WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పసిమొగ్గలను తుంచిన పాపాత్ములెవరు...!?

విశాల భారతదేశాన్ని తమ ఏలికలోకి తేవాలనే లక్ష్యంతో బరితెగించి రాజకీయాలు చేస్తున్న బిజెపి పెద్దలు...తమ ఏలుబడి ఏవిధంగా ఉంటుందో ఘోరఖ్‌పూర్‌ సంఘటనతో రుజవు చేశారు. తమది అవినీతి రహిత ప్రభుత్వమని, జవాబుదారీ ప్రభుత్వమని బాకాలు ఊదుకునే ప్రధాని 'మోడీ' ఘోర్‌పూర్‌ పసిమొగ్గల ప్రాణాలు హరించిన సంఘటనపై ఏ సమాధానం చెబుతారు. దాదాపు 65 మంది పసిమొగ్గల ప్రాణాలును తుంచిన పాపాత్ములపై ఆయన ఏ చర్యలు తీసుకోబోతున్నారు. తమ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలన్నీ సంపూర్ణవికాసంతో వర్థిల్లుతున్నాయని, అక్కడ సమస్యలే లేవని, అందుకే అన్ని రాష్ట్రాల్లో బిజెపి జెండాలు ఎగురవేయాలనే బిజెపి పెద్దలు, ఇంత మంది పసివారిని పొట్టనపెట్టుకున్న తమ పాలకులపై ఏ విధమైన చర్య తీసుకుంటారు. ఇదే సంఘటన బిజెపియేతర రాష్ట్రాలలో జరిగితే బిజెపి పెద్దలు, సంఘ్‌ పెద్దలు ఎంత యాగీ చేశావారో...! ఇప్పుడు తమ పాలనలోని రాష్ట్రంలో జరగడంతో ఏమి చేయాలో పాలుపోక క్రిందా మీదా పడుతున్నారు. జరిగింది ఒకటైతే...దాన్ని మసిపూసి మారేడుకాయ చేద్దామని చూస్తున్నారు. 

  ఉత్తరప్రదేశ్‌లోని ఘోరఖ్‌పూర్‌ ప్రభుత్వ హాస్పటల్‌లో ఆక్సిజన్‌ అందక దాదాపు 65మంది చిన్నారులు చనిపోయిన సంఘటన యావత్‌భారతాన్ని నిశ్చేష్టులను చేసింది. హాస్పటల్‌కు ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఆ సంస్థ ప్రతినిధులు పలుసార్లు హాస్పటల్‌ పాలకులపై ఒత్తిడి తెచ్చినా వారు చలించలేదు. దీంతో ఆక్సిజన్‌ సరఫరాదారు సిలిండర్స్‌ను సరఫరా చేయకుండా నిలిపివేశారు. దీంతో ఒక్క రోజులోనే దాదాపు 65 మంది చిన్నారుల ప్రాణాలు  కొడిగట్టాయి. ఈ సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి 'యోగి ఆధిత్యనాథ్‌' ఈ హాస్పటల్‌ను ఆకస్మిక తనిఖీలు చేసిన మరసటి రోజే ఈ విధమైన సంఘటన జరగడం విశేషం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలప్పుడు అయినా అధికారులు ఆక్సిజన్‌ సరఫరాదారులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను ఆయనకు చెప్పలేదా...? లేక ఆయనను మభ్యపెట్టారా...? ఒక వేళ వారు చెప్పినా 'యోగి' పట్టించుకోలేదా...? అన్నదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఒక వేళ హాస్పటల్‌ వర్గాలు ఈ బకాయిల విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తే తప్పదంతా ముఖ్యమంత్రి 'యోగి'దే....చిన్నారుల ప్రాణాలు తుంచిన వారిలో ఆయనదే అగ్రపీఠం. ఒక వేళ ఈ విషయాన్ని 'యోగి' దృష్టికి తీసుకురాకపోతే... ప్రభుత్వాధికారులదే తప్పంతా...! అయితే ఇది కేవలం ఒకరిద్దరు చేసిన తప్పు కాదు...ఇది వ్యవస్థ చేసిన తప్పుగానే భావించాల్సి ఉంటుంది. స్థానిక మీడియా ఆక్సిజన్‌ అయిపోతుందని, దీనిపై హాస్పటల్‌ వర్గాలను అప్రమత్తం చేసినా వారు స్పందించలేదంటే...ఎంత దుర్మార్గమో...అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 

  బకాయిలు చెల్లించకుండా సరఫరా దారు ఎన్నిరోజులు మాత్రం సరఫరా చేస్తారు...వారికి కూడా ఊరికే రావు కదా...! అయినా వారు కూడా దాదాపు ఆరు మాసాల పాటు తమకు రావాల్సిన బకాయిలు రాకపోయినా...చిన్నారుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఆఖరి నిమిషం వరకు అపోసోపాలు పడ్డారని వస్తోన్న వార్తలను బట్టి తెలుస్తోంది. చివరకు తమకు సిలిండర్‌లు సరఫరా చేసే సంస్థకు వారే స్వయంగా డబ్బులు చెల్లించి కొన్నాళ్లు నెట్టుకొచ్చారని చివరకు వారి వల్ల కాక చేతులు ఎత్తేశారని తెలుస్తోంది. దీనికంతటికి కారణం...పాలనా లోపాలే...ఇటీవలే అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం దీనిలో స్పష్టంగా కనబడుతోంది. ఆకస్మిక తనిఖీల పేరిట ముఖ్యమంత్రి 'యోగి' షో చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఆయన చర్యలన్నీ డ్రామాటిక్‌ ఉంటున్నాయని, సమస్యలపై ఉదాశీనంగా వ్యవహరిస్తూ మీడియాలో మాత్రం పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడానికి నాటకాలు ఆడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎన్ని అనుకున్నా పోయిన ప్రాణాలు తిరిగి రావు...కానీ...ఈ ప్రాణాలు తీసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారా...? లేక మనవాడే కదా...అని మసిపూసి మారేడు కాయ చేస్తారా...? అని యావత్‌భారత ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

(241)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ