WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నంద్యాల'లో వైకాపాదే పైచేయి...!

'నంద్యాల' ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభం అయిన నేపథ్యంలో ఇప్పటికే వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలో 'జగన్‌' పార్టీ అభ్యర్థి 'శిల్పామోహన్‌రెడ్డి' అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని వెల్లడైందట. కేంద్ర నిఘా సంస్థలు నిర్వహించిన సర్వేలో కూడా అదే అభిప్రాయం వ్యక్తం అయిందట. రాష్ట్ర నిఘా సంస్థ నిర్వహించిన సర్వేలో టిడిపి, వైకాపా అభ్యర్థుల పోటీ రసవత్తరంగా జరగబోతుందని కొందరు అధికారులు ఆ సమాచారాన్ని లీక్‌ చేశారు. మాజీ మంత్రి ఎన్‌.ఎం.డి.ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా...మైనార్టీ,ముస్లింల్లో సంతృప్తి వ్యక్తం కావడం లేదు. భూమా అఖిలప్రియకు, ఆదినారాయణరెడ్డిలకు మంత్రి పదవులు ఇచ్చినా, రామసుబ్బారెడ్డి మరి కొందరు 'రెడ్డి' వర్గానికి చెందిన వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినా ఆ సామాజికవర్గానికి చెందిన వారంతా 'వైకాపా'వైపు మొగ్గుచూపడం గమనార్హం. అదే విధంగా క్రైస్తవ ఓటర్లు కూడా 'జగన్‌' వైపే మొగ్గుచూపిస్తున్నారు. 'పవన్‌కళ్యాణ్‌' సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 30వేల మందికి పైగా ఉన్నప్పటికీ వారు ఎటువైపు మొగ్గుచూపుతారో రాజకీయ వర్గాలకు అంతుబట్టడం లేదు. 'పవన్‌' టిడిపికి మద్దతు ఇస్తే ఆ ప్రభావం కొంత మేరకు పనిచేసే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం,బిజెపి, పవన్‌ ఏకమైనా తమ అభ్యర్థి 30వేలకు పైగా మెజార్టీతో విజయం సాధిస్తారని స్థానిక వైకాపా నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

   'జగన్‌' ఎన్నికల ప్రచారానికి వేల సంఖ్యలో ఓటర్లు హాజరు కావడంతో టిడిపి నాయకుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. 'చంద్రబాబు' పర్యటన ప్రారంభించి ఎన్నికల సభలను విజయవంతం చేస్తేనే వారి భయాందోళనలు తొలగుతాయి. టిడిపిలో గత ముప్పయి సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నాయకులను, కార్యకర్తలను నిన్నటి వరకు ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు 'శిల్పా మోహన్‌రెడ్డి' కాంగ్రెస్‌ నుంచి టిడిపిలోకి చేరి 'భూమానాగిరెడ్డి'పై ఓడిపోయారు. అప్పట్లో 'భూమానాగిరెడ్డి' భార్య 'శోభానాగిరెడ్డి' రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ సానుభూతి 'భూమానాగిరెడ్డి'కి కలిసి వచ్చిందని అప్పట్లో టిడిపి నాయకులు భావించారు. 'జగన్‌' పార్టీ ఓటు బ్యాంక్‌ అయిన మూడు వర్గాల ఓటర్లలో కనీసం ముప్పయి శాతం చీలిక తీసుకురాగలిగితేనే టిడిపి అభ్యర్థి గట్టి పోటీ ఇవ్వగలుగుతారు. ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడంలో అపార అనుభవం ఉన్న 'చంద్రబాబు' 'నంద్యాల' టిడిపి అభ్యర్థిని గెలిపిస్తారని ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. 'నంద్యాల'ను ఎంతో అభివృద్ధి చేశామని అధికారపార్టీ నాయకులు చెబుతున్నప్పటికీ ఓటర్లల్లో మచ్చుకైనా ఆ ప్రభావం కనిపించడం లేదు. మైనార్టీ ఓటర్లలో చీలిక తెచ్చేందుకు 'ఫరూక్‌, నౌమన్‌ తీవ్రంగా కృషి చేస్తేనే ఆ వర్గాల్లో చీలిక వస్తుంది. నియోజకవర్గంలో 1989,2004,2009,2014ల్లో టిడిపి అభ్యర్థులు ఓడిపోయారు. 2004లో 'చంద్రబాబు'పై వ్యతిరేకత అని సరిపెట్టుకున్నా 2009,2014ల్లో కుల,మత పరిణామాలు ఆ నియోజకవర్గంలో బాగా పనిచేశాయి. నిన్నటి వరకు ఆళ్ళగడ్డకే పరిమితమైన 'భూమా' పలుకుబడి 'నంద్యాల'లో ఎంత వరకు పనిచేస్తుందో...? టిడిపి అభ్యర్థి గెలుపు 'బాబు' భుజస్కంథాలపై ఉందని స్థానిక నాయకులు నమ్ముతున్నారు. సామ,భేద, దండోపాయాలను ఉపయోగించడంలో అపార అనుభవం ఉన్న 'చంద్రబాబు' నంద్యాలలో ఏ విధంగా ముందుకు వెళతారో చూడాల్సిందే...! గెలుపుపై ధీమాతో ఉన్న వైకాపా నాయకులు ఆదమరిచి గట్టి ప్రయత్నాలు చేయకుంటే శృంగభంగం తప్పదని ఆ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. 'చంద్రబాబు' ప్రచారం ప్రారంభమైన అనంతరమే 'నంద్యాల'లో ఎన్నికల వేడి పుంజుకునే అవకాశం ఉంది. ఏదో విధంగా 'నంద్యాల'లో గెలిచితీరాలని 'జగన్‌' గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు..అదే విధంగా సిఎం చంద్రబాబు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో పార్టీల బలాబలాలు తేలిపోయే అవకాశం ఉంది. 'జగన్‌'ది ఆరంభశూరత్వం..చంద్రబాబు శూరత్వం ఆఖరి నిమిషంలో బయటపడవచ్చు.

(345)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ