లేటెస్ట్

ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదుః బాల‌కృష్ణ‌

ప్ర‌జ‌లు, పార్టీ కార్య‌క‌ర్త‌లు ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ అన్నారు. చంద్ర‌బాబును అక్ర‌మంగా అరెస్టు చేశార‌ని, ఇంకా ఇత‌ర నాయ‌కుల‌ను అరెస్టు చేస్తున్నార‌ని, అరెస్టుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని, ఈ అరెస్టుల‌ను, అక్ర‌మాల‌ను అడ్డుకోవ‌డానికి తాను ముందుంటాన‌ని, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వంచ‌న‌తో పాలిస్తున్నార‌ని, పేద‌ల‌కు ఎంగిలిమెతుకులు వేసి, తాను దోచుకుంటున్నాడ‌ని, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ లో ఎటువంటి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని, చంద్ర‌బాబు చేశాడంటున్న అవినీతికి ఆధారాలు ఏవ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్ మూర్ఖంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఓట‌మి భ‌యంతోనే ఆయ‌న ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. ల‌క్ష కోట్ల భ‌క్ష‌క‌..అవినీతి ప‌క్ష‌పాత‌క రూప‌క‌, ముఖ్య‌మంత్రి మ‌హా మూర్ఖ‌క‌, జ‌గ‌మెరిగిన జ‌గ‌న్నాట‌క‌,ఈ దేశానికి ప‌ట్టిన ద‌రిద్ర‌జాత‌క‌, రాష్ర్టానికి ప‌ట్టిన రావ‌ణ‌పాల‌క‌,జ‌న‌,మాన‌,చోర‌క మ‌న ముఖ్య‌మంత్రి అంటూ బాల‌కృష్ణ విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఇప్పుడు అక్ర‌మంగా వ్య‌వ‌హ‌రించిన వారు అంత‌రిక్షింలో దాగినా ప‌ట్టుకొస్తామ‌ని, వారిని వ‌దిలి పెట్టే ప్ర‌శ్నే లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. గ‌త ప్ర‌భుత్వంలో పేద ప్ర‌జ‌ల‌కు మేలు చేసేందుకు స్కిల్‌డెవ‌ల‌ప్‌మెంట్ ఏర్పాటు చేశామ‌ని, దీనితో పేద విద్యార్థుల‌కు ఎంతో మేలు జ‌రిగింద‌న్నారు.


 పేద‌ల కోసం తెచ్చిన దీనిలో అవినీతి జ‌రిగింద‌ని చెబుతున్నార‌ని, స్కీమ్‌ను అమ‌లు చేసిన అధికారుల‌ను వ‌దిలి, ముఖ్య‌మంత్రిపై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, ముఖ్య‌మంత్రి విధాన నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని, అమ‌లు చేసేది అధికారుల‌ని, మ‌రి అధికారులైన అజ‌య్‌క‌ల్లంరెడ్డి, ప్రేమ‌చంద్రారెడ్డిల‌ను వ‌దిలేసి చంద్ర‌బాబుపై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, ఇది క‌క్ష‌సాధింపేన‌ని ఆయ‌న ఆరోపించారు. తాను క్షేత్ర‌స్థాయిలో ముందు ఉంటాన‌ని, కార్య‌క‌ర్త‌ల‌కు ఎటువంటి భ‌యం లేద‌ని, ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇచ్చారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ