లేటెస్ట్

‘జగన్‌’ ఓటమే ‘షర్మిల’ దంపతుల లక్ష్యమా...!?

సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే సమయం ఉన్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ‘జగన్‌’ను ఓడిరచేందుకు ఆయన ప్రత్యర్థులందరూ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ‘జగన్‌’ తన శత్రువులను పెంచుకుంటూపోతున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన అన్ని వర్గాలను ప్రాధేయపడి, అందరికీ న్యాయం చేస్తానని హామీలు ఇచ్చి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత కక్షసాధింపుచర్యలకు, అనవసర ఖర్చులు చేస్తూ, అభివృద్ధిని, వికాసాన్ని విస్మరించడంతో అన్ని వర్గాలు ఇప్పుడిప్పుడే రోడ్లమీదకు భారీగా వస్తున్నాయి. సమాజంలోని అన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేయడం ఒక ఎత్తు అయితే..ఆయన స్వంత కుటుంబంలో వ్యతిరేకత మరో ఎత్తు. గత ఎన్నికల సందర్భంగా ఆయన కుటుంబం మొత్తం ఆయన వెంట నడిచింది. ‘జగన్‌’ అమ్మ ‘విజయలక్ష్మి’, సోదరి ‘షర్మిల’ ఆయన బావ బ్రదర్‌ అనిల్‌కుమార్‌, ఇతర కుటుంబసభ్యులు ఆయన గెలుపుకోసం తీవ్రంగా శ్రమించారు. గత ఎన్నికలకు ముందు ‘జగన్‌’ జైలుకు వెళ్లిన సమయంలో ఆయన సోదరి ‘షర్మిల’ సుధీర్ఘపాదయాత్ర నిర్వహించి పార్టీకి ఊపిరిపోశారు. అంతే కాకుండా పలు బహిరంగ సభల్లో ‘టిడిపి’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘షర్మిల’, విజయమ్మలు ప్రసంగాలు చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. వీరందరి కంటే ‘జగన్‌’ వైపుకు క్రిస్టియన్‌ మతస్తులను మళ్లించడంతో ఆయన బావ ‘బ్రదర్‌ అనిల్‌కుమార్‌’ చేసిన కృషి మరిచిపోలేనిది. వీరందరి కృషి, ఒకసారి చూద్దామన్న ప్రజల ఆలోచనతో వైకాపా అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మెప్పించడంలో ‘జగన్‌’ ఘోరంగా విఫలమయ్యారు. తాను చేపడుతున్న సంక్షేమ పథకాలే పాలన అని భావిస్తూ, అదే తనను తిరిగి అధికారంలోకి తీసుకువస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఆయన నమ్మకాలు ఎంతవరకు నిజం అవుతాయో ఎన్నికలు జరిగినప్పుడు తెలుస్తాయి. అయితే..గతంలో ‘జగన్‌’ కోసం అహోరాత్రులు కష్టపడ్డ ఆయన సోదరి ‘షర్మిల, బావ బ్రదర్‌ అనిల్‌కుమార్‌ మాత్రం ఈసారి ఆయన ఓటమే లక్ష్యంగా పనిచేయబోతున్నారని తెలుస్తోంది.


అధికారంలోకి వచ్చిన తరువాత తమను పట్టించుకోకపోవడం, కనీసం ‘షర్మిల’కు రాజ్యసభ సీటు ఇవ్వకపోవడం, ఆస్తులను తేల్చకపోవడం తదితర కారణాలతో అన్నాచెళ్ళళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ‘జగన్‌’కు ఇష్టం లేకపోయినా ‘షర్మిల’ తెలంగాణలో పార్టీ స్థాపించుకున్నారు. ఆ తరువాత నర్మగర్భంగా ‘జగన్‌’ పాలనపై విసుర్లు విసురుతున్నారు. ఇటీవల కాలంలో ‘ఆంధ్రప్రదేశ్‌’లో ఆమె పార్టీ పెడతారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆమె ఖండిరచారు. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఆమె భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ‘ఆంధ్రప్రదేశ్‌’లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ సంఘాల నేతలను ఆయన కలుస్తూ ‘ఆంధ్రా’లో ‘జగన్‌’ పాలన బాగా లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్య మాజీ ఎంపి ‘ఉండవల్లి అరుణ్‌కుమార్‌’ను కలిసి రాజకీయ అంశాలపై చర్చించామని ఆయనే ప్రకటించారు. తాజాగా ఈరోజు కొన్ని బీసీ సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘జగన్‌’ పాలనపై మాట్లాడుతూ గత ఎన్నికల్లో తాను బీసీలు, క్రిస్టియన్ల ఓట్లను వైకాపాకు వేపించానని, అయితే ‘జగన్‌’ పాలనపై వారంతా అసంతృప్తితో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేసే పార్టీలకు ఓట్లు వేయాలని అడుగుతానని ఆయన ప్రకటించారు. ఆయన ప్రకటనను రాజకీయపరిశీలకులు వివిధ రీతుల్లో విశ్లేషిస్తున్నారు. ‘షర్మిల, అనిల్‌’లు ‘ఆంధ్రా’లో పార్టీ పెడతారని, దాని సన్నాహాల్లో భాగమే ఈ సమావేశాలని కొందరు చెబుతుండగా, అదేమీ కాదు..ఇప్పటికే తమ రాజకీయం ‘తెలంగాణ’లో అని ‘షర్మిల’ ప్రకటించారని, ఇక్కడకు వచ్చే ప్రసక్తేలేదని చెప్పారని, వారు నేరుగా పార్టీ పెట్టకుండా ‘జగన్‌’ ఆయువుపట్టైన క్రిస్టియన్‌, బీసీ, రెడ్డి వర్గాల్లో చీలిక తెస్తారనే చెబుతున్నారు. తమకు అన్యాయం చేసిన ‘జగన్‌’ను ఓడిరచడమే లక్ష్యంగా వారు పనిచేస్తారని విశ్లేషిస్తున్నారు. కాగా ‘షర్మిల’ దంపతులకు ‘వివేకానందరెడ్డి’ కుమార్తె ‘సునీత’ కూడా మద్దతు తెలుపుతారని అంటున్నారు. మొత్తం మీద తమను విస్మరిస్తే ఏమి జరుగుతుందో ‘జగన్‌’కు తెలియజేయాలనే ఆలోచనతోనే ‘షర్మిల దంపతులు’ ‘ఆంధ్రా’లో తమదైన రాజకీయాలు చేయబోతున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. చూద్దాం ఏమి జరుగుతుందో..!

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ