WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వివాదాలు సృష్టిస్తే...జీవితకాల నిషేదమే...!

ఆర్థిక సంస్కరణలు వల్ల మెరుగైన జీవనయానం సాగిస్తున్న భారతీయులు సకల సౌకర్యాలను పొందడంలో ఇప్పుడు ముందున్నారు. గతంలో ధనవంతులకు మాత్రమే సాధ్యమైన విమానయానం ఇప్పుడు సగటు వ్యక్తులకు కూడా నిత్యావసరం అవుతుంది. దీంతో విమానయాన పరిశ్రమ దినదిన ప్రవర్థమానంగా వెలిగిపోతోంది. అయితే ప్రయాణీకులు పెరగడంతో పాటు..వివాదాలు కూడా పెరుగుతున్నాయి. సామాన్య ప్రయాణీకుల నుంచి అత్యంత ముఖ్యులు కూడా విమాన ప్రయాణంలో వివాదాలు సృష్టిస్తున్నారు. వీరిలో వీవీఐపిలే ఎక్కువగా ఉంటున్నారు. విమానాశ్రయాల్లో వివాదాలు సృష్టించడం,గలాభా చేయటం, సిబ్బందిపై దాడులు చేయటం తరచూ జరుగుతోంది. దీన్ని అరికట్టడానికి విమానయానశాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు శుక్రవారం నాడు తెలిపింది. విమానాశ్రయాల్లో కానీ, విమానాల్లో కానీ వివాదాలు సృష్టించడం, అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్యమైన సంకేతాలు పంపించడం, దాడి చేయటం వంటి నేరాలకు పాల్పడితే వారిపై జీవితకాలం విమానాల్లో ప్రయాణించకుండా చర్యలు తీసుకుంటామని విమానయానశాఖ మంత్రి 'అశోక్‌గజపతిరాజు' తెలిపారు. మొత్తం మూడు రకాలైన శిక్షలు విధించబోతున్నాట్లు ఆయన తెలిపారు.

1.దూషించడం, మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్యంగా సైగలు చేయటం వంటి చర్యలకు పాల్పడితే మూడు మాసాలు పాటు విమానాల్లో ప్రయాణించడానికి అంగీకరించరు.

2.విమానయాన సిబ్బందిని కొట్టడం, నెట్టడం, అసభ్యంగా తాకటం వంటి చర్యలకు మూడు మాసాల నుంచి కొన్ని ఆరు మాసాల పాటు నిషేదానికి గురిచేస్తారు.

3.బెదిరింపులకు పాల్పడడం, విమానయాన సంస్థలను ధ్వంసం చేస్తే రెండు సంవత్సరాల నుంచి జీవితకాలం పాటు విమానాన్ని ఎక్కనీయరు. కొన్ని కొన్ని సంఘటనల్లో ఈ నేరాలకు శిక్షను ఇంకా పెంచడానికి కూడా అవకాశం ఉంది. 

ఇటీవల కాలంలో వీవీఐపీలు విమానయాన సిబ్బందిపై, విమానయాన సంస్థల ఆస్తులపై దాడులు చేయటంతో కఠినశిక్షలను అమలు చేయాలని విమానయానశాఖ ఆదేశాలు జారీ చేసింది. విమానయాన ప్రయాణీకులకు ఒక యునిక్‌ ఐడి కార్డును మంజూరు చేస్తారు. దీని ద్వారా ప్రయాణీకుడి పిఎన్‌ఆర్‌ నెంబర్‌కు సదరు యునిక్‌ ఐడిని అనుసంధానిస్తారు. టిక్కెట్‌ కొనుగోలు సమయంలో కానీ...లేదా పిఎన్‌ఆర్‌ జారీ చేసిన తరువాత కానీ సదరు ప్రయాణీకుడిపై ఎటువంటి నిషేదాలు ఉన్నాయో దీని ద్వారా బయటపడుతుందని విమానయానశాఖ సహాయమంత్రి 'జయంత్‌సిన్హా' తెలిపారు. నోప్లైలిస్ట్‌లో ఉన్న ప్రయాణీకుడు ఏ సంస్థ నిషేదం విధించిందో దానికే పరిమితం చేస్తారు. ఇండియాలో ఉన్న అన్ని విమానయాన సంస్థలకు ఇది వర్తించదు. అయితే ఇతర విమానయాన సంస్థలు సదరు నోప్లైలిస్ట్‌లో ఉన్న ప్రయాణీకుడిని ప్రయాణించాలా..? వద్దా...? అనే విషయంపై అవే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇటీవల కాలంలో మహారాష్ట్ర శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్‌ ఎయిర్‌ఇండియా సిబ్బందిని దూషించడంతో ఆయనపై ఆ సంస్థ నిషేదం విధించింది. దీంతో ఆయన ఇతర విమానయానసంస్థల్లో ప్రయాణించాలని భావించినా అవి కూడా ఆయనను తమ విమానాల్లో ప్రయాణించడానికి అంగీకరించలేదు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్లమెంట్‌లోనూ దీనిపై చర్చ జరిగింది. చివరకు ఎయిర్‌ఇండియా సిబ్బందికి 'రవీంద్ర గైక్వాడ్‌' క్షమాపణలు చెప్పడంతో వివాదం పరిష్కారమైంది. ఆయన ఒక్కరే కాదు...తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం పార్లమెంట్‌ సభ్యుడు 'జె.సి.దివాకర్‌రెడ్డి' కూడా ఇదే విధంగా వ్యవహరించారు. ఆయన విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ప్రింటర్‌నుఎత్తి కిందపడేశారు. దీంతో ఆ విమానయాన సంస్థ ఆయనపై నిషేదం విధించింది. చివరకు మంత్రి సుజనాచౌదరి దౌత్యంతో వివాదం సమిసిపోయింది. వైకాపాకు చెందిన 'మిధున్‌రెడ్డి' కూడా తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టు సిబ్బందిపై దాడి చేయటం దానిపై కేసులు నమోదు కావడం తెలిసిన విషయమే. కాగా అధికారం ఉంది కదా..అని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఇక మీదట ఇక్కట్లు తప్పకపోవచ్చు.


(379)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ