లేటెస్ట్

సిఎం గారూ..పాఠశాల విద్యాశాఖను ప్రక్షాళన చేయండి...!

అవినీతిని సహించేది లేదని, వారు ఎంతటి వారైనా..అవినీతికి పాల్పడితే ఊరుకునేది లేదని చెబుతోన్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాఠశాల శాఖలో జరుగుతున్న అవినీతివైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. గత ఐదేళ్ల టిడిపి పాలనలో పాఠశాల విద్యాశాఖ భ్రష్టుపట్టిపోయిందని, ఎన్నడూ లేని విధంగా శాఖ అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. పాఠశాల శాఖాధిపతిగా అర్హతలేని వారిని తీసుకువచ్చి 'చంద్రబాబు' అందలం ఎక్కించారని, వారు శాఖను ఇష్టారాజ్యంగా మార్చి దోచుకున్నారనే విమర్శలు ఉన్నాయి. 

అంతా అవినీతిమయం...!

గత ఐదేళ్లల్లో పాఠశాలశాఖ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. ఈ శాఖలో ఇంత దారుణమైన అవినీతి జరగడం వెనుక అధికారపార్టీ నాయకులు, అప్పటి సిఎంఒ కార్యాలయం, అప్పటి విద్యాశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులే కారణమని తెలుస్తోంది. ఒకటి కాదు..రెండు కాదు వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును అప్పటి సిఎంఒ అధికారులు, అప్పటి విద్యాశాఖ మంత్రి, ఇతర సీనియర్‌ అధికారులు వాటాల ప్రకారం పంచుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతి పనికి లెక్క కట్టి కమీషన్లు వసూళ్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యాశాఖ అధికారులను నిబంధనలకు విరుద్ధంగా నియమించుకుని...అప్పటి ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందనే ఆరోపణలు ఉండగా...ప్రస్తుత ప్రభుత్వం కూడా వారిని అదే స్థానాల్లో కొనసాగిస్తూ...అవినీతికి వంతుపాడుతుందనే మాట వినిపిస్తోంది. 

ఫిజికల్‌ లిటరసీ ప్రోగ్రామ్‌ పేరుతో రూ.200కోట్లు దోపిడీ...!

ఫిజికల్‌ లిటరసీ ప్రోగ్రామ్‌ పేరుతో గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.200కోట్లును దోచారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి సిఎంఒ అధికారుల సహాయంతో విద్యాశాఖ అధికారులు...ఈ నిధులను భుజించారనే ఆరోపణలు ఉన్నాయి.వీటిలో అప్పటి సిఎంఒ అధికారులకు వాటాలు ఉన్నాయి. తైక్వాండో, కూచిపూడి, భరతనాట్యం వంటి విద్యలను ఆన్‌లైన్‌ పాఠాలుగా చెబుతామంటూ..రూ.200కోట్లును దోచేశారు. వాస్తవానికి ఈ ఆన్‌లైన్‌ పాఠాలు...ఏయే స్కూల్స్‌లో నిర్వహించారో, వాటికి ఎంత ఖర్చు అయిందో అనేదానిపై రికార్డులు లేవు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ఈ ఆన్‌లైన్‌ పాఠాలను విజయవాడలోని స్కూల్స్‌లో నిర్వహించి మమ అనిపించారు. ఇక్కడ తప్ప మరెక్కడా వీటిని విద్యార్థులకు బోధించిన విషయం విద్యాశాఖలో కీలకంగా పనిచేస్తోన్న అధికారులకే తెలియదు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్జీఓలతో కుమ్మక్కై ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ పేరుతో ప్రభుత్వ నిబంధనల కన్నా ఎక్కువ మొత్తంలో సొమ్ములను విత్‌డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా ప్రవేట్‌ పాఠశాలలకు అనుమతులు ఇవ్వడంలో నిబంధనలను పాటించలేదని, ప్రైవేట్‌పాఠశాలల యాజమాన్యాల వద్ద భారీగా నిధులను వసూళ్లు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు సైకిళ్ల పంపిణీలో రూ.4కోట్లకు అక్రమాలకు పాల్పడ్డారు. నాణ్యత కల్గిన సైకిళ్లను విద్యార్థినులకు ఇవ్వకుండా పాతవాటికి పెయింట్లు వేసి ఇచ్చారు. 

రూ.2కోట్ల పనికి రూ.22కోట్లా...!?

2017వ సంవత్సరంలో సమ్మెటివ్‌ ఎస్‌స్‌మెంట్‌కు 8,9 తరగతుల పేపర్‌ ప్రింటింగ్‌ చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోయినా, బడ్జెట్‌ కేటాయింపులు లేకపోయినా, పేపర్‌ ప్రింటింగ్‌ను జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డుల ద్వారా చేయించుకుండా కాన్ఫిడెన్షియల్‌ పేరుతో వేరే రాష్ట్రాల్లో ప్రింటింగ్‌ చేయించి, విమానాల ద్వారా సరఫరా చేయించి రూ.22కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు ద్వారా ప్రింటింగ్‌ చేయిస్తే రూ.2కోట్లు ఖర్చు అయ్యే దానికి ఏకంగా రూ.22కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ సొమ్మును ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులకు ధారబోశారు. అప్పటి ప్రభుత్వ హయాంలో డీసీఈబీలకు దాదాపు రూ.2కోట్లు బకాయిలు ఉంటే వాటిని చెల్లించకుండా నిధులను దారిమళ్లించారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై అప్పట్లో వార్తాపత్రికల్లో వార్తలు రాగా అప్పటి ప్రభుత్వం దీనిపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించగా, అప్పటి సిఎంఒ అధికారులకు రూ.5కోట్ల వరకు ముడుపులు ముట్టచెప్పి తప్పించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

కాంట్రాక్టర్లు, ప్రింటింగ్‌ ప్రెస్‌ యాజమాన్యాల నుంచి వసూళ్లు....!

విద్యాశాఖకు చెందిన కాంట్రాక్టర్లు, ప్రింటింగ్‌ ప్రెస్‌ యాజమాన్యాల నుంచి విద్యాశాఖ అధికారులు భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. టెక్స్‌బుక్స్‌ డైరెక్టర్‌గా టిడిపికి అనుకూలమైన వ్యక్తిని నియమించుకుని ఆ పార్టీకి చెందిన సానుభూతిపరులకు ప్రింటింగ్‌ ఆర్డర్లు ఇచ్చి వారి వద్ద భారీ అక్రమవసూళ్లకు తెగబడినట్లు తెలుస్తోంది. ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి కూడా అక్రమ వసూళ్లు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. 

అప్పటి ప్రభుత్వ పెద్దలకు అనుకూలురైన అధికారులు విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించి కోట్లాది రూపాయలను ఆక్రమంగా దోచుకున్నారని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు. విద్యాశాఖలో జరిగిన అవినీతిపై సీబీఐ,ఏసీబీ,విజిలెన్స్‌ సంస్థలతో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విచారణ జరిపించాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకుని విద్యాశాఖను ప్రక్షాళన చేయాలని వారు కోరుతున్నారు. విద్యాశాఖలో నీతివంతమైన, సమర్థుడైన ఐఎఎస్‌ అధికారిని నియమించి, విద్యాశాఖను పటిష్టం చేయాలని ఉపాధ్యాయ సంఘాలతో పాటు, సమాజహితాన్ని కోరుకునే  వారు, విజ్ఞులు కోరుకుంటున్నారు. 

(1500)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ