WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కెసిఆర్‌' తాజా సర్వేలో టిఆర్‌ఎస్‌కు 45 సీట్లే...!

ఓడలు బండ్లు.. బండ్లు...ఓడలు కావడం అంటే ఇదే మరి. నిన్నటి దాకా ఆంధ్రాలో అధికార తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా 'జగన్‌' పార్టీ గెలుస్తుందని ఒకటే ఊదరగొట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఇప్పుడు తెలంగాణలో చుక్కలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార టిఆర్‌ఎస్‌కు 45సీట్లకు మించి రావట. ఇదేదో...చెప్పింది కాదు...సాక్షాత్తూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తాజాగా చేయించిన సర్వేలో తేలిన విషయం. ప్రతి మూడు మాసాలకు ఒకసారి సర్వేలు నిర్వహించే కెసిఆర్‌కు తాజా సర్వే ఫలితాలు రుచించడంలేదు. మొన్నటి దాకా తెలంగాణలో ఉన్న 119 సీట్లలో వంద సీట్లు తాము గెలుస్తామని, తమ మిత్రపక్షమైన ఎంఐఎం ఏడు సీట్లు గెలుస్తుందని డాబులు పలికిన కెసిఆర్‌కు తాజా సర్వే మింగుడుపడడం లేదు. తాజా సర్వే ప్రకారం టిఆర్‌ఎస్‌కు 45, కాంగ్రెస్‌కు 45, ఎంఐఎంకు 5, తెలుగుదేశం పార్టీకి 20 సీట్లు, బిజెపికి  రెండు, సిపిఐ, సిపిఎంకు చెరో సీటు మాత్రమే వస్తాయని తేలిందట. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో హంగ్‌ అసెంబ్లీ రావడం ఖాయం. 

   గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్న టిఆర్‌ఎస్‌ పార్టీ తరువాత ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్పించుకుని బలపడింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి భారీగా వలసలను ప్రోత్సహించింది. ఆ పార్టీ తరుపున 15మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో 12మందిని పార్టీలో చేర్చుకుని తెలంగాణలో టిడిపిని నామ మాత్రంగా మార్చేసింది. అదే సమయంలో కాంగ్రెస్‌ నుంచి కూడా వలసలను ప్రోత్సహించింది. ఇక సిపిఐ ఎమ్మెల్యేను కూడా పార్టీలో చేర్చుకుని తెలంగాణలో తనకు తిరుగులేదని భావించింది. అదే సమయంలో వచ్చిన హైదరాబాద్‌ నగర పాలక ఎన్నికలు, అసెంబ్లీ ఉపఎన్నికలు, మెదక్‌ పార్లమెంట్‌ ఉపఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో విజయం సాధించింది. ప్రతిపక్షాలన్నీ నిర్వీర్యం కావడం, తెలంగాణ ప్రజలు కెసిఆర్‌ను గుడ్డిగా నమ్మడంతో గత మూడేళ్ల నుంచి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలవైఖరి కనిపించింది. తెలంగాణ సాధించిన పార్టీగా ఆ పార్టీని ప్రజలు ఇప్పటి వరకు ఆదరించారు. అయితే ఇటీవల కాలంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 

  తమను కెసిఆర్‌ ఊహల పల్లకి ఎక్కించి ఊరేగిస్తున్నారని...అంతకు మించి ఆయనేం చేయటం లేదనే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా తెలంగాణ కోసం పోరాడిన యువతలో కెసిఆర్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని నాడు నమ్మించి తమను ఉద్యమంలో వాడుకున్నారని, అయితే తెలంగాణ వచ్చి మూడేళ్లైనా ఇంత వరకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని యువత ఆగ్రహంతో ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమీషన్‌పై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న యువత ఆ సంస్థలో జరుగుతున్న అవకతవకలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. సంస్థ సభ్యులు తమ జీతాలను పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఉద్యోగాలను భర్తీ చేయటంలో కానీ, పరీక్షలు నిర్వహించడంలో కానీ చూపించడం లేదనే ఆగ్రహం వారి నుంచి వ్యక్తం అవుతుంది. ఇదే సమయంలో తెలంగాణలో వ్యవసాయం ఆధారపడిన రైతులు ఆత్మహత్యల బాటను పడుతున్నారు. 

  దేశంలో 'విదర్భ' తరువాత అత్యధిక రైతు ఆత్మహత్యలకు జరిగింది తెలంగాణలోనే. తెలంగాణ ఉద్యమ సమయంలో మందగించిన రియల్‌ఎస్టేట్‌ తరువాత పుంజుకోలేక పోయింది. మూలిగే నక్కపై తాడిపండు చందంలా దీనికి నోట్లరద్దు, జిఎస్‌టిలు తోడై ఈ రంగానికి కుదేలు చేసింది. హైదరాబాద్‌ మహానగరం చుట్టుపక్కలా వేలాది మంది ఆధారపడిన రియల్‌ఎస్టేట్‌ రంగం దెబ్బతినడంతో వీరందరికి ఉపాధి పోయింది. ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములకు సాగునీరు అందిస్తామన్న కెసిఆర్‌ హామీలు మాటలకే పరిమితమైందని వారు భావిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో వందలాది కోట్లు కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు,దానితో పాటు భూములు ఇవ్వని రైతులపై కక్షసాధింపు చర్యలు కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి కారణమైంది. సిఎం కెసిఆర్‌ తనయుడు కెటిఆర్‌ స్వంత నియోజకవర్గంలో ఎస్సీలపై జరిగిన దాడి..దానిపై జరిగిన రగడ జాతీయస్థాయిని ఆకర్షించింది. ప్రభుత్వంలో నలుగురు కుటుంబ సభ్యులు మాట మాత్రమే చెల్లుబాటు అవుతుందని, మిగతా వారంతా నామ మాత్రమేననే అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. ఇటీవల కాలంలో ఒక బలమైన సామాజికవర్గంతో ఏర్పడిన విభేదాలు టిఆర్‌ఎస్‌కు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ఆ సామాజికవర్గం ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలనే లక్ష్యంతో పనిచేస్తుండడం, దానిలో భాగంగా ఎక్కడికక్కడ టిఆర్‌ఎస్‌ ముఖ్యులను నిలదీస్తుండడం చికాకులు సృష్టిస్తోంది. తెలంగాణలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలమైన ఈ వర్గం కెసిఆర్‌తో తాడో పేడో తేల్చుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఇదీ కాక తెలంగాణ పొలిటికల్‌ ఛైర్మన్‌ కోదండరామ్‌తో కెసిఆర్‌ వ్యవహరించిన తీరు కూడా ఆ వర్గంలో అసంతృప్తి పెరగడానికి మరో కారణం. ఏది ఏమైనా భారీ ప్రచారం,హంగులతో టిఆర్‌ఎస్‌ నేతలు మూడేళ్ల కాలం నెట్టుకువచ్చినా రాబోయే ఏడాదిన్నరలో జరగబోయే ఎన్నికల్లో వారికి చుక్కెదురు కావడం ఖాయమని ఈ సర్వే తేల్చింది.


(2166)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ