లేటెస్ట్

'రాజధాని' తరలిపోతుందా...!?

అందరూ ఊహించిన విధంగానే రాజధాని 'అమరావతి' నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారం మారగానే...'అమరావతి' నిర్మాణం సాగదని అప్పట్లో చాలా మంది భావించారు. 'అమరావతి' వల్ల కొందరికే ఉపయోగం జరిగిందని, టిడిపి ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందని, రైతులను బెదిరించి భూములను లాక్కున్నారని, మూడు పంటలు పండే భూముల్లో రాజధాని ఎందుకని..అసలు అంత భూమే అసరం లేదని, రాజధాని ఇక్కడ అవసరం లేదన్న వారి మాటే నిజమయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందని, అవినీతిని నిగ్గు తేలుస్తామని చెప్పి...విచారణ కోసం కమిటీలు వేయడం, కొనసాగుతున్న నిర్మాణాలను ఆపు చేయడంతో...రాజధాని నిర్మాణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల నుంచి సేకరించిన భూములను మళ్లీ వారికే ఇస్తామని, రాజధానికి వేలాది ఎకరాలు అవసరం లేదని వాదించింది. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రావడంతోనే.. రైతుల భూములు మళ్లీ తిరిగి వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరో వైపు ప్రపంచబ్యాంక్‌ రాజధాని నిర్మాణానికి ఇస్తానన్న రుణాన్ని ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో..'అమరావతి'లో రాజధాని కొనసాగుతుందా..? లేక మరోచోటికి తరలిపోయే అవకాశం ఉందా..? అనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి నుంచి ఇక్కడ రాజధాని నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న వైకాపా...తాజాగా ప్రపంచ బ్యాంక్‌తీరుతో... రాజధానిని తరలించాలనే ఆలోచన చేసేటట్లు కనిపిస్తోంది. 

రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందని, అందుకే ప్రపంచబ్యాంక్‌ కూడా ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగిందని చెబుతూ.. రాజధానిని వేరే ప్రాంతానికి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఏమీ చెప్పకపోయినా...వైకాపా నాయకులు దీనిపై చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడ నుంచి రాజధానిని తరలించాల్సిన పరిస్థితి వస్తే..ముందుగా నూజివీడు లేదా...నాగార్జునయూనివర్సిటీ ప్రాంతానికి వెళ్లడానికి అవకాశాలున్నాయనేది కొందరి మాట. అదీ కాక పోతే 'శివరామకృష్ణ' కమిటీ చెప్పినట్లు 'దొనకొండ'కు పూర్తిగా తరలిపోయే అవకాశం ఉంది. మొత్తం మీద..రాజధాని తరలింపు ఇప్పటికిప్పుడు జరగకపోయినా...రాబోయే కాలంలో రాజధాని మార్పు అనేది తప్ప ఉంటుందనేది వైకాపాలో మెజార్టీ నాయకుల భావన. కాగా..ప్రపంచబ్యాంక్‌ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో.. 'అమరావతి' ప్రాంత ప్రజల్లో నిరాశ కనిపిస్తోంది. తమ భూములు ఏమవుతాయోనన్న భయం కొందరిలో ఉండగా... అమాంతం పెరిగిన ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తుండంతో ఏమి చేయాలో తెలియక మరి కొందరు బిక్కుబిక్కు మంటున్నారు. 

(616)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ