WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బయోమెట్రిక్‌ విధానంపై ఉద్యోగుల అసంతృప్తి...!

ఉద్యోగుల హాజరు శాతం పెంచడానికి, సమయానికి కార్యాలయానికి వారు హాజరయ్యేలా,ఉద్యోగుల్లో బాధ్యతను మరింత పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'బయోమెట్రిక్‌' విధానంపై ఉద్యోగుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది.ఈ విధానం వల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దీన్ని కఠినంగా అమలు చేయటంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రి కోరికను తాము మన్నించి హైదరాబాద్‌ నుంచి వెలగపూడికి వస్తే తమను 'బయోమెట్రిక్‌' పేరుతో వేధించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లో తాము రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగాలు చేస్తూ ఉద్యోగాలు చేస్తున్నా కొందరు అధికారులకు సంతృప్తి కలగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'వెలగపూడి' సచివాలయం, విజయవాడ, గుంటూరు పట్టణాల్లో ఉన్న డైరెక్టరేట్లుల్లో ఉన్న ఉద్యోగులు ఈ విధానం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. బయోమెట్రిక్‌ విధానం వల్ల క్షణం ఆలస్యం అయినా తమకు ఆప్‌సెంట్‌ పడుతుందని, ఒక్కోసారి బయోమెట్రిక్‌ మిషన్‌లోని లోపాల వల్ల వేలిముద్రలు తీసుకోవడం లేదని, మరోసారి వేలిముద్రలు అరిగిపోవడం వల్ల వాటిని మిషన్‌ గుర్తించలేకపోతుందని దీని వల్ల తాము సమయానికే కార్యాలయానికి వచ్చినా రానట్లు చూపుతుందని దీనిపై తమ బాస్‌లు తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వారు అంటున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఈ విధానం వల్ల మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయని వారు చెబుతున్నారు. మహిళా ఉద్యోగులు గృహాల్లో వంటపని చేసేటప్పుడు వారి వేళ్లపై ఉన్న గీతలు చెరిగిపోతున్నాయని, దీని వల్ల బయోమెట్రిక్‌ మిషన్‌ ఆ గీతలను గుర్తించలేకపోవడంతో రోజూ సమస్య ఎదురవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

   అంతే కాకుండా 'వెలగపూడి' సచివాలయానికి విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ రావాలంటే దాదాపు అరగంటకు పైగా సమయం పడుతుందని, సింగిల్‌రోడ్డుపై వాహనాల్లో ప్రయాణించడం సమస్యలను సృష్టిస్తుందని ఉద్యోగులు అంటున్నారు. ఈ రహదారులు పలు మలుపులతో ఘాట్‌ రోడ్డులను తలపిస్తున్నాయని ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, వేగంగా ప్రయాణించినా ప్రమాదాలు సంభవిస్తాయని, కార్యాలయానికి సకాలంలో వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఏమాత్రం హడావుడిగా ప్రయాణించినా ప్రమాదాలు జరుగుతాయని వారు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు ఈ రహదారులపై ప్రమాదానికి గురయ్యారు. అంతే కాకుండా సచివాలయానికి వచ్చిన తరువాత ప్రధాన గేటు నుంచి కార్యాలయానికి దూరం ఎక్కువగా ఉందని, ప్రధాన గేటు నుంచి కార్యాలయంలోకి వెళ్లాలంటే సుమారు 15 నిమిషాలు పడుతుందని వారు చెబుతున్నారు. దీంతో సకాలంలో వెళ్లాలన్న భయంతో ఉద్యోగులు కొందరు పరుగులు పెడుతున్నారని, వయస్సు పెరిగిపోయిన ఉద్యోగులు ఈ విధంగా హైరానాపడి పరుగులు పెడితే సమస్యలు వస్తాయని దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని కూడా వారు చెబుతున్నారు. బయోమెట్రిక్‌ విధానంతో అరనిమిషం ఆలస్యం అయినా అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారని, ఇది సరికాదని వారు అంటున్నారు. ఒకవేళ ఒక ఉద్యోగి అరగంటో...గంటో ఆలస్యంగా కార్యాలయానికి వచ్చినా సాయంత్రం పూట ఆ సమయాన్ని భర్తీ చేస్తారని అటువంటప్పుడు వారిపై చర్యలు తీసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో కానీ, విజయవాడలోనికి ఉన్న ప్రైవేట్‌ కార్యాలయాల్లో ఇదే విధానం నెలకొని ఉందని వారు అదే విధానాన్ని అనుసరిస్తే సరిపోతుందని ఉద్యోగులు చెబుతున్నారు. తమ కుటుంబాలన్నీ హైదరాబాద్‌లో స్థిరపడి ఉన్నాయని, కుటుంబసభ్యులు అక్కడ తాము ఇక్కడ ఉండి ఉద్యోగాలు చేస్తున్నామని తమ పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'దినేష్‌కుమార్‌' ఈ విషయంలో కఠినంగా వ్యవహరించకపోయినా...కొంత మంది సీనియర్‌ అధికారులు మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారని దీనిపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూద్దాం...!


(157)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ