WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సికింద్రాబాద్‌'కు ఉపఎన్నికలొస్తే...టిఆర్‌ఎస్‌కు...దబిడ..దిబిడే...!

హఠాత్తుగా తెలంగాణలో రాజకీయ వేడి పెరిగిపోయింది. సాధారణంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు కానీ, అధికార పార్టీ కానీ ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉంటుంది. ఇక్కడ అటువంటిదేమీ జరగలేదు..! కానీ కేంద్రమంత్రివర్గ విస్తరణ తెలంగాణలో రాజకీయవేడి పెరగడానికి కారణం కావడం కొంత ఆశ్చర్యకరమే. ఎందుకంటే అనూహ్యంగా మంత్రి పదవిలో ఉన్న 'బండారు దత్తాత్రేయ'ను పదవి నుంచి తొలగించి సంచలనం సృష్టించారు బిజెపి పెద్దలు. వాస్తవానికి 'దత్తాత్రేయ'ను అంత తొందరగా తొలగిస్తారని రాజకీయనాయకులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ భావించలేదు. అయితే రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఆయనను రాజీనామా చేయమని సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఫోన్‌ చేసి చెప్పడం...వెంటనే 'దత్తాత్రేయ' పదవికి రాజీనామా చేయటం చకచక జరిగిపోయాయి. మంత్రివర్గ విస్తరణ అంటే అది బిజెపి అంతర్గత వ్యవహారం కనుక దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. కానీ పదవి నుంచి రాజీనామా చేసిన 'దత్తాత్రేయ'తో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారనే వార్తలే ఇప్పుడు మరింత సంచలనం కల్గిస్తున్నాయి. లోక్‌సభకు రాజీనామా చేసిన ఆయనకు గవర్నర్‌ పదవి ఇస్తామని బిజెపి పెద్దలు చెబుతున్నారు. ఇదే కనుక నిజం అయి ఆయన కనుక లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే...ఉపఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి. ఉపఎన్నికలు వస్తే ఎవరి పరిస్థితి ఏమిటో...? ముఖ్యంగా అధికార టిఆర్‌ఎస్‌ పరిస్థితి ఇరకాటంలో పడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

   గత మూడున్నరేళ్లనుంచి ప్రకటనలతో కాలం గడుపుతున్న టిఆర్‌ఎస్‌ పెద్దలకు ఈ ఎన్నికలో గెలవడం కత్తిమీద సామే...! ఎందుకంటే సికింద్రాబాద్‌ అంటే ఒక మినీభారత దేశమే.గత ఎన్నికల్లో ఇక్కడ బిజెపి, టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు పోటీపడగా టిడిపితో కలసిపోటీ చేసిన బిజెపి గెలిచింది. నాడు ఆంధ్రాకు చెందిన వాళ్లల్లో ఎక్కువ మంది బిజెపి,టిడిపి కూటమినే సమర్థించారు. దానితో బిజెపి అభ్యర్థి ఘనవిజయం సాధించారు. మరలా ఇప్పుడు కనుక ఉపఎన్నికలు వస్తే బిజెపికి మళ్లీ గెలిచే ఛాన్స్‌ ఉన్నా లేకున్నా..అధికార టిఆర్‌ఎస్‌ గెలవడం మాత్రం కష్టమే. ఎందుకంటే గత మూడున్నరేళ్ల టిఆర్‌ఎస్‌ పాలనలో నగర ప్రజలు నరకం చవిచూస్తున్నారు. పూర్తికానీ మెట్రోరైలు,ఇంకా మొదలు కానీ డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు, గుంతలు పడిన రోడ్లు వెరసి అభివృద్ధికి ఆమడ దూరంలో నగరం ఉండడం అధికారపార్టీపై ఓటర్లు ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాటలకే పరిమితం అవుతున్నారని...ఆయన మాటలను చేతల్లో చూపించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. అదే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ఊరించిన కెసిఆర్‌ ఇప్పుడు ఉద్యోగాల ఊసెత్తకపోవడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో అధికార పార్టీ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. మాట్లాడితే ఆంధ్రా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎవరు అడిగినా అడగకపోయినా..ఒకటే చెబుతున్న 'కెసిఆర్‌' సికింద్రాబాద్‌తో అగ్నిపరీక్ష పెడితే చూడాలని ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఉవ్విళ్లూరుతున్నారు. అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన అసంతృప్తిని ఎదుర్కొంటున్న టిఆర్‌ఎస్‌కు బిజెపి పరీక్ష పెడుతుందా..? ఈ అసంతృప్తిని వడసి పట్టి ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదేనని బిజెపి పెద్దలు భావిస్తున్నారు. వ్యూహం బాగానే ఉన్నా...సాహసం చేసి బిజెపి ఎన్నికలకు వెళుతుందా..? సాహసం చేయరా..డింభకా...! అన్న పాతళభైరవి మాంత్రికుని మాటను బిజెపి నేతలు పాటిస్తారో...లేదో వేచి చూడాల్సి ఉంది.


(498)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ