లేటెస్ట్

జర్నలిస్టులకు ‘సెంట్‌’ దెబ్బ...!

రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలాన్ని కేటాయిస్తూ జీవోను విడుదల చేసింది. ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై కొన్ని సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నాళ్ల నుంచో పెండిరగ్‌లో ఉన్న తమ సమస్యను ముఖ్యమంత్రి జగన్‌ పరిష్కరించారని, గత ముఖ్యమంత్రి తమను పట్టించుకోలదని, జగన్‌ పెద్ద మనస్సుతో తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని వారు పొంగిపోతున్నారు. మూడు సెంట్ల స్థలం ఇవ్వడం మామూలు విషయం కాదని, ఇదెంతో పెద్ద మనస్సు ఉంటేనే సాథ్యం అవుతుందని కూడా వారు ముఖ్యమంత్రిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే.. ఈ స్థలాల జీవో విషయంలో మరి కొందరు జర్నలిస్టులు పెదవి విరుస్తున్నారు. జర్నలిస్టు లందరికి స్థలం ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, ఇప్పుడు లేనిపోని షరతులు విధించారని ఆరోపిస్తున్నారు. ముందు అందరికీ ఇస్తామని, ఇప్పుడు కేవలం అక్రిడిటెడ్‌ జర్నలిస్టులకనే నిబంధన తెచ్చారని, ఈ నిబంధన వల్ల చాలా మంది నష్టపోతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ప్రభుత్వం గతంలో ఉన్న అక్రిడిటేషన్లు తగ్గించిందని, నిజంగా పనిచేస్తోన్న జర్నలిస్టులకు కూడా నూతన నిబంధనలను తెచ్చి అక్రిటేషన్లు ఇవ్వలేదని, అక్రిడిటేషన్లు లేని వారు ఆక్రోశిస్తున్నారు. పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేస్తోన్న చాలా మంది సీనియర్‌ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు లేవని, అక్రిడిటేషన్‌ లేనంత మాత్రాన వారు జర్నలిస్టులు కాకుండా పోతారా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా జర్నలిస్టు దంపతుల్లో ఎవరి పేరు మీదా ఇంటి స్థలం, ఇల్లు, ప్లాట్‌ ఉండకూడదనే నిబంధన విధంచారని, దీని వల్ల వేలాది మంది అనర్హులౌతారని వారు చెబుతున్నారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత నిరుపేదలైన పేదలకు ‘సెంటు’ స్థలం కేటాయించింది. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు ఇళ్లు ఇళ్లు తిరిగి అందరి పేర్లు దానిలో నమోదు చేయించారని, దీనిలో జర్నలిస్లు కుటుంబాలు కూడా ఉన్నాయని, వారు కూడా నిరుపేదలకు కేటాయించిన ‘సెంటు’ స్థలాన్ని పొందారని, ఆ విధంగా చూసుకుంటే వారు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందినట్లే కనుకు వారు ఇప్పుడు ఇచ్చే మూడు సెంట్ల స్థలానికి అర్హులు కారు. ఈ నిబంధనతో దాదాపు 90శాతం మంది అనర్హులౌతారని వారు చెబుతున్నారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు నిబంధనల పేరుతో అడ్డంగా కోసేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఎటువంటి స్వంత ఇళ్లు, స్థలం, ప్లాటు లేని వారు..గతంలో ‘సెంటు’ స్థలానికి ఆశపడిన వారు..ఇప్పుడు మూడు సెంట్లను కోల్పోవాల్సి వస్తుంది. అదే విధంగా 60శాతం ప్రభుత్వం, 40శాతం జర్నలిస్టులు భరించాలని చెప్పడం కూడా జర్నలిస్టులకు మింగుడు పడడం లేదు. ఉదాహరణకు విజయవాడ చుట్టుపక్కల సెంటు కనీసం రూ.10లక్షల వరకు ఉంటుందని, మూడు సెంట్లు అంటే..దాదాపు రూ.30లక్షలు అవుతుందని, దీనిలో 40శాతం అంటే రూ.12లక్షలు జర్నలిస్టులు కట్టాలని, ఇంత పెద్ద మొత్తం ఎంత మందికి సాథ్యం అవుతుందనే ప్రశ్న కూడా పలువురి నుంచి వస్తోంది. మొత్తం మీద  ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉన్న పరిస్థితుల్లో తెచ్చిన ఈ జీవో ఎలా అమలు సాధ్యం అన్న ప్రశ్నలు పలువురి నుంచి వస్తున్నాయి. గతంలో కూడా ఇదే విధంగా కోవిద్‌తో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5లక్షలు చెల్లిస్తామని జీవో తెచ్చారని, కానీ ఇప్పటి వరకూ ఒక్కరికి కూడా ఒక్కరికి కూడా ఒక్క రూపాయి సహాయం చేయలేదని, ఇప్పుడు దీని పరిస్థితి కూడా ఇంతేనని కొందరు జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ