WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు' కొంపముంచిన 'శ్రీకాంత్‌'...!

హైదరాబాద్‌లోని ఇరానీ ఛాయ్‌ దుకాణాల్లో కస్టమర్‌ తనకు కావాల్సిన పదార్థాలు తిన్న తరువాత బిల్లు చెల్లించేటప్పుడు సర్వర్‌ వెనుక నుంచి అరిచి చెబుతుంటాడు...! 'దో ఛాయ్‌...దో సమోసా...' బీస్‌ రూపీస్‌...! ఏక్‌ సమోసా...దో ఛాయ్‌ తీస్‌ రూపీస్‌...! అని...! అదే విధంగా ముగ్గురు మిత్రులు ఇరానీ ఛాయ్‌ దగ్గరకు వెళ్లారు. వారిలో ఇద్దరు...ఏదో తినేసి వెళుతుంటే సర్వర్‌...'దో ఛాయ్‌...దో సమోసా..! బీస్‌ రూపీస్‌...! అని చెప్పాడు...! వాళ్లు ఆ అమౌంట్‌ చెల్లించి వెళుతుండగా మూడో మిత్రునికి కూడా వెనుక నుంచి సర్వస్‌ అరచి 'దస్‌' రూపీస్‌...అంటాడు...అదేమిటి...నేనేమీ తినలేదు...తాగలేదు కదా...! నేనెందుకు డబ్బులు ఇవ్వాలంటే...! నువ్వన్నది నిజమే...! నువ్వేమీ తినలేదు...తాగలేదు...! కానీ...నీవు వాళ్లతో కలసి కూర్చున్నావు కదా...! దానికే 'దస్‌' రూపీస్‌ అంటూ సర్వర్‌ దబాయించాటడ...! ఇప్పుడు అదేవిధంగా ఉంది...ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిస్థితి. ఆయనేమీ తప్పు చేయకపోయినా...నిందలు పడాల్సి వస్తోంది.

గత వారం రోజుల నుంచి ఉద్యోగుల పదవీకాలంపై జరుగుతున్న రాద్దాంతం పైన చెప్పుకున్న 'ఇరానీ' ఛాయ్‌ కథలానే ఉంది. ఉద్యోగులకు 50సంవత్సరాల వయస్సు రావడం కానీ, 30సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నా కానీ...వెంటనే వారిని సర్వీసు నుంచి బలవంతంగా తొలగిస్తారని ఒకటే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇటు సీనియర్‌ అధికారులు, మంత్రులు వివరణ ఇచ్చినా...అటు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ ఇచ్చినా...ఉద్యోగుల్లో ఇంకా అనుమానాలు తొలగిపోలేదు...! తనకేం సంబంధం లేని విషయంలో ముఖ్యమంత్రి అనవసరంగా నిందలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ పత్రికతో పాటు...సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆయనకు తలబొప్పికట్టిస్తోంది. తనకేం పాపం తెలియదని మొత్తుకుంటున్నా...తానేం అన్యాయం చేయలేదన్నా...వారు ఆయనను వదలిపెట్టడం లేదు. అసలు తప్పు చేసిన వారు దర్జాగా అధికారం వెలగబెడుతుంటే...ఏ పాపం తెలియని ముఖ్యమంత్రి దానికి రోజూ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

2004లో అధికారం కోల్పోయిన దగ్గర నుంచి 'చంద్రబాబు' ఉద్యోగులను మచ్చిక చేసుకోవడానికి శతథా,సహ్రసథా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉద్యోగుల పట్ల వ్యవహరించిన తీరుకు అసంతృప్తి చెందిన ఉద్యోగులు ఆయనపై కక్షబూని 2004,2009 ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు. అయితే తరువాత మారిన పరిస్థితుల్లో 2014ల్లో ఆయన పట్ల వారు సానుకూలంగా వ్యవహరించారు. తనకు అనుకూలంగా ఉద్యోగుల్లో కొన్ని వర్గాలు ప్రచారం చేయటం, గతంలో చేసిన తప్పులు దిద్దుకోవాలన్న ఉద్దేశ్యంతో అప్పటి నుంచి ఆయన ఉద్యోగుల పట్ల స్నేహపూర్వక వైఖరిని అవలంభిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా...ఆయన ఉద్యోగులు అడిగినవి అడిగినట్లు చేస్తున్నారు. ఇక్కడో సంగతి చెప్పుకోవాలి.ఎందుకంటే ఉద్యోగులపట్ల ఆయన వైఖరి ఎలా మారిందో...వాళ్లకు ఆయన ఎంతగా సహకరిస్తున్నారో...తెలుస్తుంది.  తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఉద్యోగులకు 42శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించిన సందర్భంలో తమకూ అదేవిధమైన ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఆంధ్రా ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదని ముఖ్యమంత్రి, ఇతర సీనియర్‌ మంత్రులు, సీనియర్‌ అధికారులు భావించి అంత ఇవ్వలేమని మనకు ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని ఉద్యోగులను కోరారు. అయితే ఉద్యోగ సంఘాల్లోని ఓ ఉద్యోగి...ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చినంత ఫిట్‌మెంట్‌ తమకు ఇవ్వకపోతే వాళ్ల ముందు చులకన అయిపోతామని, తాము అది భరించలేమని చెప్పారట. నిన్నటి దాకా తమతో సమానమైన స్థాయిలో ఉన్న ఉద్యోగుల జీతాలు పెరిగి...తమకు జీతాలు వారికంటే తక్కువ ఉంటే తాము వారి ముందు తలెత్తుకోలేమని, అదీ కాక తెలంగాణ సంపదను ఇన్నాళ్లూ మీరు అక్రమంగా అనుభవించారు...! మీకు అంత ఆర్థిక స్థితిలేదు...అందుకే మీకు తక్కువ ఫిట్‌మెంట్‌ వచ్చిందని గేళ చేస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారట. దీంతో తెలంగాణ ఉద్యోగుల ముందు...ఆంధ్రా ఉద్యోగులు తలదించుకోకూడదన్న ఉద్యోగుల కోరికపై రాష్ట్ర ఆర్థికపరిస్థితి సరిగా లేకపోయినా వారు కోరిన విధంగా ఫిట్‌మెంట్‌ ఇచ్చి ఉద్యోగులను అవమానాల నుంచి ఆయన కాపాడారు...! ఇది ఉద్యోగుల పట్ల ఆయనకు ఉన్న కమిట్‌మెంట్‌...! ఇది స్వయంగా ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పిన మాటే...! అదే విధంగా వారి కోరిన విధంగా వెలగపూడి సచివాలయంలో, విజయవాడ, గుంటూరు పట్టణాల్లోపనిచేస్తున్న ఉద్యోగులకు ఉచిత వసతి, వారానికి ఐదురోజులే పని దినాలు చేయటం, ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయస్సును 58 నుంచి 60కి పెంచడం, హెల్త్‌కార్డులు...తదితర సదుపాయాలన్నీ కల్పించి ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్న 'చంద్రబాబు' ఇప్పుడు హఠాత్తుగా వారి ఉద్యోగ సర్వీసును తగ్గించే పనెందుకు చేస్తారు...!  అసలు ఆ పనిచేసిందెవరు...? నిందపడిందెవరి మీద...! అనే విషయంపై 'జనం ప్రతినిధులు' ఉద్యోగ సంఘాల నేతలతోనూ, ఇతర సీనియర్‌ అధికారులతోనూ చర్చించడం జరిగింది.

అసలేం జరిగింది...!

ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎసిబి దాడులు జరిగిన సందర్బాల్లో ఆయా ఉద్యోగులు భారీగా అక్రమాస్తులు పోగేసుకున్నారనే విషయం బయటపడింది. కొందరు ఉద్యోగులు వెయ్యికోట్లు దాకా సంపాదించారని, మరి కొందరి ఆస్తులు ఐదు వందల కోట్లు, వంద కోట్లు వరకు దొరికాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటువంటివారి వల్ల ప్రభుత్వ పరువు పోతోందని, అదే విధంగా ప్రజల సొమ్ము పరుల పాలవుతుందని వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోగలమే చర్చించాలని సీనియర్‌ అధికారులను కోరారట. వీరిని ఏ విధంగా కట్టడి చేయాలనే దానిపై చర్చ జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అవినీతికి, అక్రమాలకు, ఉద్యోగబాధ్యతలుసరిగా నిర్వర్తించని వారిని సర్వీసు నుంచి తొలగిస్తున్నారని, అదే విధంగా మనము కూడా ఇక్కడ చేస్తే బాగుంటుందనే సూచనలు వారి వద్ద నుంచి వచ్చాయట. దీంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ అవినీతికి పాల్పడివారిని సర్వీసు నుంచి తొలగించే విధానపరమైన విషయాలపై చర్చించి సూచనలు చేయమని జిఎడి అధికారులకు చెప్పారట. దీంతో ఇక జిఎడి అధికారులు రెచ్చిపోయారు.

జిఎడి అధికారులేం చేశారంటే...!

తమకు సిఎం ఈ విధమైన ఆదేశాలు ఇచ్చారని వెంటనే ఉద్యోగుల సర్వీసుపై డ్రాప్టు జీఓను రూపొందించారు. దీనిలో కూడా సిఎం చర్చించమని చెప్పింది ఒకటి అయితే వీరు దాన్ని మరోలా రూపొందించారు. వీరి రూపొందించిన జీఓలో ఉద్యోగిపనితీరు(ఫెర్మామెన్స్‌), ఉద్యోగి నిజాయితీ(ఇంటిగ్రిటీ), ఉద్యోగి అసమర్థత (ఇనెఫిషియెన్స్‌)లపై అనుమానం కలిగితే ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించాలని చెప్పారు. అయితే వీరు దీన్ని కూడా సక్రమంగా చేయలేదు...! ముందుగా సంబంధిత శాఖ ఎస్‌ఒ దీనిపై నోటు ఫైల్‌ రాసి దాన్ని సంబందితశాఖ కార్యదర్శికి పంపాలి...! ఇక్కడ వీళ్లేం చేశారంటే నోట్‌ఫైల్‌ లేకుండానే సరాసరి డ్రాప్ట్‌ జీఓను తయారు చేసి ఆర్థిక,న్యాయశాఖల ఆమోదం కోసం పంపారు. ఈ సమాచారం సంబందితశాఖ ఉన్నతాధికారులకు కానీ...మంత్రులకు కానీ, చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కానీ తెలియపరచలేదు...! డ్రాప్టు జీఓను రూపొందించి ఆయాశాఖల ఆమోదం కోసం పంపడం, దానిపై న్యాయశాఖ,ఆర్థికశాఖ ఎటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయకుండా యధావిధిగా దాన్ని ఆమోదించి మళ్లీ జిఎడికి పంపారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. డ్రాప్ట్‌ జీఓ ఈ విధంగా ఉందని ప్రతిపక్షనేతకు చెందిన పత్రికకు జిఎడిశాఖలోని క్రిందిస్థాయి ఉద్యోగులు యధావిధిగా అందజేశారు. ఇక అక్కడ మొదలైంది రచ్చ..! దీనిలో 'చంద్రబాబు' కానీ...ఆయన మంత్రులు కానీ, సీనియర్‌ అధికారుల ప్రమేయం కానీ అణువంత లేదు..! కేవలం 'ఉద్యోగుల అవినీతి(ఇంటిగ్రిటీ)పై జరిగిన చర్చే తప్ప వేరే విషయాలేమీ లేకపోయినా ప్రభుత్వం నిందను భరించాల్సి వస్తోంది. జిఎడి అధికారుల అత్యుత్సాహం వల్ల ఇప్పుడు ముఖ్యమంత్రి పదే పదే ఉద్యోగులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. దీనింతటికి కారణం ఎవరు...? అత్యుత్సాహంగా డ్రాప్టు జీఓను తయారు చేసిన జిఎడి అధికారులదా...? లేక దాన్ని యథాతంగా ఆమోదించిన ఆర్థిక,న్యాయశాఖ అధికారులదా...!

అసలు డ్రాప్టు జీఓ ముందే ఎలా రూపొందించారు..!

ప్రభుత్వం ఏదైనా ఒక విధాన నిర్ణయం తీసుకునే ముందు ఆ శాఖ అధికారులు నోట్‌ఫైల్‌ తయారు చేసి సంబందిత శాఖ కార్యదర్శికి పంపుతారు. కార్యదర్శి సంబందిత మంత్రికి, అసరమైతే ముఖ్యమంత్రికి పంపిన నోట్‌ఫైల్‌ను ఓకే చేయించుకున్న తరువాత డ్రాప్ట్‌ జీఓను రూపొందించి చర్చకు పెడతారు...! కానీ ఉద్యోగుల వయస్సు తగ్గింపు విషయంలో అదేమీ జరగలేదు..! వీరెవరి ఆమోదం లేకుండానే డ్రాప్టు జీఓ రూపొందించి 'చంద్రబాబు'ను ఉద్యోగుల ముందు దోషిగా చూపించారు జిఎడి అధికారులు. దీనంతటికి జిఎడి పొలిటికల్‌ కార్యదర్శి 'నాగులపల్లి శ్రీకాంత్‌' వ్యవహారశైలే కారణమని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబును సమర్థించే ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రికి లేని ఉద్దేశ్యాలను 'శ్రీకాంత్‌' తన నిర్ణయంతో ఆపాదించారని వారు ఆరోపిస్తున్నారు. ఆయనకు వ్యక్తిగతంగా ఎటువంటి ఉద్దేశ్యాలు ఉన్నాయో తమకు తెలియదని, అయితే ఆయన ఈ పనిని కావాలని చేశారా...? లేక యథాలాపంగా చేశారా...? అనేది చెప్పలేమని ఆయన చేసిన చర్య వల్ల తాము కూడా నిందలు పాలవుతున్నామని వారు వాపోతున్నారు. ప్రభుత్వం ఇటు వంటి నిర్ణయం తీసుకుంటుంటే మీరేమి చేస్తున్నారని ఉద్యోగులు తమను నిలదీస్తున్నారని, తాము కానీ...సిఎం చంద్రబాబు కానీ ఎంత వివరణ ఇచ్చినా...వారు సమాధానపడడం లేదని వారు అంటున్నారు. ఇకపై ముఖ్యమంత్రి ప్రసంగించే ప్రతిసభలో ఉద్యోగుల గురించి వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, అదే సమయంలో ఈ విధమైన ప్రచారానికి కారణమైన 'శ్రీకాంత్‌'ను అక్కడ నుంచి తప్పించాలని వారు కోరుకుంటున్నారు. 'శ్రీకాంత్‌'ను తప్పిస్తేనే దీనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిజాయితీ బయటపడుతుందని మరి కొందరు అంటున్నారు. మొత్తం మీద తాను చేయని తప్పుకు 'చంద్రబాబు' వివరణ ఇచ్చుకోవాల్సిన రావడం ఆయనకు, అయన పార్టీ అభిమానులకు అసంతృప్తి కల్గిస్తోంది.  అసలు జిఎడి పొలిటికల్‌ కార్యదర్శిగా 'శ్రీకాంత్‌'ను నియమించడమే తప్పని టిడిపి సీనియర్‌ నాయకులు వాదిస్తున్నారు. ఆయన వ్యవహారశైలి ఆ పోస్టుకు సరిపోదని వారు అంటున్నారు. ఆయనకు అందరితో కలసి పనిచేసే విధానం లేదని, ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తుంటారని ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరించి 'చంద్రబాబు' కొంప ముంచారని వారు అంటున్నారు. సిఆర్‌డిఎ కమీషనర్‌గా ఆయన ఉన్నప్పుడు రైతుల పట్ల ఆయన వ్యవహరించిన విధానం అప్పట్లో తీవ్ర వివాదాస్పదం అయింది. చివరకు ఆయనను తొలగించి గుంటూరు జెసిగా ఉన్న 'శ్రీధర్‌'ను నియమించి రైతుల అసంతృప్తిని పోగొట్టాల్సి వచ్చింది. అప్పుడే ఆయనను వేరేశాఖకు పంపాల్సిందని ఇంత ప్రాధాన్యత కల పోస్టులో తెచ్చిపెట్టుకుని 'చంద్రబాబు' తలవంపులు తెచ్చుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

(దావులూరి హనుమంతరావు, బి.ఆర్‌.కె.మూర్తి)

(2224)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ