WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సూప‌ర్ హీరోయిజం వివేకం...!బాలీవుడ్‌ తర్వాత టాలీవుడ్‌కే మార్కెట్‌ వేల్యూ ఎక్కువగా ఉంటుంది. బాహుబలితో తెలుగు సినిమా స్పాన్‌ కూడా పెరిగింది. అలాగే తెలుగు ప్రేక్షకులకు భాషా బేదం ఉండదు. సినిమా బావుంటే చాలు. ఏ హీరోనైనా ఆదరించే ప్రేక్షకులు తెలుగువారే. అందుకనే తమిళ హీరోలు, దర్శక నిర్మాతలు తమిళ సినిమాలను తెలుగులోకి అనువాదం చేసైనా విడుదల చేస్తుంటారు. లేదా తెలుగు, తమిళంలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తుంటారు. విశాల్‌, సూర్య, కార్తి, ధనుష్‌, విజయ్‌, అజిత్‌ వంటి హీరోలు తెలుగు మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. హీరో అజిత్‌ విజయానికి వస్తే అజిత్‌ హీరోగా నటించిన 25వ సినిమా వివేగం. దర్శకుడు శివ అజిత్‌తో వీరం, వేదాళం వంటి వరుస విజయాలు తర్వాత చేసిన సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి తెలుగులో వివేకంగా వచ్చిన ఈ సినిమా అంచనాలను ఎలా అందుకుందో చూద్దాం.

కథ:

ఎ.కె. అలియాస్‌ అజయ్‌కుమార్‌(అజిత్‌) సీక్రెట్‌ ఏజెన్సీలో పేరు మోసిన ఏజెంట్‌. ఆర్యన్‌(వివేక్‌ ఒబెరాయ్‌) ఎ.కెకి క్లోజ్‌ ఫ్రెండ్‌. ప్రపంచంలో అణు శక్తి ద్వారా భూకంపాలు క్రియేట్‌ చేసి దాని ద్వారా క్యాష్‌ చేసుకోవాలని కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. అందులో భాగంగా ప్లుటోనియం అణుబాంబును పేల్చాలనుకుంటారు. అందుకు సంబంధించిన రెండు డివైజ్‌లను తయారు చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న ఎ.కె., ఆర్యన్‌ అండ్‌ టీం ఆ డివైజ్‌లను చేజిక్కించుకుని వాటిని నాశనం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తారు. ఆ డివైజ్‌లను ఎవరి దగ్గరుంటాయో ఎవరికీ తెలియవు. చివరకు నటాషా(అక్షర హాసన్‌) దగ్గర డివైజ్‌లున్నాయని ఎ.కె. కనుగొని ఆమెను పట్టుకుంటాడు. కానీ నటాషా మంచితనం చూసి ఆమె ద్వారానే డివైజ్‌లను నాశనం చేయాలనుకుంటాడు ఎ.కె. అయితే నటాషాను ఎవరో కాల్చి చంపేస్తారు. ఎ.కె.ను కూడా చంపడానికి ప్రయత్నిస్తారు. ఇంతకు ఎ.కె. ను చంపాలనుకున్నదెవరు? ఎ.కె డివైజ్‌లను నాశనం చేశాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఇందులో ముందుగా నటీనటుల విషయానికి వస్తే హీరో అజిత్‌ స్టైలిష్‌ లుక్‌, పెర్ఫామెన్స్‌ ఆట్టుకుంటుంది. అజిత్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌లు, బైక్‌ రైడింగ్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌ ఫైట్‌లో అజిత్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీ లుక్‌ బావుంది. అజిత్‌ భార్య పాత్రలో కాజల్‌ అగర్వాల్‌ తన పాత్రకు న్యాయం చేసింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం విలన్‌ పాత్ర చేసిన వివేక్‌ ఒబెరాయ్‌. రక్తచరిత్ర తర్వాత వివేక్‌ ఒబెరాయ్‌ నటించిన దక్షిణాది చిత్రమిది. నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో వివేక్‌ నటన బావుంది. సీక్రెట్‌ ఏజెంట్‌గా, కరప్‌టెడ్‌ ఆఫీసర్‌గా వివేక్‌ ఒబెరాయ్‌ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఇక హీరోకు సపోర్ట్‌ క్యారెక్టర్స్‌లో నటించిన నటీనటులు ఎవరూ పెద్దగా తెలియని వారే. ఇక సాంకేతిక పరంగా చూస్తే దర్శకుడు శివ గతంలో అజిత్‌తో వీరం, వేదాళం సినిమాల కారణంగా ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ అంచనాలను సినిమా అందుకోలేదు. కథ విషయానికి వస్తే కథకు, మన నెటివిటీకి సంబంధం ఉండదు. ఇంగ్లీష్‌వాళ్లందరూ తెలుగు మాట్లాడుతుంటారు. మరి కొన్ని సన్నివేశాల్లో సబ్‌టైటిల్స్‌ వేశారెందుకో మరి అర్థం కాలేదు. పాటకు కూడా సబ్‌టైటిల్‌ వేయడం కాస్తా ఆశ్చర్యంగానే అనిపించింది. 80 దేశాల పోలీసుల దగ్గరున్న సాంకేతికత హీరో దగ్గరుండటం, వారందరిని హీరో బోల్తా కొటిస్తూ తప్పించుకుని తిరగడం చూస్తే హీరోయిజం డోస్‌ కాస్తా ఎక్కువైందనిపించింది. ఇక వెట్రి సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాతలు పెట్టిన ఖర్చును తెరపై చూపడంలో సినిమాటోగ్రాఫర్‌ సక్సెస్‌ అయ్యాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ పూర్తిగా విఫలమయ్యాడు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పేలవంగా ఉన్నాయి. తెలుగు వెర్షన్‌ డైలాగ్స్‌ పేలవంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. కానీ కథ, కథనం సరిగ్గా లేకపోవడంతో సినిమా ప్రేక్షకులకు నిరాశ పరుస్తుంది.

(287)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ