WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బాహు బలి వస్తున్నాడు...

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలుగు రాష్ర్టాల పర్యటన కమళనాథులను కలవరపాటుకు గురిచేస్తోందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇది తెలంగాణ నేతల్లో కనిపిస్తోందని అంటున్నారు. వచ్చే నెలలో అమిత్ షా పర్యటన ఉన్న నేపథ్యంలో తమ నాయకుడు రావడంతో పార్టీకి ఊపు వస్తుందని భావిస్తూనే...తమపై ఆయన ఊగిపోకుండా ఆగ్రహం వ్యక్తం చేసుకోకుండా చూడాలని తెలంగాణ బీజేపీ నేతల్లో చర్చ జరుగుతున్నట్లుచెప్తున్నారు.సార్వత్రిక ఎన్నికలకు ఇక 21 నెలలే ఉన్నందున ఇప్పటి నుంచే దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణపై దృష్టి పెట్టాలని అమిత్ షా భావిస్తున్నారు. రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాదిలోనే కాకుండా దక్షిణాది నుంచి కూడా ఎక్కువ సీట్లు సాధించి తిరిగి పార్టీ ఒంటరిగా అధికారంలోకి వచ్చేంత సీట్లు సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. 

  ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలతో అధికారాన్ని చేపట్టినా ఒంటరిగానే అధికారంలోకి వచ్చే విధంగా సీట్లు సాధించాలన్నది ఆ పార్టీ జాతీయ నాయకుల ప్రయత్నం. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసి ఎక్కువ సీట్లు సాధించుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయన్నది ఆ పార్టీ జాతీయ నేతల మనోగతం. 2019 ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని పార్టీని మరింత ఉత్సాహంగా ముందుకు నడిపించేందుకు ఎక్కువగా తెలంగాణలో పర్యటించాలని అమిత్ షా భావిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెలలో మూడు రోజుల పాటు షా సుడిగాలిపర్యటనచేయనున్నారు.అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీ నేతలతో కూడా ముచ్చటించనున్నారు. పార్టీ బలాబలాలను చర్చించనున్నారు. బీజేపీ బలోపేతానికి ఇటీవలి కాలంలో చేపట్టిన చర్యలను కనుక్కోనున్నారు. గతంలో షా పర్యటించినప్పుడే ఈ తరహా ఆరా తీసినపుడు బీజేపీ నేతల పనితీరు బాగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకరిద్దరు ముఖ్యనేతలకు అయితే తల అంటినట్లు సమాచారం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ తమకు అక్షింతలు పడకుండా చూసేందుకు తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా అమిత్ షా రాక సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు ఏర్పాట్లలో బిజి-బిజీగా ఉన్నారు. మండల-జిల్లా- రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ అమిత్ షా పాల్గొనే కార్యక్రమాలను బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అమిత్ షా వచ్చి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకే పక్షం రోజులకో నెల రోజులకో ఒక జాతీయ ముఖ్య నాయకుడు సందర్శించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల వరకు తరచూ సందర్శిస్తూ పార్టీ నేతలకు కార్యకర్తలకు నమ్మకాన్ని కలిగించాలన్న ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.

 

(278)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ