WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అబ్బా...ఆ మాటనకుంటే బాగుండేది...!

నిన్న 'నంద్యాల'లో వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌ సభ జరిగిన తీరు ఆ పార్టీని ఆనందడోలికల్లో ముంచెత్తుతోంది. అనుకున్న దాని కన్నా 'జనం' ఎక్కువ రావడం, ఓటర్ల నుండి బ్రహ్మాండమైన స్పందన రావడం వారిని అమితానందంలో ముంచెత్తింది. 'జగన్‌', ఎమ్మెల్యే రోజా ప్రసంగాలకు వారు కేరింతలు కొట్టారు. మాస్‌ జనాన్ని చూసి 'జగన్‌', రోజాలు తమ నోరును అదుపులో పెట్టుకోలేకపోయారు. 'రోజా' తన 'జబర్దస్త్‌' డైలాగులతో రెచ్చిపోగా...'జగన్‌' ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన విమర్శలు  తీవ్ర దుమారాన్ని రేపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న ఆయన డైలాగ్‌ స్వంత పార్టీలోనే విమర్శలకు కారణం అయింది. 'చంద్రబాబు'పై ఎంత వ్యక్తిగత ద్వేషం ఉన్నా ఇటువంటి మాటలు మాట్లాడితే ఎలా...? అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. సభ బ్రహ్మాండంగా విజయవంతమైన సమయంలో 'ఆ...ఒక్క మాట అనకుండా ఉంటే బాగుండేదని' పార్టీ సీనియర్‌ నాయకులతో పాటు సామాన్య కార్యకర్తలు కూడా బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తమ అధినేత చేసిన పనివల్ల తాము ఇప్పుడు డిఫెన్స్‌లో పడాల్సి వచ్చిందని వారు అంటున్నారు. 

   కాగా ఇదంతా 'జగన్‌' బృందం కావాలనే చేసిందనేది మరి కొందరు నాయకుల వాదన. 'పికె' తదితరులు ఇచ్చిన సలహాతోనే 'జగన్‌' కాల్చడం వంటి వ్యాఖ్యలు చేశారని దీని వల్ల ప్రజల్లో 'జగన్‌' గురించి విస్తృత చర్చ జరుగుతుందనేది వారి అభిప్రాయమట. అదీ కాక 'నంద్యాల'లో 'జగన్‌' మరో వారం రోజుల పాటు బస చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు కార్యకర్తలు, నాయకులకు 'కిక్‌' ఇస్తాయని వారు భావిస్తున్నారట. తమ నాయకుడు చేసిన వ్యాఖ్యల వల్ల కార్యకర్తల్లో మనోనిబ్బరం పెరుగుతుందని, అవసరమైతే తాము స్వయంగా ముఖ్యమంత్రిపైనే దాడి చేయగల సామర్ధ్యం తమకు ఉందని చెప్పుకునేందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారని కూడా వారు అంటున్నారు. కాగా మరి కొందరు మాత్రం మరో విధంగా స్పందిస్తున్నారు. తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరిన ఎమ్మెల్సీ 'శిల్పా చక్రపాణి' తన పదవికి రాజీనామా చేసి వైకాపాకు సువర్ణావకాశాన్ని కల్పించారని, కానీ 'జగన్‌' చేసిన అనాలోచిత వ్యాఖ్యల వల్ల ఇప్పుడు తామే డిఫెన్స్‌లో పడ్డామనేది వారి అభిప్రాయం. ఎందుకంటే తమ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా వారు ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేసి రావాలనేది 'జగన్‌' నిబంధన అని తద్వారా తాము నైతిక విలువలకు కట్టుబడి ఉన్నామని చెప్పడం ఆయన ధ్యేయం. 'శిల్పా చక్రపాణిరెడ్డి' విషయంలో కూడా 'జగన్‌' ఖచ్చితంగా వ్యవహరించి ఇన్నాళ్లూ తాను చెబుతున్న నైతిక విలువల మాటను పాటించారని, మరి టిడిపి తమ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధపడాలని వారు ఇన్నాళ్లూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా ఆ అంశాన్ని గట్టిగా డిమాండ్‌ చేయకుండా, ఆవేశంలో ముఖ్యమంత్రిని బహిరంగంగా నడిరోడ్డుపై కాల్చి చంపాలని వ్యాఖ్యానించి తామే టిడిపికి అనవసర అస్త్రాలను అందించామనేది వారి విశ్లేషణ.దీన్ని టిడిపి నేతలు బాగానే అందుకున్నారనేది వారి వాదన. నిన్న 'జగన్‌' చేసిన వ్యాఖ్యలపై టిడిపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నేతలు, ఇతర కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి 'జగన్‌' దిష్టిబొమ్మలను తగులబెడుతూ ఆయన హంతక రాజకీయాలను ప్రజలకు వివరిస్తున్నారు. తాము అభివృద్ధిపై దృష్టిపెడితే 'జగన్‌' హత్యారాజకీయాలపై దృష్టిపెడుతున్నారని, వారి కుటుంబ గత చరిత్రను తవ్వి తీస్తున్నారు.  దీంతో ఒక్కసారిగా 'హత్యారాజకీయాల' అంశమే ఇప్పుడు అందరి అజెండా అయింది. మొత్తం మీద 'జగన్‌' అనాలోచితంగా చేసిన వ్యాఖ్యల వల్ల ఆయనే డిఫెన్స్‌లో పడ్డారనేది అందరూ అంగీకరించే అంశమే. మరి రాబోయే ఉప ఎన్నికల్లో ఈ వ్యాఖ్యల ప్రభావం ఎంత వరకు ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.


(436)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ