WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఓటమిని 'వాఘేలా' మీదకి నెట్టేసిన 'షా'....!

గుజరాత్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికలు 'బిజెపి' అధిష్టానానికి తలబొప్పి కట్టించాయి. ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ 'అహ్మద్‌పటేల్‌'ను గెలవనీయకూడదనుకున్న బిజెపి పెద్దలకు చుక్కెదురయింది. తాము ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ఆయన విజయం సాధించడంతో తమ లెక్కలో తేడా ఎక్కడ వచ్చిందనేదానిపై పోస్ట్‌మార్టమ్‌ చేసుకుంటున్నారు. 'అహ్మద్‌పటేల్‌' గెలవడం వెనుక 'వాఘేలా' చేసిన తప్పులే కారణమని వారు అంటున్నారట. తాము పన్నిన వ్యూహాన్ని అమలు చేయటంలో ఆయన పొరపాట్లు చేశారని అందుకే 'బిజెపి' అభ్యర్థి ఓడిపోయారని చెబుతూ ఓటమికి 'వాఘేలా'ను సాకుగా చూపుతున్నారట.

   మొదట నుంచి సోనియాగాంధీ రాజకీయకార్యదర్శి అయిన 'అహ్మద్‌పటేల్‌'కు ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాకు మధ్య చాలా సంవత్సరాల నుంచి విభేదాలు ఉన్నాయి. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారం చెలాయిస్తున్న రోజుల్లో 'అహ్మద్‌పటేల్‌' 'మోడీ,షాలను ముప్పుతిప్పులు పెట్టారు. చివరకు 'షా'ను కొన్నాళ్లపాటు జైలుకు కూడా పంపించారు. అప్పట్లో ఆయనకు ఉన్న హోదాతో వీరిని వేటాడారు. దానికి ప్రతీకారంగా ఇప్పుడు 'మోడీ,షా'లు 'పటేల్‌'ను గుజరాత్‌ అవతలికి పారద్రోలతామని ప్రతినపూనారు. దీనిలో భాగంగా ఒక వ్యూహ ప్రకారం ముందునుంచి కాంగ్రెస్‌ను ఖతం చేసే పనిని మొదలు పెట్టారు. దీనిలో భాగంగా తమ పార్టీ మాజీనేత, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడు అయిన 'వాఘేలా'ను దువ్వడం మొదలు పెట్టారు. వ్యూహాత్మకంగా ఆయనతో కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేయించడంతో ఈ కథ మొదలైంది. 'వాఘేలా' తమ వైపుకు వస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధిస్తుందని, దీంతో 'వాఘేలా'ను సిఎం సీటులో కూర్చోబెడతామని హామీ ఇచ్చారు. మొత్తం 182 అసెంబ్లీ సీట్లున్న గుజరాత్‌లో 150సీట్లు సాధించాలన్న 'మోడీ' కలను ఆ విధంగా నెరవేర్చాలని 'షా' భావించారు. దీనిలో భాగంగా 'వాఘేలా' కోరిన కోర్కెలు తీర్చడానికి సిద్ధమయ్యారు. దీనిలో తన కుమారుని భవిష్యత్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని బిజెపికి సహకరించడానికి ఆయన ఒప్పుకున్నారు.

  ప్రతిపక్షనాయకుని పదవికి గుడ్‌బై చెప్పిన 'వాఘేలా' 15మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని కాంగ్రెస్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు.  మొత్తం 57 మందిలో 15మంది 'వాఘేలా' వైపు వెళ్లిపోతే మిగిలిన 42మంది కాంగ్రెస్‌లో ఉన్నారు. అయితే వీరిలో మరో 30మంది కాంగ్రెస్‌ నుంచి బయటకు వస్తారని 'వాఘేలా' చెప్పుకొచ్చారు. మునిగిపోయే పడవలో ఎవరూ ఉండరని ఆయన పదే పదే వ్యాఖ్యానించి కాంగ్రెస్‌లో గుబులు పుట్టించారు. దీంతో కాంగ్రెస్‌ తనవైపు మిగిలిన ఎమ్మెల్యేలతో బెంగుళూరులో క్యాంప్‌ నిర్వహించింది. 'పటేల్‌' విజయం సాధించలేరని కాంగ్రెస్‌ అంచనా వేసింది. అయితే ఇక్కడే 'బిజెపి' వ్యూహాలు దెబ్బతిన్నాయి.  తనతో ఉన్న ఎమ్మెల్యేల్లో ఆరుగురి చేత రాజీనామా చేయించి 'వాఘేలా' కాంగ్రెస్‌కు అనుకోని అవకాశం కల్పించారు. దీంతో 'పటేల్‌'కు విజయానికి కావాల్సిన ఎమ్మెల్యే సంఖ్య తగ్గిపోయింది. అంతే కాకుండా ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటింగ్‌ సమయంలో తాను బిజెపికి ఓటువేశామని బహిరంగంగా ప్రకటించడం, ఆ ఓట్లు చెల్లుబాటు కావని ఎన్నికల సంఘం తేల్చి చెప్పడంతో 'బిజెపి' తలలు పట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం మీద 'వాఘేలా' చేయించిన రాజీనామాలు, ఇద్దరు ఎమ్మెల్యేల బహిరంగ ఓటు బిజెపి కొంప ముంచి 'పటేల్‌' విజయానికి కారణమైంది. దీంతో ఇప్పుడు ఓటమికి 'వాఘేలా'నే కారణమని 'షా' ఆరోపిస్తున్నారట. అయితే స్వంత పార్టీ ఎమ్మెల్యే ఒకరు 'పటేల్‌'కు ఓటు వేయడాన్ని 'షా' ఉద్దేశ్యపూర్వకంగా మరిచిపోతున్నారు. 'పటేల్‌' ఉద్యమానికి మద్దతు ఇవ్వకుండా, తమ సామాజికవర్గాన్ని ఇబ్బందులు పెడుతున్నారన్న కారణంతో బిజెపికి చెందిన ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు ఓటు వేశారు. ఈ విషయాన్ని బిజెపి పెద్దలు పెద్దగా పట్టించుకోకుండా నెపం మొత్తాన్ని 'వాఘేలా' పై నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు.


(299)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ