లేటెస్ట్

బిజెపి ఆట మొదలైంది...!

నిన్నటి దాకా...టిడిపినే టార్గెట్‌ చేసిన బిజెపి అధినాయకత్వం...ఇప్పుడు అధికార వైకాపా కూడా గురిపెట్టిందని ఆ పార్టీ నాయకుల వ్యాఖ్యల ద్వారా స్పష్టం అవుతోంది. టిడిపి నుంచి వలసలను ప్రోత్సహిస్తూ ఆ పార్టీ నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులను పార్టీలో చేర్చుకుని తమ మొదటి టార్గెట్‌ టిడిపినే అని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు మనస్సు మార్చుకుని...టిడిపితో సమానంగా, వైకాపాను కూడా టార్గెట్‌ చేయాలని నిర్ణయించుకుందని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. టిడిపికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరతారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నా... ఇప్పటికిప్పుడు టిడిపి నుంచి ఎవరూ బయటకు రాలేదు. చోటా మోటా నాయకులు తప్ప...బిజెపి ఆశించిన స్థాయిలో టిడిపి నాయకులు బయటకు రావడం లేదు. దీంతో..ప్లాన్‌ 'బి'ని బయటకు తీసిన బిజెపి వైకాపా నాయకులకు వలవేస్తోంది. వైకాపా అధికారంలోకి వచ్చి ఇంకా రెండు నెలలు కూడా కాక ముందే ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్నవారెవరో అన్నదానిపై ఆరా తీస్తోంది. అలా అసంతృప్తితో ఉన్న నాయకులకు ఇప్పటికే పాచికలు విసిరినట్లు తెలుస్తోంది. 

కాగా..ఇటీవల 'తోట వాణి' వైకాపాకు గుడ్‌బై చెప్పి బిజెపిలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ..ఏమైందో..ఏమో కానీ..ఆమె చేరిక గురించి వార్తలు బయటకు రావడం లేదు. 'వాణి' పార్టీ మారతారని, ఆమె బిజెపి రాజ్యసభ సభ్యుడు 'సుజనాచౌదరి'ని కలిశారని, ఆమె పార్టీ మారడం నామ మాత్రమేనని చెప్పినా..ఇంకా కొలిక్కిరాలేదు. తాజాగా 'జగన్‌' క్యాబినెట్‌లోని సీనియర్‌ మంత్రి 'బత్స సత్యనారాయణ' తమ పార్టీలోకి వస్తామన్నారని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బత్స' తమ పార్టీలోకి వస్తానని, ఎన్నికలకు ముందు చెప్పారని, కానీ...తరువాత ఆయన పార్టీలోకి రాలేదని'మాధవ్‌' చెప్పారు. అయితే ఇప్పటికీ 'బత్స' తమతో టచ్‌లో ఉన్నట్లు ఆయన చెప్పుకున్నారు. కాగా...'మాధవ్‌' చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీతో పాటు, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు కూడా తమతో ఎన్నికలకు ముందు టచ్‌లో ఉన్నారని, వీరిద్దరూ అప్పుడు వైకాపాను వీడి బిజెపిలో చేరాలని ప్రయత్నించారని, కానీ కుదరకపోవడంతో ఊరుకున్నారని 'మాధవ్‌' చెబుతున్నారు. తాజాగా తమతో రావడానికి టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నిస్తున్నారని, కానీ...పార్టీ ఫిరాయిస్తే...పదవి పోతుందనే భయంతో...వారు ఆగిపోయా రని, త్వరలో భారీ స్థాయిలో బిజెపిలోకి వైకాపా,టిడిపిల నుంచి నాయకులు చేరతారని 'మాధవ్‌' గట్టి నమ్మకంతో చెబుతు న్నారు. కాగా...మాధవ్‌ చేసిన వ్యాఖ్యలు 'వైకాపా'లోనూ చర్చనీయాంశం అవుతున్నాయి. సీనియర్‌ మంత్రి బత్స గురించి 'మాధవ్‌' చేసిన వ్యాఖ్యలను ఎవరూ ఖండించడం లేదు. మరో వైపు ఎన్నికలకు ముందు అంశం కనుక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైకాపా వ్యూహకర్తలు అభిప్రాయపడుతున్నారట. మొత్తం మీద రాష్ట్రంలో 'బిజెపి' తన ఆటను మొదలు పెట్టిందని, అది ఎటునుంచి ఎటువస్తుందో తెలియక వైకాపా, టిడిపి వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. 

(511)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ