WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బిజెపికి షాక్‌...!

కర్ణాటకలో మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం...!

'మోడీ',అమిత్‌షా ఆశలపై నీళ్లు జల్లిన కన్నడీలు..!

ఇండియాటుడే,సిఫర్‌ సర్వేలో వెల్లడైన నిజం...!

కాంగ్రెస్‌కు 132 సీట్లు, బిజెపికి 60సీట్లు...!

దేశమొత్తాన్ని బిజెపి పాలిత రాష్ట్రాలుగా మార్చాలన్న ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని మోడీ కలలు కల్లలు కాబోతున్నాయి. నిన్నటి దాకా ఎదురులేకుండా సాగిపోయిన ఈ జంటకు దక్షిణాదిన తొలిసారి బ్రేక్‌ పడబోతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో విజయం సాధించి దక్షిణాదిన పట్టుసాధించాలన్న వారి కోరికలు నెరవేరవని ఇండియాటుడే నిర్వహించిన ఓ సర్వేలో తేలిపోయింది. 2018లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీయే గెలుస్తుందని ఇండియాటుడే సి ఫర్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సంస్థ సర్వే ప్రకారం మొత్తం 225 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిలో అధికార కాంగ్రెస్‌ పార్టీ 120-132 సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదే అని మురిసిపోతున్న బిజెపి రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సిందేనట. బిజెపికి గతంలో ఉన్న సీట్లకంటే పెరుగుతాయని అయితే అధికారంలోకి రావడానికి అవి సరిపోవని సర్వే చెప్పింది. బిజెపికి 60-72సీట్లు, జెడి(ఎస్‌)కు 24-30సీట్లు వస్తాయని తేల్చింది. మొత్తం ఓట్లలో అధికార కాంగ్రెస్‌ 43శాతం ఓట్లు సాధిస్తుందని, ప్రతిపక్ష బిజెపి 32శాతం ఓట్లు, జెడి(ఎస్‌)17శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే పేర్కొంది.

   ఇండియాటుడే, సి ఫర్‌ సర్వే మొత్తం 165 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24,676మందిని ఆధునిక రాండమ్‌ పద్దతిలో ప్రశ్నించి సమాధానాలు రాబట్టింది. ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'అన్నభాగ్య' పథకంపై ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం అవుతోంది. దానితో పాటు మధ్యాహ్నభోజనపథకంపై ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేశారట. కాగా తాగునీరు, అధ్వాన్నమైనరోడ్లు, నిరుద్యోగత, పారిశుధ్యంపై ఓటర్లు తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు.కాగా ఇటీవల కర్ణాటకలో పర్యటించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో బిజెపి 150సీట్లు సాధించి అధికారంలోకి రావాలని, తద్వారా అవినీతి, అసమర్థ ప్రభుత్వమైన కాంగ్రెస్‌ను తుడిచి పెట్టాలని ఆయన కార్యకర్తలకు ఉద్భోదించారు. ప్రజలు మనకు అధికారం ఇవ్వడానికి మరోసారి సిద్ధంగా ఉన్నారని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన నాయకులను, కార్యకర్తలను కోరారు. అయితే ఇప్పుడు పరిస్థితి 'అమిత్‌షా' ఊహించినంత అనుకూలంగా లేదు. కర్ణాటక ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌నే గెలిపించాలనే నిర్ణయం తీసుకున్నారని సర్వే ఫలితాలను బట్టి తేటతెల్లం అవుతుంది. దక్షిణాదిన మళ్లీ కర్ణాటకతో బోణీ కొట్టాలనుకున్న 'కమలనాథుల'ల కలలు కల్లలు అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.


(487)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ