WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రధాని చైనా పర్యటనకు ముందే...కేంద్రమంత్రివర్గ విస్తరణ...!

ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవల వివిధ కారణాలతో మంత్రివర్గం నుంచి కొందరు కీలక మంత్రులు తప్పుకున్నారు. వారి స్థానాల్లో కొత్తవారిని నియమించడంతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన మంత్రి వర్గాన్ని విస్తరించబోతున్నారు. ప్రధాని త్వరలో చైనా పర్యటనకు వెళ్లనుండడంతో ఆ లోపే మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆయన భావిస్తున్నారట. దీనిపై ఇప్పటికే ఆయన పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాతో చర్చిస్తున్నారు. ప్రధానిగా 'మోడీ' బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన మంత్రివర్గాన్ని విస్తరించడం ఇది మూడోసారి. కాగా ఇదే ఆఖరి మంత్రివర్గ విస్తరణ కాదని 2019 లోక్‌సభ ఎన్నికలు ముందు మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో నూతనంగా కొన్ని పార్టీలకు అవకాశం కల్పించడం, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పించడం, కాగా రాజస్థాన్‌,ఛత్తీస్‌ఘడ్‌ మరియు మధ్యప్రదేశ్‌ ఎన్నికలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు.

జెడి(యు)కు ఆహ్వానం..!

ఇటీవల ఎన్‌డిఎలో చేరిన జెడి(యు)కు తన మంత్రివర్గంలో కీలకమైన శాఖలను అప్పగించబోతున్నారు ప్రధాని మోడీ. బీహార్‌లో జెడి(యు)తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన 'బిజెపి' ఆ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ తన భాగస్వామితో పాటు తాను బలపడాలని కోరుకుంటోంది. దీనిలో భాగంగా బీహార్‌కు మంత్రివర్గంలో పెద్దపీట దక్కబోతోంది.

ఎఐఎడిఎంకెకు స్థానం...!

దక్షిణాదిలో బలమైన పునాదులు వేసుకోవాలని భావిస్తున్న బిజెపి దానిలో భాగంగా తమిళనాడులో అధికారపక్షమైన ఎఐఎడిఎంకెను మంత్రివర్గంలోకి తీసుకోబోతోంది. నిన్నటి దాకా ముఖ్యమంత్రి పళినిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వంల మధ్య రాజీకుదర్చి అక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టిన బిజెపి ఇప్పుడు వారి పార్టీ నుంచి కేంద్రమంత్రివర్గంలో క్యాబినెట్‌ ర్యాంక్‌తో ఓ మంత్రి పదవిని ఇవ్వాలని భావిస్తోంది.అంతే కాకుండా మరో ఇద్దరికి సహాయమంత్రి పదవులు ఇవ్వబోతోంది. దీని ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బలమైన పక్షంగా ఎన్నికలను ఎదుర్కోవచ్చని తలపోస్తుంది.

అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు...!

త్వరలో జరగనున్న గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రాలకు మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట వేయబోతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటుందని, ఆ పార్టీని ఓడించడం కోసం ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచిస్తోంది. అదే సమయంలో తాము అధికారంలో ఉన్న గుజరాత్‌లో గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. పటేల్‌ ఉద్యమం ద్వారా గుజరాత్‌తో బిజెపి కష్టాలను ఎదుర్కొంటుందని దాన్ని అధిగమించడానికి ఇక్కడ క్యాబినెట్‌ర్యాంక్‌తో మంత్రి పదవి ఇవ్వబోతోంది.

ఆల్‌రౌండర్‌ కావాలి...!

కేంద్ర మంత్రివర్గంలో వేగంగా పనిచేసే ఆల్‌రౌండర్‌ కోసం ప్రధాని మోడీ వేట ప్రారంభించారు. గతంలో 'వెంకయ్యనాయుడు' అన్ని వ్యవహారాలను చూసుకుంటూ వేగంగా పనిచేసేవారు. ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతి అవడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసే వారి కోసం 'మోడీ' వెతుకుతున్నారు. అదే సమయంలో కేంద్రమంత్రిగా పనిచేసి మంచి మార్కులుపొందిన 'మనోహర్‌పారికర్‌' స్థానాన్ని మరో సమర్థవంతమైన నేతతో భర్తీ చేయాల్సి ఉంది. 'మనోహర్‌'ను గోవా ముఖ్యమంత్రిగా పంపించడంతో ఆయన స్థానం ఖాళీగా ఉంది.

ఆకాంక్షలను వేగంగా నెరవేర్చాలి...!

ప్రధానిగా 'మోడీ' బాధ్యతలు నిర్వహించి మూడు సంవత్సరాలకు పైగా కాలం గడిచినా సామాన్య ప్రజల ఆకాంక్షలను ఆయన నెరవేర్చలేదనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. రాబోయే 20మాసాల కాలంలో వేగంగా పనిచేస్తూ ప్రజల ఆకాంక్షలను తీర్చాలని ఆయన భావిస్తున్నారు. దేశ స్థూలజాతీయోత్పత్తి వృద్ధిరేటు మూడు సంవత్సరాల వెనక్కు మళ్లడంతో 'మోడీ' ప్రభుత్వ పనితీరుపై సగటు ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలంటే సరైన ఫలితాలను సాధించే వారిని మంత్రులుగా ఎంపిక చేసుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణతో ఇటువంటి వారికి స్థానం లభించబోతోంది.

(దావులూరి హ‌నుమంత‌రావు)


(342)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ