టిడిపి,టిఆర్‌ఎస్‌లను చీల్చడానికి 'మోడీ' కుట్రపన్నారా...!? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపి,టిఆర్‌ఎస్‌లను చీల్చడానికి 'మోడీ' కుట్రపన్నారా...!?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముందు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉన్న  ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్రసమితి పార్టీలను చీల్చాలని బిజెపి పెద్దలు 'మోడీ,అమిత్‌షా'లు కుట్ర పన్నారా..?  అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆదివారంనాడు జరగనున్న కేంద్రమంత్రి వర్గ విస్తరణ సందర్భంగా కేంద్ర విమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు చేసిన వ్యాఖ్యలనే వారు దీనికి మద్దతుగా ఉదాహరిస్తున్నారు. నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను బిజెపిలోకి వెళతానని ప్రచారం చేస్తున్నారని, అది నిజం కాదని, ఎవరు ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారో తనకు తెలియదని, తాను టిడిపిలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా టిడిపిలో కలకలం చెలరేగింది. తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్‌ నాయకుడు అయిన 'అశోక్‌గజపతిరాజు' పై ఇటువంటి వార్తలు రావడం ఏమిటనే చర్చ తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది. నీతికి,నిజాయితీకి, సమర్థతకు మారుపేరు 'అశోక్‌'. అటువంటి ఆయన పార్టీ మారతారంటూ ప్రచారం జరగడం దాన్ని ఆయన ఖండించడంతో అసలేదో...ఢిల్లీలో జరుగుతుందనే ప్రచారానికి ఊతం ఇచ్చాయి.  

   అంతే కాకుండా   తెలంగాణ రాష్ట్రంలోనూ ఇటువంటి వార్తలే వస్తున్నాయి. అధికార టిఆర్‌ఎస్‌ పార్టీని బిజెపిలో విలీనం చేయాలని ఆ పార్టీపై పెద్దఎత్తున ఒత్తిడి వస్తోందని   అందుకే టిఆర్‌ఎస్‌ అధినేత కెె.చంద్రశేఖర్‌రావు హడావుడిగా ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారని సదరు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. టిఆర్‌ఎస్‌ను తమ పార్టీలో విలీనం చేయకపోతే ఆ పార్టీ నుంచి ఐదుగురు లేదా ఆరుగురు ఎంపీలను చీల్చి వారికే మంత్రి పదవి ఇస్తామని బిజెపి పెద్దలు హెచ్చరించారనే వార్తలు హైదరాబాద్‌లో షికారు చేస్తున్నాయి. అంతే కాకుండా అధికార టిఆర్‌ఎస్‌ నాయకులు గత మూడేళ్లగా సాగిస్తున్న అవినీతిపై విచారణ జరిపిస్తామని, అవసరమైతే వారిని జైలుకు కూడా పంపిస్తామని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తోన్న ఓ నేత హైదరాబాద్‌లో పార్టీ సమావేశంలో మాట్లాడుతూ అవసరమైతే కెసిఆర్‌ను జైలుకు పంపించడం గంటల్లో జరిగేపనని, ఆయన గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారనే వార్తలు వచ్చాయి. కెసిఆర్‌ చేసిన అవినీతి గురించి తమ వద్ద పెద్ద చిట్టా ఉందని, దీంతో ఆయనను నిమిషాల మీద లొంగదీస్తామని ఆయన చెప్పారట. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఈయన ఇటీవల ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును మంత్రివర్గం నుంచి తప్పించడంలో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పుకుంటున్నారు. అటువంటి ఈ నేత కెసిఆర్‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేయటంతో ఒక్కసారిగా సమావేశంలో ఉన్న నేతలు ఉలిక్కిపడ్డారట. రాబోయే కాలంలో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని బల్లగుద్ది చెప్పడం వెనుక ఇటువంటి విలీన, జైలు వ్యూహాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు కూడా ఖండించడం లేదు. అంతే కాకుండా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పదే పదే కంటికి శస్త్రచికిత్స చేయించుకోవాలనే పేరుతో ఢిల్లీకి వెళుతున్నారని,అయితే ఆయన కంటికి శస్త్రచికిత్స చేయించుకోవడం లేదని, ఆ వంకతో ఆయన ఎవరెవరినో కలుస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. చిన్న శస్త్రచికిత్స కోసం ఇన్ని సార్లు ఢిల్లీ వెళ్లాలా..? ఆయన ఫలానా హాస్పటల్‌లో చికిత్స తీసుకుంటారనే దానిపై కూడా స్పష్టత రావడంలేదు. ఢిల్లీ వెళ్లిన దగ్గర నుంచి ఆయన ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు...ఎవరితోనో ఆయన రహస్యంగా సమావేశమై, చర్చిస్తున్నారని, ఇది టిఆర్‌ఎస్‌ విలీనం లేదా పొత్తుకు దారి తీసే అవకాశం ఉందని చెబుతున్నారు. బిజెపి పెద్దల ఒత్తిడితోనే ఇప్పుడు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారని, ఈసారి ఆయన కేంద్ర ప్రభుత్వంలో చేరటం ఖాయమనే చర్చ కూడా జరుగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా...టిఆర్‌ఎస్‌పై విలీనం కత్తివేలాడుతుందని, ఒక వేళ వారు కనుక విలీనం చేయకపోతే ఆ పార్టీని చీల్చడం ఖాయమని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కూడా వర్తిస్తుందని సదరు వర్గాలు అంటున్నాయి.

  ఎన్‌డిఎలో విలువైన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ, అవసరమైనప్పుడల్లా ఆదుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితిని చీల్చాల్సిన అవసరం 'అమిత్‌షా,బిజెపి'లకు ఎందుకు వస్తుందన్న ప్రశ్నకు ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. గత మూడేళ్ల నుంచి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సాగించిన అస్తవ్యవస్థ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, అది ఇప్పుడిప్పుడే బయట పడుతుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి బిజెపికి స్వంతంగా మెజార్టీ వచ్చే ప్రసక్తేలేదని వారు భావిస్తున్నారట. దీన్ని ఎదుర్కొవడానికి...రాబోయే కాలంలో తమకు అవరోధంగా ఉన్నారని భావించేవారిని బలహీనపరిచే కార్యక్రమంలో భాగంగానే వారు టిడిపి,టిఆర్‌ఎస్‌లపై గురిపెట్టారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ముందుగా టిఆర్‌ఎస్‌పై అస్త్రాన్ని ఎక్కుపెట్టారని, వారి పని అయిపోయిన తరువాత టిడిపి పని పట్టాలనేది వారి వ్యూహమట. ప్రస్తుతం టిడిపి తరుపున 'అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరిలు  కేంద్రమంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే 'అశోక్‌' తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించగా... సుజనాచౌదరి మాత్రం నోరు విప్పడం లేదు. వ్యాపారవేత్త అయిన 'సుజనాచౌదరి'కి ఆయా వ్యాపారాల్లో లెక్కకు మించి ఉన్న లొసుగుల వల్ల బిజెపి నేతల ఒత్తిడికి తలొగ్గవచ్చు. ఆయనతో పాటు మరో నలుగురు లేదా ఐదుగురు ఎంపీలను చీల్చాలనేదే బిజెపి పెద్దల వ్యూహమట. అయితే ఇది ఎంత వరకు సఫలం అవుతుందో తెలియదు..! ఎందుకంటే ఇప్పటికే బిజెపిపై ఆంధ్రా ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. నవ్యాంధ్రకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, రాజధానికి సహాయం చేయకపోవడం, రైల్వేజోన్‌ ఇవ్వకపోవడం, ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించడం వంటి చర్యల వల్ల వారు ఆపార్టీపై విముఖంగా ఉన్నారు. ఒకవేళ టిడిపిని బిజెపి చీల్చినా వారికి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఎందుకంటే బిజెపి కనుక ఈ చర్యకు పాల్పడితే రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ఇక్కడ ఘోరి కట్టడం ఖాయం. అయితే ఇదంతా ఇప్పటి వరకు వ్యూహాలకే పరిమిత మయిందా..లేక ఆచరణలో ఏమైనా ప్రయత్నాలు చేశారా...? అనేది తేలితే కానీ..అసలు విషయం బయటకు రాదు..! అప్పుడు మిత్ర ద్రోహానికి పాల్పడ్డవారిపై ఎటువంటి ప్రతీకారం తీర్చుకుంటారో..ఆంధ్రా ఓటర్లే నిర్ణయించుకుంటారు..! చూద్దాం..ఏమి జరుగుతుందో..!?


(దావులూరి హనుమంతరావు)


(1266)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ