WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

దక్షిణాదిలో బిజెపికి అంతసీన్‌ లేదు:కెసిఆర్‌

దక్షిణాధి రాష్ట్రాల్లో బిజెపి విస్తరించే ఛాన్స్‌ లేదని, ఆ పార్టీకి ఇక్కడ అంత సీన్‌ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఆయన గురువారం నాడు ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పలు అంశాలపై చర్చించారు. దక్షిణాధి రాష్ట్రాల్లో బిజెపి విస్తరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుందన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఇది అంత ఈజీ కాదని తేల్చేశారు. 2019 ఎన్నికల్లో ఆపార్టీ ఇప్పుడున్న ఎంపి సీట్లు నిలబెట్టుకోవడమే కష్టమవుతుందని వ్యాఖ్యానించారు. చాలా రాష్ట్రాల్లో బిజెపికి పునాదులే లేవని మరి అటువంటప్పుడు ఇక విస్తరించేది ఎక్కడని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడుల్లో వారికి అసలు పట్టులేదని, కర్ణాటక,ఒరిస్సాల్లో కొంత పట్టు దక్కిందని అన్నారు. ఇప్పటికే పట్టుసాధించిన కర్ణాటక, ఒరిస్సాల్లో అక్కడ ఉన్న ప్రభుత్వాలు మేల్కొన్నాయని బిజెపిని నిలువరించేందుకు అవి సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నాయని వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో బిజెపి ఓటు బ్యాంక్‌ కేవలం 2శాతం మాత్రమేనని ఆ శాతం వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఇప్పుడున్న సీట్లు కూడా రావని ఆయన వ్యాఖ్యానించారు. 

  బిజెపి సీనియర్‌ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిగా పంపడం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు నష్టమేనని, ఆయన లోటు తీర్చడం ఇప్పట్లో అయ్యేపనికాదని ఆయన అన్నారు. అటువంటి నాయకుడ్ని రాత్రికి రాత్రి పుట్టించలేమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణల మధ్య ఇప్పుడు పెద్దగా విభేదాలు లేవని అన్నారు. గతంలో నదీ జలాల వివాదాలు ఉండేవని అవి సర్దుకుంటున్నాయని ఆయన అన్నారు. తాను కనుక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని అయితే హైదరాబాద్‌లో వారం రోజుల కూడా ఉండేవాడిని కాదని, ఎవరైనా స్వంత రాష్ట్రం నుంచే పరిపాలన చేస్తే బాగుంటుందని అన్నారు. చంద్రబాబునాయుడు ఆ విధంగా చేయకుండా హైదరాబాద్‌ నుంచి పాలన చేయాలని భావించారని అదే సమయంలో తమ ప్రభుత్వంపై గురిపెట్టారని వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాకు 45శాతం, టిడిపికి 43శాతం, బిజెపికి2శాతం, పవన్‌కళ్యాణ్‌కు 1శాతం ఓట్లు వస్తాయని తనకు ఓ మిత్రుడు పంపిన సర్వేలో తేలిందన్నారు. గతంలో చిరంజీవి పార్టీ పెట్టి ఏమీ సాధించలేక కాంగ్రెస్‌లో కలిపేసి దాని బరువు తగ్గించుకున్నారని ఇప్పుడు 'పవన్‌కళ్యాణ్‌' చేతులూపితే అంతకన్నా ఎక్కువ సీట్లు వస్తాయా...? అంటూ ఆయన ప్రశ్నించారు. నోట్లరద్దు వల్ల జరిగిన ఉపయోగమేమిటో తెలుసుకోవాలని ప్రజలు,తానూ ఉత్సాహంతో ఉన్నామని కేంద్రం ఆ విషయంపై ప్రకటన చేయాలని ఆయన కోరారు. మొత్తం మీద కెసిఆర్‌ బిజెపిపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కల్గిస్తున్నాయి.


(209)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ