WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మోడి ముందు చూపు...

మరో ఏడాదిన్నర వ్యవధిలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రానున్న నేపథ్యంలో ముందు నుంచే సంస్కరణ రథాన్ని మహా ఊపుగా తిప్పాలన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే.. సాహసోపేతమైన చర్యలకు పుల్ స్టాప్ పెట్టేసి.. మోడీలోని అసలుసిసలు రాజకీయ నాయకుడు బయటకు రానున్నట్లు తెలుస్తోంది. సంస్కరణ పథాన్ని వదిలేసి.. ప్రజాకర్షక విధానాలతో ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసి.. ఇలాంటి సర్కారు సుదీర్ఘకాలంగా ఉండాలన్న భావన కలుగజేయాలన్నదే మోడీ ప్లాన్ గా తెలుస్తోంది. రాజకీయాల రంగు.. రుచుల్లో మార్పు వచ్చేసింది. గతానికి భిన్నమైన రాజకీయాలు ఇప్పుడు ఆవిష్కృతమవుతున్నాయి. కొత్త తరహా ఎత్తుగడలు తెర మీదకు వస్తున్నాయి. చెప్పే మాటలకు.. చేసే పనులకు సంబంధం లేకుండా వ్యవహరించటం రాజకీయ అధినేతలకు అలవాటైనదే అయినప్పటికీ.. అదేమీ ప్రజలకు అర్థం కాకుండా చేయటం.. ఒకవేళ అర్థం అవుతున్నా.. అదంతా తప్పుడు భావన అన్నట్లుగా చేయటం ఇప్పటి శైలిగా చెప్పాలి. నిద్ర లేచింది మొదలు ఆదర్శాలు వల్లిస్తూనే.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారే తత్త్వం కనిపిస్తోంది. అది వాళ్లలోనూ.. వీళ్లలోనూ అన్నట్లు కాకుండా అన్నిచోట్ల ఇలాంటి తీరు కనిపిస్తుంది. నిత్యం సూక్తిముక్తావళి వినిపించే ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సైతం తమ ప్రత్యర్థి పార్టీల్లో వలసల్ని ప్రోత్సహించటం.. అది కూడా ఒక్క రాజ్యసభ సభ్యుడి ఎన్నిక కోసం ఎంతటి నైతిక పతనానికి అయినా వెనక్కి తగ్గని తీరు కనిపిస్తుంది. రాజకీయాలు హుందాతనంగా ఉండాలని కోరుకునే కన్నా.. అధిపత్యాన్ని మరింత పెంచేలా.. బలాన్ని మరింత విస్తృతం చేసే దానిపైనే దృష్టి పెట్టటం మోడీ పరివారానికి ఈ మధ్యన ఎక్కువైంది. ఇదిలా ఉంటే.. మరో ఒకటిన్నర సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మోడీ తన తీరును పూర్తిగా మార్చేయనున్నట్లుగా చెబుతున్నారు.కలలో కూడా ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకొని జాతి జనులకు నిత్యం షాకుల మీద షాకులు ఇచ్చేందుకు ఎంత మాత్రం వెనుకాడని మోడీ సర్కారు తన తీరును పూర్తిగా మార్చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కాలం చెల్లిన చట్టాలకు పాతర వేసి.. అవినీతి వేర్ల నుంచి పెకిలించి వేసేలా నిర్ణయాలు తీసుకునే మోడీ తన తీరును ఊహించని రీతిలో మార్చేస్తారని చెబుతున్నారు.

 ఇకపై భారీ సంస్కరణల జోలికి మోడీ వెళ్లే అవకాశం లేనట్లుగా బార్ క్లేస్ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త సిద్ధార్త సన్యాల్ చెప్పటాన్ని ఇక్కడ ప్రస్తావించొచ్చు. ఇప్పటి వరకూ తాను స్టార్ట్ చేసిన ప్రాజెక్టులను పూర్తి చేయటం మీదా.. తాము సాధించిన విజయాల్ని మరింత ఎక్కువ ప్రచారాన్ని కల్పించేలా నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. ఇక తన అమ్ములపొదిలో బలమైన జాతీయవాద అస్త్రాన్ని కూడా ఉపయోగించనున్నారు. రానున్న ఏడాదిన్నర కాలంలో మొత్తంగా మూడు సీల మీదనే మోడీ అండ్ కో దృష్టి పెట్టనున్నట్లుగా చెబుతున్నారు సిద్దార్థ్ సన్యాల్.అవినీతి మీద పోరాటం చేయటం.. ఇప్పటికే మొదలెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయటం.. చేసిన పనులను గొప్పగా ప్రచారం చేసుకోవటం లాంటి అంశాలపై మోడీ ఇక దృష్టి పెడతారని చెబుతున్నారు. ఇక.. అవినీతిపై మరింతగా విరుచుకుపడటం ద్వారా దేశ ప్రజలకు తనలోని పోరాటయోథుడ్ని చూపించనున్నారు. అదే సమయంలో సామాన్యులు.. మధ్యతరగతి జీవుల మనసుల్ని దోచుకునేందుకు వీలుగా ప్రజాకర్షక పథకాలను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు వర్గాల అండ ఉన్నంత కాలం దేశంలో ఆయన కుర్చీని కదిపే మగాడే ఉండరని చెప్పక తప్పదు.

(215)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ