లేటెస్ట్

‘కెసిఆర్‌’ లక్ష ఉద్యోగాలు..‘జగన్‌’ పీకలమీదకు తెస్తుందా..!?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంచలనం సృష్టించారు. ఒకేసారి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు ప్రకటించి నిరుద్యోగులను ఆనందంలో ముంచెత్తారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న పరిస్థితుల్లో కెసిఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల్లో గొప్ప ప్రభావం చూపిస్తుందనే మాట వివిధ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. ఏడాది లోపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు, 11వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ఆయన తెలియజేశారు. అంతే కాకుండా నిరుద్యోగుల వయోపరిమితి అన్ని క్యాటగిరీల్లో పది సంవత్సరాలు పెంచుతూ మరో నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయంపై నిరుద్యోగ యువత నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన నిర్ణయం తీసుకున్నా..ఇప్పటికైనా చేశారనే భావన వారిలో వ్యక్తం అవుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకముందు తెలంగాణ వస్తే ప్రతి ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆయన చెప్పేవారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అంతగా ఆసక్తిచూపలేదు. అసెంబ్లీలో ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్రతి ఇంటికో ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని, తాము అటువంటి హామీ ఇవ్వలేదని చెప్పారు. దీంతో తెలంగాణ నిరుద్యోగ యువత కెసిఆర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండోసారి ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత యువత ఆయనపై రగిలిపోయారు. కొన్ని నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో ఆయనపై ఒత్తిడి పెరిగింది. దీంతో అనేక జనాకర్షక విధానాలకు ఆయన తెరతీశారు. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి పదిలక్షల రూపాయలు ఇస్తామని హామీని ఇచ్చి దాన్ని కొంత వరకు అమలు చేశారు. ఇప్పుడు ఒకేసారి దాదాపు లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ ప్రకటన విడుదల చేయడం నిరుద్యోగవర్గాల్లో హర్షం వ్యక్తం కాగా, ప్రతిపక్షాలను ఆయన దిగ్భ్రాంతికి గురిచేశారు. ఈ విషయంపై వారు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 


కాగా పొరుగు రాష్ట్రంలో ఒకే సారి లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వడం ‘ఆంధ్రా’ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. వాస్తవానికి తాను అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది ‘జనవరి’లో ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్‌ విడుదల చేస్తానని ‘జగన్‌’ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఆయన మాటలను విశ్వసించిన యువత ఆయనకే ఓట్లు వేసి ఆయన పార్టీని భారీ మెజార్టీతో అధికారంలోకి తెచ్చారు. అయితే సిఎం అయిన తరువాత ‘జగన్‌’ తన హామీని నిలబెట్టుకోలేదు. యువత ఒత్తిడి చేయడంతో ఈ మధ్య క్యాలెండర్‌ అంటూ ఒక ప్రకటన చేశారు. దానిలో గ్రూప్‌`1, గ్రూప్‌`2కు 36 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీనిపై నిరుద్యోగ యువత ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించింది. అయితే అన్ని ఆందోళనలను ఎలా పట్టించుకోలేదో అదో విధంగా నిరుద్యోగయువత ఆందోళనలనూ ‘జగన్‌’ ప్రభుత్వం పట్టించుకోలేదు. అదే విధంగా కాంట్రాక్టు ఉద్యోగులను తాను అధికారంలోకి వస్తే క్రమబద్ధీకరణ చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌ దాన్ని కూడా అమలు చేయలేదు. నిరుద్యోగులకు, యువతకు ఎన్నో హామీలను ఇచ్చిన ‘జగన్‌’ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన లక్ష ఉద్యోగాల ప్రకటన ‘జగన్‌’కు ఇబ్బందులను తెచ్చిపెట్టబోతోంది. ఇప్పటికే ఉద్యోగులకే జీతాలను సక్రమంగా చెల్లించలేని పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాల కల్పన జరిగేపనే కాదనే అభిప్రాయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిశీలించేవారికి అర్థం అవుతోంది. మొత్తం మీద ‘కెసిఆర్‌’ లక్ష ఉద్యోగాల ప్రకటన ‘జగన్‌’ పీకలమీదకు తెచ్చిందనే మాట వినిపిస్తోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ