లేటెస్ట్

పొత్తులపై ‘పవన్‌’ సంకేతాలు ఇస్తారా...!?

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే భావన రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. రేపు వెలువడబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తే, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందనే అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే నిన్న మొన్నటి వరకు జమిలి ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని నరేంద్రమోడీ భావించారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదరదు కనుక ముందస్తు ఎన్నికలకు వెళతారనే వాదన ఉంది. కేంద్రంలో ‘మోడీ’ ముందస్తుకు వెళితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణలో 2023 సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కేంద్రం కనుక ముందస్తు ఎన్నికలకు వెళితే కేంద్ర ఎన్నికల సంఘం ‘తెలంగాణ’ ఎన్నికలను ముందుకు జరిపే అవకాశం ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ముందస్తు సంకేతాలు వెళువడుతున్నాయి. అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్న భావనతో, అది ఇంకా పెరగకుండా ఉండేందుకు తక్షణం ఎన్నికలకు వెళితే తమదే విజయమనే భావనతో సిఎం జగన్‌ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ‘తెలుగుదేశం’ పార్టీ ఇంకాపుంజుకోలేదని, మరో ప్రతిపక్ష పార్టీ అయిన ‘జనసేన’ కూడా అదే రీతిలో ఉంది కనుక ఇప్పుడు ముందస్తుకు వెళితే తనకు అనుకూలంగా ఉంటుందన్న భావనతో ‘జగన్‌’ ముందస్తు ఎన్నికలను కోరుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రాజకీయ కదిలకలను అంచనా వేస్తూన్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఇక ‘జనసేన’ కూడా అదే దారిలో ఉంది. 


దీనిలో భాగంగా ఈనెల 14వ తేదీన ‘జనసేన’ పార్టీ ఆవిర్భావ సభను మంగళగిరిలో నిర్వహించబోతోంది. ఈ సభలో తన రాజకీయ ఎత్తుగడలను, పొత్తులను అది వెల్లడిరచనుంది. ప్రస్తుతం ‘బిజెపి’ పొత్తులో ఉన్న ‘జనసేన’ అంత సౌకర్యంగా ఉన్నట్లు లేదు. అయితే రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ‘బిజెపి’ ఘనవిజయం సాధిస్తే ‘పవన్‌’ ఆ పార్టీతోనే ప్రస్తుతానికి ఉండారు. ఒక వేళ కనుక రేపటి ఎన్నికల ఫలితాల్లో బిజెపికి వ్యతిరేక ఫలితాలు వస్తే మంగళగిరి సభలో ‘పవన్‌’ ఆ పార్టీతో పొత్తు విషయంలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా తమతో పొత్తు కోసం ఎదురుచూస్తున్న ‘టిడిపి’కి అనుకూలంగా సంకేతాలు పంపే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ‘టిడిపి,జనసేన’లు కలిసిపోటీ చేయాలని ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు కోరుకుంటున్నారు. అయితే ‘టిడిపి’తో పొత్తుపెట్టుకుంటే తమకు వచ్చే లాభం ఏమిటో చెప్పాలనే భావన ‘జనసేన’ కార్యకర్తల్లో, సానుభూతిపరుల్లో ఉంది. తమ నేతకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని టిడిపీ ఇవ్వాలని వారు కోరుతున్నారు. కనీసం చెరి సగం రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నా ఫర్వాలేదనే భావన ఆ పార్టీ కార్యకర్తల్లో ఉంది. అయితే ‘టిడిపి’లో మాత్రం అటువంటి అంశాన్ని పరిశీలించడానికి కూడా ఒప్పుకోవడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలనుకుంటే కలిసిరావాలని, జగన్‌ పాలన నుంచి ప్రజలను విముక్తులను చేయాలనే భావన ‘జనసేన’లో ఉంటే తమతో పొత్తు పెట్టుకోవాలని, ఇప్పటికే అనుభవం లేని వారికి సిఎం పదవి ఇస్తే ఏమయిందో చూశారని, మళ్లీ ప్రజలు అటువంటి ప్రయోగాలు చేయబోరని, ‘పవన్‌’ తమతో కలిసివస్తే ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామని వారు అంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాలకు ప్రయోజనాలకు దక్కాలంటే అది ‘చంద్రబాబు’ వల్లనే అవుతుందనే భావన వారిలో వ్యక్తం అవుతోంది. కాగా 14వ తేదీన జరిగే ‘జనసేన’ పార్టీ ఆవిర్భావసభలో ‘పవన్‌’ ఏవిధమైన సంకేతాలు ఇస్తారు..? ఆయన ప్రసంగం ఎలా ఉంటుంది..? రాష్ట్రంలోని వైకాపా పాలనపై ఆయన ఏవిధంగా దండెత్తుతారు..? అనే విషయాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ