WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆంధ్రా,తెలంగాణ'లకు 'మోడీ' మొండిచెయ్యి...!

కేంద్రమంత్రి వర్గ విస్తరణపై ప్రధాని 'మోడీ' వ్యవహరించిన తీరుపై అటు స్వంత పార్టీలోనూ, ఇటు ఆర్‌ఎస్‌ఎస్‌లోనూ అసంతృప్తి వ్యక్తం అవుతుంది. చిరకాలం పార్టీలో ఉన్నవారిని, పార్టీకి సేవ చేసిన వారిని వదిలేసి కొంత మంది ఉన్నతాధికారులను తీసుకోవడంపై ఆగ్రావేశాలు వ్యక్తం అవుతున్నాయి. వారితో పాటు ఎన్‌డిఎ భాగస్వామ్యపక్షాల్లోనూ తీవ్రమైన అసహనం, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి. తమకు తెలియకుండా మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోవడం, తమను సంప్రదించకపోవడంపై జెడి(యు),శివసేన, అన్నాడిఎంకె, ఆకాళీదళ్‌, తెలుగుదేశం పార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం మాటమాత్రమైన చెప్పకుండా విస్తరణ చేయటం ఏమిటని అవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా బిజెపి శ్రేణుల్లోనూ మంత్రివర్గ విస్తరణపై అసహనం కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. విస్తరణకు ముందు ఆంధ్రా,తెలంగాణలో ఉన్న మంత్రులను తొలగించినా వారి స్థానంలో నూతనంగా ఎవరికీ అవకాశం ఇవ్వకపోవడంపై వారు తమలో తాము మధనపడుతున్నారు. తెలంగాణకు కనీసం ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం కూడా లేదు. ఇప్పటి వరకు తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహించిన 'బండారు దత్తాత్రేయ'ను తొలగించగా ఆయన స్థానంలో ఎవరికీ స్థానం లభించలేదు. సామాజిక సమీకరణలు కుదరక ఇవ్వలేదా..? లేక దీని వెనుక ఏదైనా కారణం ఉందా...అనేది త్వరలోనే బయటపడుతుంది...!

'దత్తాత్రేయ'కు అవమానం...!

బిజెపిలో చిరకాలం నుంచి పనిచేస్తున్న 'బండారు దత్తాత్రేయ'ను బిజెపి పెద్దలు అవమానించారనే విమర్శలు వస్తున్నాయి. 'బిజెపి'లో 'మోడీ' ఎవరో తెలియని కాలంలోనే 'దత్తాత్రేయ' మంత్రిగా పనిచేశారని, అటు వంటి ఆయనపై అసమర్థుడు,అవినీతిపరుడనే ముద్రవేసి తొలగిస్తున్నారని ఇది సమంజసం కాదని ఆయన అనుచరులు చెబుతున్నారు. తమ నేతకు జరిగిన అవమానంపై వారు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. త్వరలో తమ నేత కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా అంటున్నారు. అంటే రాజకీయ సన్యాసం కూడా తీసుకునే అవకాశం లేకపోలేదని వారు అంటున్నారు. కాగా 'దత్తాత్రేయ'ను తొలగించడంపై ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే 'మోడీ' వారి మాటను కూడా లెక్కచేయలేదని అంటున్నారు. ఒకవేళ ఆయనను తొలగించినా ఆ స్థానంలో ఎవరికో ఒకరికి మంత్రిగా అవకాశం ఇవ్వాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారట. అయితే రాబోయే కాలంలో టిఆర్‌ఎస్‌ నుంచి వచ్చే వలసలను దృష్టిలో పెట్టుకునే ఈ స్థానాన్ని ఖాళీగా ఉంచారని, టిఆర్‌ఎస్‌ నుంచి చీలిన వర్గానికి ఈ పదవి ఇస్తారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.

'పాపం...'హరిబాబు'...!

కేంద్రమంత్రివర్గంలో స్థానం లభించిందని పార్టీ జాతీయ అధ్యక్షుడు 'అమిత్‌షా' నుంచి ఫోన్‌రావడంతో ఆగమేఘాలపై హస్తిన చేరిన 'కంభంపాటి హరిబాబు'కు చుక్కెదురయింది. ఆఖరి నిమిషయంలో ఆయన పేరును జాబితా నుంచి తొలగించారని తెలుస్తోంది. మొదట 'వెంకయ్యనాయుడు' స్థానంలో 'హరిబాబు'కు ఇవ్వాలని 'మోడీ', అమిత్‌షా నిర్ణయించారని దానిలో భాగంగానే ఆయనను ఢిల్లీ రమ్మని వర్తమానం పంపించారు. అయితే ఇక్కడే 'వెంకయ్య' వ్యతిరేకులు పావులు కదిపారు. 'వెంకయ్య'ను మంత్రి పదవి నుంచి తప్పుకునేలా చేసిన శక్తులే ఇక్కడా అడ్డంపడినట్లు తెలుస్తోంది. 'హరిబాబు'కు మంత్రి పదవి ఇస్తే 'కమ్మ' సామాజికవర్గం పెత్తనం పార్టీపై ఉంటుందని, దీనితో పార్టీ ఎప్పటికీ ఎదిగే అవకాశం లేదని ఆయనకు మంత్రి పదవి ఇవ్వవద్దని 'వెంకయ్య' వ్యతిరేకవర్గం గట్టిగా డిమాండ్‌ చేసిందట. బిజెపి ఎదగకుండా 'హరిబాబు' ప్రయత్నిస్తారని, ఇటీవల కాలంలో ఆయన టిడిపితో పొత్తు విషయంలో చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని, 'వెంకయ్య' వల్లే పార్టీ ఎదగడం లేదని ఆయనను పార్టీ నుంచి తప్పిస్తే ఇప్పుడు మరో 'వెంకయ్య'ను తీసుకువచ్చి కూర్చోబెడితే ఎలా...? అని వారు ప్రశ్నించారట...? దీంతో 'మోడీ, అమిత్‌షా'లు  ఆఖరు నిమిషంలో మనసు మార్చుకున్నారట. దీంతో నోటిదాకా వచ్చిన ముద్ద చేజారిపోయిందని 'హరిబాబు' అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉన్న కులాల కుమ్ములాటలకు తోడు...ఈ మధ్య తాను పెద్దతోపు నాయకుడ్ని అని భావించే నేత, 'మోడీ',వ్యూహాలు 'హరి'కి అన్యాయం చేశాయని అంటున్నారు. రాబోయే కాలంలో అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఇక్కడా తెలంగాణ ఫార్ములా అమలు చేయవచ్చనే ఆలోచనతోనే 'హరిబాబు'కు మంత్రి పదవి ఇవ్వలేదని సమాచారం. మొత్తం మీద తెలుగువాళ్లలో తెలుగువాళ్లు తన్నుకుని చివరకు ఒట్టి చేతులతో ఢిల్లీ నుంచి తిరుగుముఖం పడుతున్నారు. మరి మరోసారి జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఎటువంటి చిత్రాలు కనిపిస్తాయో వేచి చూడాలి.


(534)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ