WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

హత్యారాజకీయాలపై...ఆరోపణలు....!

'నంద్యాల' ఉప ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇంకా దుమారం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న ఆయన మాటలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలపై అధికార టిడిపి నేతలు భగ్గుమన్నారు. పలుచోట్ల 'జగన్‌'కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించి ఆయన దిష్టిబొమ్మలను తగులబెట్టారు. 'జగన్‌' అన్న మాటలను వెనక్కుతీసుకుని ఆయన క్షమాపణ చెప్పాలని టిడిపి డిమాండ్‌ చేసినా 'జగన్‌' పట్టించుకోవడం లేదు..! అంతే కాకుండా ఆయన స్వంత పత్రికల్లో తాను అన్న వ్యాఖ్యలు సమర్ధనీయమే అన్నట్లు కథనాలు రాయిస్తున్నారు. తాను ధర్మాగ్రహంతో ఆ మాటలు అన్నట్లు పేర్కొంటున్నారు. 'అలుగుట‌యే ఎరుంగ‌ని...అజాతశత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకాము కాకపోవు...! అంట...ఇది ఆయన పత్రికలో రాసుకున్న కథనం...!. 'జగన్‌' అజాతశ్రతువు అట...! ఆయనకు కోపమే రాదట...! ఆయన చీమకు కూడా హాని చేయని శాంతమూర్తట...ఇప్పుడు రాక రాక కోపం వచ్చిందట...! ఇక సాగరాలన్నీ ఏకం కావడమేనట...! సరే...వారి పత్రిక వారిష్టం...ఆ పాఠకుల ఇష్టం...! మన కెందుకు కానీ...! ఇప్పుడు 'జగన్‌' వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించడం...దానికి వైకాపా నేతలు స్పందించడంతో రాష్ట్రంలో హత్యారాజకీయాలపై చర్చ జరుగుతోంది.

    త‌న‌పై అలిపిరిలో మావోయిస్టులు దాడి చేసిన సంఘటన వెనుక  స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హస్తం ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. మావోయిస్టులకు 'రాజశేఖర్‌రెడ్డి' సహాయం చేశారని, వారికి సెల్‌ఫోన్లు అందించి తనపై దాడికి పక్కాప్లాన్‌ వేశారని సిఎం ఆరోపించారు. ఈ విషయం అప్పట్లో నియమించిన ఏకసభ్య కమీషన్‌ కూడా గుర్తించిందని ఆయన చెప్పారు. తనపై దాడిచేసిన 'గంగిరెడ్డి'ని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తుంటే 'వై.ఎస్‌' వణికిపోయారని, ఆయన పేరు ఎక్కడ బయటకు వస్తుందోనని పదే పదే పోలీసులకు ఫోన్‌ చేశారని, ఇదీ రికార్డు అయిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సంగతులన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశ్యంతోనే నాడు మావోయిస్టుల చర్యకు నిరసనగా తిరుపతిలో ధర్నా చేసినట్లు నటించారని, వాస్తవంగా ఆనాడు తనపై మావోయిస్టులు దాడి వెనుక వై.ఎస్‌ ఉన్నారని ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. వై.ఎస్‌.కుటుంబం మొత్తం హత్యారాజకీయాలతోనే రాజకీయాల్లో పైకి వచ్చిందని, ఇప్పుడు 'జగన్‌' కూడా అదే పద్దతిలో వెళుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చాలని ఎవరైనా అంటారా..? అని ఆయన ప్రశ్నించారు. 

   అయితే తనపై దాడి వెనుక వై.ఎస్‌ హస్తం ముందన్న 'చంద్రబాబు' వ్యాఖ్యలపై వైకాపా నాయకులు మండిపడుతున్నారు. ఇన్నాళ్లూ ఈ సంగతి ఎందుకు చెప్పలేదని నిలదీస్తున్నారు. అంతే కాకుండా హత్యారాజకీయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆద్యుడని వారు విమర్శిస్తున్నారు. వంగవీటి మోహన్‌రంగాను నడిరోడ్డుపై కిరాతకంగా నరకడం వెనుక 'బాబు' హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలో నువ్వు ఫినిష్‌ అవుతావో....నేను ఫినిష్‌ అవుతానో...చూద్దాం అన్న మరసటి రోజే వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హత్యకు గురయ్యారని వైకాపా నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. అనంతపురంలో వందల మంది కాంగ్రెస్‌ కార్యకర్తల హత్యల వెనుక కూడా ఆయనే ఉన్నారని, అదే విధంగా 'మల్లెల బాబ్జి' ఆత్మహత్యకూ 'చంద్రబాబే' కారణమని ఆయన విమర్శించారు. మొత్తం మీద అటు 'జగన్‌' వ్యాఖ్యలు...ఇటు ముఖ్యమంత్రి 'చంద్రబాబు' స్పందనతో రాష్ట్రంలో ఇరు పార్టీ నాయకులు హత్యారాజకీయాలపై దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కాగా ఈరోజు నుంచి 'నంద్యాల'లో మలివిడత 'జగన్‌' పర్యటన జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరింతగా వేడెక్కనున్నాయి.


(238)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ