లేటెస్ట్

33ఏళ్ల తరువాత...‘చంద్రబాబు’ లేని అసెంబ్లీ...!?

ప్రతిపక్షనాయకుడు చంద్రబాబునాయుడు లేకుండానే ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈనెల 11వ తేదీ నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు ‘చంద్రబాబు’ హాజరు కావడం లేదు. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన భార్యను అధికారపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానించారని, దానికి నిరసనగా ఈ ప్రభుత్వం ఉన్నన్నాళ్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టేది లేదని, మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి వస్తానని ఆయన శపథం చేశారు. అన్నట్లుగానే ఈనెలలో జరగబోయే సమావేశాలకు ఆయన దూరంగా ఉండబోతున్నారు. ఆయన రాకపోయినా ప్రధాన ప్రతిపక్షమైన ‘టిడిపి’ సభకు హాజరుకానుంది. ‘చంద్రబాబు’ శాసనసభ్యుడిగా ఎన్నికైన దగ్గర నుంచి దాదాపు అన్ని రోజుల్లో కీలకంగానే వ్యవహరించారు.

1978లో తొలిసారి శాసనసభకు ఎన్నికైన ఆయన అప్పట్లోనే మంత్రిగా వ్యవహరించారు. ఆ తరువాత తన మామ ఎన్టీఆర్‌ స్థాపించిన టిడిపిలోకి వెళ్లారు. అయితే 1985లో ఆయన ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. 1989లో ఆయన టిడిపి తరుపున తొలిసారి గెలిచారు. అయితే ‘టిడిపి’ ఓడిపోయింది. దీంతో ‘టిడిపి’ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నాటి ప్రతిపక్షనేత ‘ఎన్టీరామారావు’ను అవమానించడంతో ఆయన కాంగ్రెస్‌ అధికారంలో ఉన్ననాళ్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టేది లేదని శపథం చేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ‘ఎన్టీఆర్‌’ శాసనసభ నుంచి వెళ్ళిపోయిన తరువాత ‘చంద్రబాబు’ శాసనసభలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి అధికారపక్షానికి ప్రతిపక్షంలో ఉండి చుక్కలు చూపించారు. నాడు టిడిపి శాసనసభాపక్షం ప్రతిపక్షంగా చురుగ్గా వ్యవహరించి, అనేక ప్రజాసమస్యలను అసెంబ్లీలో చర్చకు వచ్చేటట్లు చేసి, అధికార కాంగ్రెస్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. నాడు ‘చంద్రబాబు’ నాయకత్వంలో టిడిపి శాసనసభాపక్షం తిరుగులేనిపోరాటం చేయడం, కాంగ్రెస్‌పై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తితో 1994 ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించింది. ఆ తరువాత నాయకత్వ మార్పిడితో ‘చంద్రబాబు’ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన 2004 వరకు అసెంబ్లీలో నాయకుడిగా వ్యవహరించారు. ఆ తరువాత 2004,2009లో టిడిపి ఓడిపోవడంతో పదేళ్లపాటు ప్రతిపక్షనాయకుడిగా శాసనసభలో క్రియాశీలకంగా పనిచేశారు. 2014లో మరోసారి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. 2019లో ఓడిపోవడంతో ఆయన ప్రతిపక్షనేతగా మారారు. అయితే వైకాపా ప్రభుత్వం తన భార్యను అవమానించిందని, దానికి నిరసనగా అసెంబ్లీకి రానని ఆయన శపథం చేసి బయటకు వచ్చారు. ఆయన సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఇలా శాసనసభను బహిష్కరించింది ఇప్పుడే. గతంలో రాజశేఖర్‌రెడ్డి తన తల్లిని దూషించినా, ఆయన మంత్రులు అనేక రకాలుగా అవమానించినా ‘చంద్రబాబు’ తీవ్ర నిర్ణయాలు తీసుకోలేదు.


దాదాపు 33 ఏళ్ల తరువాత ఆయన తీసుకున్న నిర్ణయంతో ‘టిడిపి’ నాయకుడు లేకుండా అధికారపక్షంపై పోరాడబోతోంది. నాడు ఎన్టీఆర్‌ లేని శాసనసభలో ‘చంద్రబాబు’ అవకాశంగా మలచుకుని అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టి తనలో ఎటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయో ప్రజలకు తెలియచేశారు. అటువంటి అవకాశమే ఈసారి టిడిపి ఎమ్మెల్యేలకు దక్కబోతోంది. తాను అసెంబ్లీకి హాజరు కాకపోయినా ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపి ప్రజా సమస్యలపై చర్చించాలని ‘చంద్రబాబు’ భావించారు. ఈ మేరకు ఈరోజు  పార్టీ నిర్ణయం తీసుకుంది. ‘బాబు’ లేని అసెంబ్లీలోకి తాము కూడా వెళ్లకూడదని పార్టీ నిర్ణయించినా, ప్రజా సమస్యల ప్రస్తావన కోసం మిగతా ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరుకావాలని, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బాబాయి ‘వై.ఎస్‌.వివేకానందరెడ్డి’ హత్య కేసులో ముద్దాయిలను ప్రభుత్వం కాపాడుతుందని ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలపై వచ్చిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని పట్టుపట్టబోతోంది. అది కాకుండా రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు, ప్రత్యేకహోదా, పోలవరం నిర్మాణం, ఉద్యోగుల సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం, విచ్చలవిడిగా చేస్తోన్న అప్పులు, రైతు పొలాలకు మీటర్లు, ఓటీఎస్‌ స్కీమ్‌, చెత్తపన్నులు, రైతుల సమస్యలు, గిట్టుబాటుధరలు, నిత్యావసరవస్తువుల రేట్ల పెంపుదల తదితర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షం భావిస్తోంది.

అయితే ‘చంద్రబాబు’ లేని అసెంబ్లీలో పార్టీకి ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనాయకుడు ‘అచ్చెంనాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరి’లు నాయకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అసెంబ్లీలో ‘టిడిపి’కి పెద్దగా బలమే లేదు. గత ఎన్నికల్లో టిడిపి తరుపున కేవలం 23 మంది మాత్రమే గెలుపొందారు. అయితే వీరిలో నలుగురు అధికార వైకాపాకు మద్దతు తెలుపుతున్నారు. ఇక మిగిలిన 19 మందిలో ముగ్గురు నలుగురు అసెంబ్లీ సమావేశాలకు సరిగా హాజరు అవడం లేదు. ఒకవేళ హాజరు అయినా పార్టీ తరుపున పెద్దగా వాయిస్‌ వినిపించడం లేదు. వచ్చామా..? వెళ్లామా..? అన్నట్లు ఉంటోంది వారి పరిస్థితి. కాగా పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఈసారి సమావేశాల్లో కీలకంగా వ్యవహిరిస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై. అప్పులు, చెల్లింపులపై ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని టిడిపి అభిమానులు కోరుకుంటున్నారు. గతంలో ఎన్టీఆర్‌ ఆసెంబ్లీని బహిష్కరించినప్పుడు వచ్చిన అవకాశాన్ని ‘చంద్రబాబు’ ఎలా వినియోగించుకున్నారో..అలానే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఉపయోగించుకోవాలని టిడిపి అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ