లేటెస్ట్

‘రోజా’ ప్రయత్నాలు ఫలిస్తాయా...?

ఆమె ఎన్నో సంవత్సరాలుగా సినిమాల్లో నటించి మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్రహీరోలతో నటించారు. సినిమాల్లో హీరోయిన్‌ అవకాశాలు తగ్గిపోయిన తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. టిడిపి పార్టీలో చేరి నాటి సిఎం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిపై విమర్శలు వర్షం కురిపించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తరువాత కాంగ్రెస్‌లో చేరి వై.ఎస్‌.మరణం తరువాత వైకాపాలో చేరారు. ఎమ్మెల్యే కావాలన్న తన కోరికను 2014 ఎన్నికల్లో నెరవేర్చుకున్నారు. వైకాపా తరుపున గెలిచిన రోజున ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తన చిరకాల వాంఛ నెరవేరిందనే ఆనందంతో ఉబ్బితబ్బయ్యారు. తరువాత 2019 ఎన్నికల్లోనూ గెలిచారు. ఇక మంత్రి పదవి తనకే ఖాయమని భావించినా ముఖ్యమంత్రి జగన్‌ ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఏపీఐసీసీ ఛైర్మన్‌ పదవిని మాత్రమే ఇచ్చారు. ఆ పదవీకాలం ఇటీవలే ముగిసిపోయింది. మరోసారి ఆమెకు ఏపీఐసీసీ ఛైర్మన్‌ పదవిని ఇస్తారని భావించినా ముఖ్యమంత్రి ఆమెను పక్కన పెట్టారు. తనకు పదవి ఇవ్వలేదు కనుక మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా తనకు మంత్రి పదవి వస్తుందని ఆమె ఆశిస్తున్నారు. అయితే ఆమె ఆశించిన దానికి విరుద్ధంగా ఆమె స్వంత నియోజకవర్గంలో స్వంత పార్టీ నాయకులు ఆమెకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు రాదని, ఆమెను ‘జగన్‌’ పక్కన పెట్టారని ప్రచారం చేస్తున్నారు.


నియోజకవర్గంలో రకరకాలుగా ఆమెకు ఆటంకాలను వారు కల్పిస్తున్నారు. తనకు ఎదురౌతున్న ఇబ్బందులపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసినా పార్టీ పెద్దలు ఎవరూ ఆమెను పట్టించుకోవడం లేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి పార్టీలోని ప్రత్యర్థులు తనకు కలిగిస్తున్న ఇబ్బందులను చెబుదామని ప్రయత్నిస్తే ఆమెకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ దొరకటం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా ఆమెకు జగన్‌ను కలిసే అవకాశం లేకపోవడంతో నిరాశ చెందుతున్న ఆమెకు నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా అవకాశం దొరికింది. మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో వచ్చిన అవకాశాన్ని ఆమె పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌పై ప్రశంసల జల్లులు కురిపించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమని, ఇంకేదో అని రకరకాలుగా భజన చేశారు. ఆ సభలో ఉన్న పలువురు మహిళలు ఇదెక్కడి భజనరా...? బాబూ..? అనుకున్నా ‘రోజా’ లెక్కపెట్టకుండా ‘జగన్‌’ను ప్రసన్నం చేసుకునేందుకు పలురకాలుగా ప్రయత్నించారు. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు టిడిపి అధినేత ‘చంద్రబాబునాయుడు’ ఆయన కుమారుడు ‘లోకేష్‌’ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ‘అచ్చెంనాయుడు’లను లక్ష్యంగా చేసుకుని విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా ‘అచ్చెంనాయుడు’పై బాడీషేమింగ్‌ వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యమంత్రి దృష్టిలో పడడానికి ఆమె చేసిన వ్యాఖ్యలు, చేసిన పొగడ్తలతో సభ దద్దరిల్లిపోయింది. మంచి వాగ్థాటి గల ‘రోజా’ ప్రసంగం ‘జగన్‌’ను ఎంత మేర మెప్పించిందో భవిష్యత్‌లో తేలుతుంది. మొత్తం మీద ‘రోజా’ చేసిన భజన, విమర్శలు ఆమెకు మంత్రి పదవి తెచ్చిపెడతాయో..? లేదో కానీ ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ దక్కుతుందని ఆమె వ్యతిరేకులు ఎద్దేవా చేస్తున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ