'ఇంటర్‌కోర్స్‌' వాడకూడని పదమా...!? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఇంటర్‌కోర్స్‌' వాడకూడని పదమా...!?

అధికారం చేతిలో ఉంది కదా...అని కొంత మంది అధికారులు తల తిక్క చేష్టలు చేస్తుంటారు. తాము చేసిందే సబబు అని వాదించి ఎదుటి వారి నోరు మూయించాలని ప్రయత్నిస్తారు...! అటువంటి ప్రయత్నాల్లో తామెంత మూర్ఖంగా వ్యవహరిస్తారో, ఎంత అనాగరికంగా ప్రవర్తిస్తారో కూడా వారికి అర్థం కాదు..! ఒక వేళ అర్థం అయినా...అర్థం కానట్లు నటించి తమ పంతమే నెగ్గాలనుకునే రకాలు వీరు...! ఇటువంటి పందెగాళ్లు ఈ పంతం నెగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో చివరకు తమ ఉద్యోగాలను కూడా పోగొట్టుకుంటారు. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే...ఒక సినిమాలో 'ఇంటర్‌కోర్స్‌' అనే పదం ఉందని...ఇది అభ్యంతరకరమని దాన్ని తీసేయాలని ఆ పెద్ద ఆఫీసర్‌ పట్టుపట్టారు. కానీ అది పెద్ద అభ్యంతరకర పదం కాదని సదరు నిర్మాతలు వాదించారు. ఇద్దరూ ఎవరికి వారు మంకుపట్టుపట్టారు...చివరకు నిర్మాతలదే పైచేయి అయింది.  సదరు నిర్మాతల దెబ్బకు మనోడి ఉద్యోగం కాస్తా ఊడిపోయి...చివరకు స్టూడియోల చుట్టూ తిరుగుతున్నారు. అసలు విషయం ఏమిటంటే...

   'పహలాజ్‌ నిహలానీ' ఈయన సెంట్రల్‌ బోర్డ్‌ ఫర్‌ ఫిలిమ్‌ సెన్సార్‌ బోర్డుకు చీఫ్‌. అంటే దేశంలోని సెన్సారింగ్‌ ఆఫీసులన్నింటికీ బాస్‌ వంటి పోస్టు అన్నమాట. ఈయన ముందుకు వచ్చిన సినిమాల్లో అభ్యంతరకరమైన సన్నివేశాలు,మాటలు తొలగించి సెన్సార్‌ చేస్తారన్న మాట. ఇటీవల కాలంలో 'ఉడ్తా పంజాబ్‌' అనే సినిమా ఈయన ముందుకువచ్చింది. మనోడు కత్తెరకు ఎడాపెడా పని చెప్పాడు. దాంతో సినిమా షార్ట్‌ ఫిలిమ్‌ స్థాయికి వెళ్లిపోయింది. దాంతో నిర్మాతలు లబోదిబో మన్నారు. అదలా ఉంటే ఇటీవల కాలంలో మరో సినిమా సదరు ఆఫీసర్‌ ముందుకు వచ్చింది. ఆ సినిమా పేరు 'వెన్‌ హేరీ మేట్‌ సేజల్‌'. దీనిలో ఓచోట 'ఇంటర్‌కోర్స్‌' (సంభోగం) అనే పదం ఉందట. ఈ పదం తీసేయాలని ఆయన సదరు నిర్మాతలకు సూచించారు. అదేమిటి 'ఇంటర్‌కోర్స్‌' అనే పదం పెద్ద వివాదాస్పదం కాదు కదా..అదెందుకు తీసేయాలని నిర్మాతలు ఆయనను అడిగారట. దానికి మనోడు తాను చెప్పిందే వేదం అన్నట్లు ఆ పదాన్ని తీసేస్తేనే సినిమా రిలీజ్‌ అవుతుందని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నిర్మాతలు మీడియాను ఆశ్రయించారు. మీడియా కూడా ఈ పదం అభ్యంతరకరం కాదని, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తే మనోడు సరైన జవాబు ఇవ్వకుండా...ఓ లేడీ రిపోర్టర్‌తో వాగ్వివాదానికి దిగాడు. 'మీ ఛానెల్‌..ఈ పదం ఉంచాలని ఓ లక్షమంది మద్దతు సంపాదిస్తుందా...? అని ప్రశ్నించారు...? దాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న ఆ రిపోర్టర్‌ తమ ఛానెల్‌ ద్వారా లక్ష మందికి పైగా మద్దతు సంపాదించి తరువాత ఇప్పుడేమంటారూ..? అని ఆయనను ప్రశ్నించిందట. దీంతో ఆయన ఎటూ చెప్పలేక ఆ రిపోర్టర్‌ ఎక్కడ కనిపిస్తే అక్కడ నుంచి జారుకోవడం మొదలుపెట్టాడు.

   అయితే ఇక్కడితోనే కథ అయిపోలేదు. మనోడి తిక్క చేష్టలపై జాతీయ మీడియా ఒక్కసారిగా తీవ్రస్థాయిలో కథనాలను ప్రచురించింది. దీంతో ప్రభుత్వం స్పందించక తప్పలేదు...! కేంద్ర సమాచారశాఖకు ఈ వ్యవహారమంతా తీవ్రమైన చికాకును కలిగించింది. దీంతో ఈ విధంగా వ్యవహరిస్తున్న  'పహలాజ్‌ నిహలానీ'ని పదవి నుంచి తప్పించింది. అయితే తనను పదవి నుంచి తొలగించడంపై 'పహలాజ్‌' స్పందించారు. 'వెన్‌హేరీ మేట్‌ సేజల్‌' అనే సినిమాలో సూపర్‌స్టార్‌ 'షారూక్‌ఖాన్‌' నటించారని, ఇటువంటి సినిమాల్లో 'ఇంటర్‌కోర్స్‌' అనే పదం వాడడం తీవ్ర అభ్యంతరకరమని ఆయన వాదిస్తున్నారు. 'షారూక్‌ఖాన్‌' సినిమాలు ఎక్కువగా చిన్న పిల్లలు చూస్తారని, చిన్నపిల్లలకు 'ఇంటర్‌కోర్స్‌' అంటే ఏమిటో తెలుసుకోవాలనే ఉంటుందని, చిన్నారులు తల్లిదండ్రులను ఈ పదానికి అర్థం అడుగుతారని, ఇది అటు పెద్దలకు, ఇటు పిల్లలకు ఇబ్బందిగా ఉంటుందని, అందుకే ఆ పదాన్ని తొలగించాలని తాను పట్టుపట్టానని ఆయన వివరిస్తున్నారు. ఆయన వాదనలో కూడా అర్థం ఉన్నట్లుంది. అసలు (సిబిఎఫ్‌సి) సెంట్రల్‌ బోర్డ్‌ ఫర్‌ ఫిలిమ్‌ సెన్సార్‌ బోర్డు నిబంధనలే సరిగా లేవని, నియమనిబంధనలు సరిగా ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదని ఆయన అంటున్నారు.

(దావులూరి హ‌నుమంత‌రావు)


(550)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ