WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రచారంలో 'రాజప్ప'...ప్రకటనలకే పరిమితమవుతున్న 'యనమల'...!

'కాకినాడ' మున్సిపల్‌ కార్పొరేషన్‌కు జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో రాత్రింభవళ్లు నిద్రపోకుండా హోంమంత్రి రాజప్ప కష్టపడి పనిచేస్తుండగా, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంటీ అంటనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పత్రికా ప్రకటనలకు, అడపా,దడపా వచ్చిపోవడానికే ఆయన పరిమితమవుతున్నారని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ హోంమంత్రి పార్టీ గెలుపును తన భుజాలపై వేసుకుని 'కాకినాడ'లో తిష్టవేసి రాత్రింభవళ్లు ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలతో, సమీక్షాసమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా బిజెపికి కేటాయించిన తొమ్మిది వార్డులపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ తొమ్మిదివార్డుల్లో తామే గెలుస్తామని 'జగన్‌' పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవడానికి 'రాజప్ప' వ్యూహాలు పన్నుతున్నారు. కాకినాడలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సిఎం చంద్రబాబునాయుడు వివిధ వర్గాల ద్వారా సేకరిస్తున్నారు. 

  కాగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యవహారంపై స్థానిక నాయకులు 'చంద్రబాబు'కు ఫిర్యాదు చేయటం జరిగింది. మంగళవారం నుండి ప్రచారం ఉదృతం చేసేందుకు స్థానిక నాయకులు సమీక్ష నిర్వహించారు. 'చంద్రబాబు' ఎన్నికల ప్రచారంతోనే 'కాకినాడ' వాతావరణం వేడెక్కుతుందని, అప్పుడు అందరూ పార్టీలైనులోకి వస్తారని స్థానిక నాయకులు నమ్ముతున్నారు. అక్కడ జరుగుతున్న ప్రచార వ్యూహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హోంమంత్రి రాజప్ప ద్వారా తెలుసుకుంటున్నారు. మెజార్టీ వార్డులను టిడిపి గెలుచుకోవడం ఖాయమని రాజప్ప ధీమాతో ఉండగా బిజెపికి కేటాయించిన వార్డుల్లో విజయం సాధించేందుకు టిడిపి నాయకులు కృషి చేయాలని కోరారు. బిజెపి కేటాయించిన వార్డుల్లో అసంతృప్తికి గురైన టిడిపి నాయకులను బుజ్జగించాలని ఆయన కోరుతున్నారు. బిజెపి పోటీ చేసే వార్డుల్లో గెలుపు బాధ్యతలను ఆర్థికంగా చేయూతనిస్తే ఆ ప్రభావం కొంత మేర పనిచేస్తుందని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా కాకినాడలో టిడిపి జెండా ఎగురబోతుందని ఇది ఖాయమని 'జనం ప్రత్యేక ప్రతినిధి'తో స్థానిక నాయకులు, ఇతర ముఖ్యులు ధీమా వ్యక్తం చేశారు.

(338)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ