్యాల ఉప ఎన్నికను ఆగస్టు 23వ తేదీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నామినేషన్లకు ఆగస్టు ఐదవ తేదీ ఆఖరు గడువు కాగా కౌంటింగ్‌ 28న జరుగుతాయని ఎన్నికల కమీషన్‌ తన నోటిఫికేషన్‌లో ప్రకటించింది. ఈ ఉప ఎన్నిక కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టిడిపి, వైకాపాలు ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నాయి. రెండు పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. సాధారణంగా శాసనసభ్యుడు మృతి చెందితే ఆ కుటుంబానికి చెందిన వారికి టిక్కెట్‌ ఇస్తే ఎన్నికల్లో పోటీ పెట్టకుండా రాజకీయపార్టీలు సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. అయితే 'నంద్యాల' విషయంలో మాత్రం ప్రతిపక్ష వైకాపా దూకుడును ప్రదర్శిస్తోంది. న్యాయంగా అది తమ స్థానమని గత ఎన్నికల్లో ఆ స్థానం నుంచే 'నాగిరెడ్డి' గెలిచారని అది తమకే దక్కుతుందని వాదించింది. 'భూమా' పార్టీ మారిన తరువాత అది అధికారపార్టీదేనని అధికారపక్షం తమ అభిప్రాయాన్ని తెలిపి ఏకగ్రీవం కోసం ప్రయత్నించింది. అయితే ఏకగ్రీవానికి ఒప్పుకోని ప్రతిపక్షం తమ అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు సవాల్‌ విసిరింది. దీంతో అధికారపక్షం కూడా దూకుడుగా ముందుకు వెళుతోంది.

   తెలుగుదేశం పార్టీలో ఉంటూ తనకే ఆ టిక్కెట్‌ ఇవ్వాలని అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన 'శిల్పామోహన్‌రెడ్డి' అది ఫలించకపోవడంతో వైకాపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాగా 'భూమానాగిరెడ్డి' అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగారు. మొదట్లో ప్రతిపక్ష వైకాపా ఇక్కడ నుంచి సునాయాసంగా విజయం సాధిస్తుందని రాజకీయపరిశీలకులు భావించారు. అందుకే ఆ పార్టీ ఏకగ్రీవానికి ఒప్పుకోలేదని వారు అంచనా వేశారు. అయితే అధికారపక్షం దీన్ని సవాల్‌గా తీసుకుని రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. నిన్నటి దాకా వైకాపాకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు అధికారపక్షానికి అనువుగా మారిపోతున్నాయి. ఒక్కో వర్గాన్ని టార్గెట్‌ చేస్తూ వాళ్ల కావాల్సిన పనులను చేసి పెడుతూ అధికారపార్టీ దూకుడుగా ముందుకు వెళుతోంది. నియోజకవర్గంలో గత కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంట వెంటనే చేస్తూ ప్రజల్లో చొచ్చుకుపోయింది. చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ట్రాఫిక్‌ సమస్యను తొలగించి ప్రజలను ఆకట్టుకుంటోంది. అదే సమయంలో భారీస్థాయిలో గృహ నిర్మాణాలను ప్రారంభించింది. ఇవన్నీ ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే ప్రారంభించింది. అన్న ఎన్టీఆర్‌ క్యాంటీన్లు, సంక్షేమ పథకాలు, అడిగిన వారికి అడిగినట్లు రేషన్‌కార్డులు మంజూరు చేసింది. అదే సమయంలో కులాల వారీగా ఇంత వరకు పెండింగ్‌లో ఉన్న పలు పదవులను భర్తీ చేసింది. ముస్లిం,మైనార్టీల ఓట్లను దృష్టిలో ఉంచుకుని మాజీ మంత్రి ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి టిడిపిలో చేరిన నౌమన్‌కు ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ పదవిని అప్పగించి మైనార్టీలపై వలవేసింది. ఇక 'రెడ్డి' సామాజికవర్గంలోని ప్రముఖులను ప్రచారానికి దించి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. దీంతో నిన్నటి దాకా వెనుకంజలో ఉన్న టిడిపి ఒక్కసారిగా రేసులో ముందుకు వచ్చింది. అయితే ప్రతిపక్ష వైకాపా అధ్యక్షుడు 'జగన్‌' ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పది రోజుల పాటు 'నంద్యాల'లోనే బైఠాయించబోతున్నారు. ఆయన అక్కడే పది రోజుల పాటు ఉంటే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయని ఆ పార్టీ అభిమానులు చెబుతున్నారు. అయితే పార్టీ అభ్యర్థిగా నిర్ణయించిన 'శిల్పామోహన్‌రెడ్డి' ఎన్నికల్లో నిధులు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. పార్టీయే ఎన్నికల ఖర్చును భరించాలని ఆయన భావిస్తుండగా ఆయనే ఖర్చు పెట్టుకోవాలని అధిష్టానం భావిస్తోంది. దీంతో ఎన్నికలకు ముందే వైకాపాలో లుకలుకలు మొదలయ్యాయని తెలుస్తోంది. అయితే వీటిని సర్దుబాటు చేసుకుని ఎన్నికల్లో గట్టిపోటీ ఇవ్వాలని వైకాపా అధినేత భావిస్తున్నారు. ఎన్నికలకు మరో 27 రోజుల సమయం ఉండడంతో ఇటువంటి సమస్యలను తీర్చి ముందుకు దూకాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో గెలుపెవరిదో తెలియాలంటే ఆగస్టు 28వరకు ఆగాల్సిందే...!


(266)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ