WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కెసిఆర్‌' పాదాభివందనాలపై 'ఐలయ్య' ఆక్షేపణ...!

ఒక వ్యక్తి మరో వ్యక్తికి పాదాభివందనం చేశారంటే...ఏమిటి దానర్థం...! తాను నిమిత్తమాత్రుడిని...అంతా తమరి వల్లే...నా జీవితం సాగుతుందనే భావన..! సర్వం...ఆ వ్యక్తి వల్లేనన్న అర్థం...! ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఈ రకమైన పాదాభివందనాలు చేశాడంటే...ఇదే రకమైన అభిప్రాయం ఉంటుంది. అలా కాకుంటే అవతలి వ్యక్తి దైవస్వరూపుడైనా అయి ఉండాలి. లేక మహాత్ముడైనా అయి ఉండాలి..! ఇవేవి కాకపోతే ఎందుకు సాటి మనిషి...మరో మనిషికి పాదాభివందనం చేయాలి. పాదాభివందనం అంటే మనకు అవతలి వ్యక్తిపై ఉన్న ప్రేమకు చిహ్నమా..?గౌరవమా...? లేక అతను దైవదత్తుడనే భావమా...? లేదూ అతని నుంచి ఏదైనా ప్రతిఫలం ఆశిస్తున్నామా...? లేక దీనికి అధ్వైతీయమైనదేమైనా ఉందా...? సమాజంలో వ్యక్తులను బట్టి గౌరవాలు మారుతుంటాయి...! మనకంటే పెద్దహోదాలో ఉన్న వ్యక్తి, మనకంటే ఎక్కువ ధనం ఉన్న వ్యక్తులకు ఇచ్చే గౌరవం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ గౌరవంలో ఏదో ఆశించేది ఉంటుంది..అంతే తప్ప...అతనేదో...దైవాంశసంభూతడని కాకపోవచ్చు...ఇవతలి వ్యక్తి ఆశ,స్వార్థం,లాభాపేక్ష వంటి కారణాలు ఇటువంటి విషయాల్లో ఉంటాయి. ఏమిటీ సోది...ఎందుకు ఇదంతా అంటారా..? చెబుతా...!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బ్రాహ్మణులకు చేసే పాదాభివందనాలు గురించి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త 'ఐలయ్య' ప్రముఖ పత్రికలో రాసిన వ్యాసంపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. 'ఐలయ్య' ఏమంటారంటే...'తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాను చేసిన పాపాలకు నిష్కృతి చేసుకునే పనిలో భాగంగానే కనిపించిన ప్రతి బ్రాహ్మణుని పాదాలపై పడుతున్నారని విమర్శిస్తున్నారు. హిందూ దేవతలంతా బ్రాహ్మణుల చేతిలోనే ఉన్నారు కనుక..బ్రాహ్మణులను గౌరవిస్తే...తనకు స్వర్గలోకప్రాప్తికలుగుతుందనే ఆశతో ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. పెద్దలకు గౌరవంతోనే 'కెసిఆర్‌' పాదాభివందనాలు చేస్తున్నారనే వారిపై ఆయన విరుచుకుపడుతున్నారు. రాష్ట్రపతిగా ఉన్న 'ప్రణబ్‌ముఖర్జీ' పాదాలకు నమస్కారాలు చేసిన 'కెసిఆర్‌' మరి ప్రస్తుత రాష్ట్రపతి కోవిందరామ్‌ పాదాలకు ఎందుకు నమస్కరించలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును హైదరాబాద్‌కు పిలిచి భారీ ఎత్తున్న పౌరసన్మానం చేసిన 'కెసిఆర్‌' ఆయన పాదాలకు పాదాభివందనం ఎందుకు చేయలేదంటున్నారు. రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి కంటే పదవిలో చిన్నవ్యక్తి అయిన రాష్ట్ర గవర్నర్‌ నర్సింహ్మన్‌ కాళ్లకు పదే పదే మొక్కుతున్న 'కెసిఆర్‌' రాష్ట్రపతి కోవిందరామ్‌,ఉపరాష్ట్రపతి వెంకయ్య కాళ్లకు నమస్కరించాలి కదా..అంటున్నారు. ఆయన బ్రాహ్మణ కులస్తులకు తప్ప వేరే వ్యక్తులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా వారి కాళ్లకు నమస్కారం చేయరని ఆయన ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఇచ్చిన 'సోనియాగాంధీ'కి ఎందుకు పాదాభివందనం చేయలేదు..? అదే సమయంలో తెలంగాణకు వ్యతిరేకి అయిన మాజీ రాష్ట్రపతి 'ప్రణబ్‌'కు ఎందుకు పాదాభివంనం చేశారు...అంటే 'ప్రణబ్‌' బ్రాహ్మణ వ్యక్తి కావడం వల్లేనని ఆయన విరుచుకుపడుతున్నారు. 'ఐలయ్య' చేసిన వ్యాఖ్యలు, రాతలు తెలంగాణ సమాజంలో చాలా కాలం నుంచి వినిపిస్తున్నవే. బ్రాహ్మణులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయటం, దేవాలయాలకు భారీగా నిధులు సహాయం చేయటం, యజ్ఞయాగాలు నిర్వహించడం, బ్రాహ్మణులకు తన ప్రభుత్వంలో సలహాదారుల హోదా ఇవ్వటం వంటి ఆయన ఈ మూడేళ్ల కాలంలో చాలా చేశారు. తద్వారా బ్రాహ్మణహితుడనే పేరు తెచ్చుకున్నారు.అయితే  తెలంగాణలోని అణగారిన సమాజం ఈ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తుందని 'ఐలయ్య' అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆయనకు ఉన్న మూఢ నమ్మకాలను సమాజంపై రద్దుతున్నారని ఆరోపిస్తున్నారు.

కాగా 'ఐలయ్య' రాతలపై 'బ్రాహ్మణ' సమాజం మండిపడుతోంది. మొదటి నుంచి 'ఐలయ్య'కు బ్రాహ్మణులపై చిన్నచూపు ఉందని, వారిని ప్రతి సందర్భంలోనూ దూషిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. 'ఐలయ్య' రాసిన వ్యాసంపై 'వనం జ్వాలా నరసింహారావు' స్పందిస్తూ ఒక వ్యక్తి ఎవరికి మొక్కాలి..ఎప్పుడుమొక్కాలి...అనేది ఆ వ్యక్తి ఇష్టంపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఫలానా వ్యక్తి చెప్పారనో...లేక ఫలానా సంస్థ చెప్పిందనో మొక్కాల్సిన అవసరం లేదని ఆయన అంటున్నారు. బ్రాహ్మణులను దోపిడీదారులుగా చూపించడానికి 'ఐలయ్య' ప్రయత్నిస్తున్నారని, దీని ద్వారా ఆయన సంకుచితబుద్ధిని బయటపెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఇంకా 'జ్వాలా' ఏమంటా రంటే...' సమాజంలో ఎప్పుడో బ్రాహ్మణులు రాచరికాలు అనుభవించారని...భూములు, ఆస్తులను కొల్లకొట్టారని..అవి మనసులో పెట్టుకుని...ఇప్పటికీ సాధించడం దేనికని ప్రశ్నిస్తున్నారు. రాజ్యాలు,రాజరికాలు,భూములు,మాన్యాలు అన్నీ పోయి...కొంత మంది బ్రాహ్మణులు కటిక పేదరికం అనుభవిస్తున్నారని అటువంటి వారిపై ఇటువంటి రాతలు ఎందుకు..? సమాజానికి బ్రాహ్మణులు చేస్తున్న సేవలను గుర్తించకుండా దాడి చేయటమేమిటి..? ఇప్పటికీ బ్రాహ్మణులు సమాజంలో తమ పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు...సమకాలీన సమాజంలో రాజకీయంగా,ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్న వారిపై విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదు...! మొత్తం మీద 'ఐలయ్య' ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మూఢ విశ్వాసాలను పెంచిపోషిస్తున్నారని భావిస్తుండగా, 'వనం' మాత్రం ఒక వ్యక్తి ఇష్టాఇష్టాలను నిర్దేశించే చర్యలు సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు.

(దావులూరి హనుమంతరావు)


(439)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ